మాధవ్‌.. తరిమి కొడతాం

ABN , First Publish Date - 2022-08-07T05:36:51+05:30 IST

‘ఖబడ్దార్‌ గోరంట్ల మాధవ్‌..! నీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి కమ్మ కులాన్ని దూషిస్తే తరిమికొడుతాం’ అని కమ్మ సంఘం నాయకులు హెచ్చరించారు.

మాధవ్‌.. తరిమి కొడతాం
ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

కమ్మ కులాన్ని దూషిస్తే ఊరుకోం.. పురం ఎంపీకి కమ్మ సంఘం హెచ్చరిక

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు 6: ‘ఖబడ్దార్‌ గోరంట్ల మాధవ్‌..! నీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి కమ్మ కులాన్ని దూషిస్తే తరిమికొడుతాం’ అని కమ్మ సంఘం నాయకులు హెచ్చరించారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లోని కమ్మభవన నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకూ శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కమ్మ సంఘం నాయకులు సరిపూటి రమణ, రాజారావు, నటేష్‌ చౌదరి, భూషణ తదితరులు మాధవ్‌ చిత్రపటాన్ని చెప్పుతోకొడుతూ నిరసన తెలిపారు. మహిళలను గౌరవించని ఎంపీ మాధవ్‌.. కురుబ కులంలో చెడబుట్టాడని అన్నారు. ఇలాంటి ఎంపీ సభ్య సమాజంలో ఉండటం ప్రమాదకరమని అన్నారు. వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తాను తప్పు చేయకపోతే నిరూపించుకోవాలిగాని, ఇలా కులాల మధ్య చిచ్చుపెట్టేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, కమ్మ కులస్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాసలీలల గోరంట్ల మాధవ్‌ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో నాయకులు నగేష్‌, శ్రీనివాస్‌ చౌదరి, గుర్రం ప్రతాప్‌, నారాయణస్వామి, బొమ్మినేని శివ తదితరులు పాల్గొన్నారు.





మాధవ్‌ చేష్టలు అనాగరికం.. తెలుగు మహిళల ఆగ్రహం

అనంతపురం అర్బన, ఆగస్టు 6: ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడటం అనాగరికమని, ఆయన చేష్టలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజశ్విని అన్నారు. నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట తెలుగు మహిళలు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత మహోత్సవ్‌ జరుపుకుంటోందని, ఇదే సమయంలో దేశ ప్రజలు తలదించుకునేలా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అసభ్యకరంగా వ్యవహరించారని విమర్శించారు. గతంలో వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. వైసీపీ నాయకులు ఏం చేసినా వారికి సీఎం జగన మద్దతు ఇస్తూ.. మౌనంగా ఉండటం సరికాదని అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ నీచమైన పనిచేసి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ, కమ్మ సామాజికవర్గంపై నోరుపారేసుకుంటున్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ విమర్శించారు. గోరంట్ల మాధవ్‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్‌, నాయకులు కూచి హరి, ధనుంజయనాయుడు, రాంబాబు, సరిపూటి శ్రీకాంత, సుధాకర్‌నాయుడు, శ్రీనివాస్‌ చౌదరి, గంగవరం బుజ్జి, మహిళా నాయకురాల్లు మనెమ్మ, శోభా, అయేషా పాల్గొన్నారు. 


స్వప్న హౌస్‌ అరెస్టు 

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై తెలుగు మహిళలు నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు భగ్నం చేసేందుకు యత్నించారు. నిరసన కార్యక్రమానికి వెళ్లనీకుండా తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్నను శనివారం హౌస్‌ అరెస్టు చేశారు. నగర అధ్యక్షురాలు విజయశ్రీ రెడ్డిని హౌస్‌ అరెస్టు చేసేందుకు పోలీసులు ఆమె ఇంటి వద్దకు వెళ్లారు. ఆమె వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లడంతో వెనుతిరిగారు. 

Updated Date - 2022-08-07T05:36:51+05:30 IST