మధ్యప్రదేశ్‌ మురిసింది

ABN , First Publish Date - 2022-06-27T09:49:25+05:30 IST

మధ్యప్రదేశ్‌..దేశవాళీ క్రికెట్‌లో ఈ జట్టును ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కాదు.

మధ్యప్రదేశ్‌ మురిసింది

తొలిసారి రంజీట్రోఫీ కైవసం 

ఫైనల్లో 6 వికెట్లతో ముంబైపై ఘన విజయం 

బెంగళూరు: మధ్యప్రదేశ్‌..దేశవాళీ క్రికెట్‌లో ఈ జట్టును ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ అలాంటి పేరు, స్టార్లు లేని జట్టు అద్భుతం చేసింది. దేశవాళీ క్రికెట్‌ దిగ్గజంగా పేరుపొందిన 41 సార్లు చాంపియన్‌ ముంబైకి గట్టి షాకిచ్చి రంజీట్రోఫీ విజేతగా ఆవిర్భవించింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతోకాకుండా ఏకంగా లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ప్రతిష్ఠాత్మక కప్‌ను సగర్వంగా అందుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఎంపీ ఆరు వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.


108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదింది. ఛేదనలో రెండు పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయినా.. హిమాన్షు మంత్రి (37), తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరోలు శుభం శర్మ (30), రజత్‌ పటీదార్‌ (30 నాటౌట్‌) విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ 113/2 స్కోరుతో  చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై 269 పరుగులకే ఆలౌటైంది. సువేద్‌ పార్కర్‌ (51), సర్ఫరాజ్‌ ఖాన్‌ (45) రాణించారు. కుమార్‌ కార్తికేయ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374, మధ్యప్రదేశ్‌ 536 పరుగులు సాధించాయి. శుభం శర్మ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచారు. 


నాడు ఓడినా.. నేడు గెలిచాడు

సరిగ్గా 23 సంవత్సరాల క్రితం...చెన్నై వేదికగా జరిగిన రంజీ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ జట్టు కర్ణాటక చేతిలో ఓటమిపాలైంది. అత్యంత అరుదైన ఆ అవకాశాన్ని చేజార్చుకున్న అప్పటి మధ్యప్రదేశ్‌ జట్టు కెప్టెన్‌ చంద్రకాంత్‌ పండిట్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. కట్‌ చేస్తే...ఇప్పుడు మధ్యప్రదేశ్‌ కోచ్‌గా జట్టును విజయపథంలో నడిపి ట్రోఫీ కలను నెరవేర్చుకున్నాడు.

Updated Date - 2022-06-27T09:49:25+05:30 IST