Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పర్యావరణం ప్రజావరణమే

twitter-iconwatsapp-iconfb-icon
పర్యావరణం ప్రజావరణమే

జీవిత చమత్కారాలు కొన్ని ఆనందప్రదంగా ఉంటాయి. శాస్త్రవేత్తల కుటుంబం నుంచి వచ్చిన నేను విజ్ఞానశాస్త్రాలను అభ్యసించలేదు. అయితే నా జీవితంలో చాలా ముఖ్యమైన మేధో కృషిని ఒక వైజ్ఞానికుడితో కలిసి చేయడం జరిగింది. ఆ విజ్ఞాని మాధవ్‌ ధనంజయ గాడ్గిల్. ఈ నెల 24న ఈ నా గౌరవనీయ స్నేహితుడు 80వ వసంతంలోకి ప్రవేశించనున్నారు.


మాధవ్‌ గాడ్గిల్ పూణేలో జన్మించారు. బాంబేలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ శాస్త్రంలో పరిశోధన చేశారు. అనంతరం అక్కడే అధ్యాపకత్వం నిర్వహించారు. 1970ల తొలి సంవత్సరాలలో మాధవ్, ఆయన సతీమణి సులోచన (గణితశాస్త్రంలో హార్వర్డ్ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు) స్వదేశానికి తిరిగిరావడానికి నిర్ణయించుకున్నారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక వృత్తి జీవితాన్ని వదులుకుని, మాతృదేశంలో వైజ్ఞానిక పరిశోధనల వికాసానికి అంకితమవ్వాలని వారు నిశ్చయించుకున్నారు.

మాధవ్, సులోచనల వైజ్ఞానిక ఆసక్తులు, ప్రతిభాపాటవాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ సతీష్ ధావన్ గుర్తించారు. బెంగలూరులోని తమ కేంపస్‌లో వారికి పరిశోధనా బాధ్యతలను అప్పగించారు. ఋతుపవనాలపై పరిశోధన చేస్తున్న సులోచన ఐఐఎస్‌లో సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌ను నెలకొల్పడంలో ప్రధాన పాత్ర వహించారు. మాధవ్‌ ఐఐఎస్‌లో సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్‌కు వ్యవస్థాపకుడు అయ్యారు. ఆ పరిశోధనా కేంద్రంలో ఆయన ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చారు. వారి ప్రతిభాపాటవాల సంపూర్ణ వికాసానికి మాధవ్‌ అన్నివిధాల తోడ్పడ్డారు. పర్యావరణ పరిశోధనలో మాధవ్‌ కృషి గురించి ‘హౌ మచ్ ఎ పర్సన్ కన్స్యూమ్’ అన్న నా పుస్తకంలో విపులంగా రాశాను. ఈ కాలమ్‌లో ఆయనతో నా స్నేహ సంబంధాలు, నా మేధో కృషికి ఆయన తోడ్పాటు గురించి వివరిస్తాను.


1982 వేసవిలో మాధవ్‌ నాకు పరిచయమయ్యారు. పర్యావరణ క్షేత్ర పరిశోధనలకు ఆయన ప్రాధాన్యమిస్తున్న రోజులవి. బండిపూర్ నేషనల్ పార్క్‌లో ఏనుగుల ప్రవర్తనా రీతులను ఆయన అధ్యయనం చేస్తున్నారు. తన పరిశోధనలపై ప్రసంగించేందుకు డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ)కి ఆయన వచ్చారు. మా నాన్నగారు ఎఫ్ఆర్ఐలో శాస్త్రవేత్త. కలకత్తాలో పరిశోధక విద్యార్థిగా ఉన్న నేను వేసవి సెలవులకు డెహ్రాడూన్‌కు వచ్చాను. మాధవ్‌ ప్రసంగానికి నేనూ హాజరయ్యాను. అనంతరం నన్ను ఆయనకి పరిచయం చేశారు. చిప్కో ఉద్యమం మీద పరిశోధన చేస్తున్నానని చెప్పగా తాను బస చేసిన ఎఫ్ఆర్ఐ గెస్ట్ హౌస్‌కు ఆయన నన్ను ఆహ్వానించారు. అక్కడ వివిధ అంశాలపై మేము మాట్లాడుకున్నాం.

మాధవ్‌ తన క్షేత్ర పరిశోధనలలో సామాన్యుల జీవన వాస్తవాలను తెలుసుకున్నారు. నేషనల్ పార్క్‌లకు సమీపంలో నివశిస్తున్న రైతులు, ఆదివాసీల మధ్య ఘర్షణలు ఆయన ఆలోచనలను కొత్త పుంతలు తొక్కించాయి. అడవుల నిర్వహణపై ఆయన విశేష ఆసక్తి చూపారు. సంబంధిత రంగంలో ప్రభుత్వ విధానాలు వాణిజ్య ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడం, రైతుల, పశువుల కాపర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండడం ఆయన్ని దిగ్భ్రాంతి పరిచింది.


1992లో మాధవ్, నేనూ కలిసి This Fissured Land : An Ecological History of India అన్న పుస్తకాన్ని ప్రచురించాం. మనదేశంలో అడవులు ఎలా దుర్వినియోగమవుతున్నాయో వివరించాము. ఆర్థికాభివృద్ధి అనివార్యతలు, పర్యావరణ సుస్థిరత మధ్య ఘర్షణలను ఎలా నివారించవచ్చో నిర్మాణాత్మక సూచనలతో 1995లో Ecology and Equity : The Use and Abuse of Nature in Contemporary India అనే పుస్తకాన్ని ప్రచురించాం. ఈ రెండు పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ అవుతూనే ఉన్నాయి.

మాధవ్‌తో కలిసి పనిచేసేటప్పుడు ఎవరైనా కొత్త విషయాలు తప్పక నేర్చుకుంటారు. నేనూ నేర్చుకున్నానని మరి చెప్పనవసరం లేదు. అవి కేవలం మేధో, వైజ్ఞానిక సంబంధమైనవే కాకుండా సంస్థాగతమైనవి, వృతిగతమైనవి. నేను కలకత్తాలో పిహెచ్‌డి చేశాను. అప్పట్లో అక్కడి మేధా సంస్కృతిలో భూస్వామ్య మనస్తత్వ పోకడలు ఉండేవి. మార్క్సిస్టు ప్రొఫెసర్లు మరీ ఎక్కువగా ఫ్యూడల్ దృక్పథంతో వ్యవహరించేవారు. వయసులో ఒకరు మీకంటే కేవలం ఒక నెలరోజులు మాత్రమే పెద్ద అయినప్పటికీ సదరు వ్యక్తిని ‘దాదా’ అని పిలిచితీరాలి. అకడమిక్ సీనియర్ల మాటలను ప్రశ్నించడమనే ప్రసక్తే లేదు. మాధవ్‌తో నా సంబంధాలు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆయన కంటే పదహారు పంవత్సరాలు చిన్నవాడిని అయినప్పటికీ భయభక్తులతో కాకుండా స్వేచ్ఛగా ఉండేవాణ్ణి. మాధవ్‌ అనే ఆయన్ని పిలిచేవాణ్ణి. మేధో కృషిలో సమస్కంధులుగా మేము వాదించుకునేవాళ్లం. ఆయన ఆలోచనలపై జీవ పరిణామ సిద్ధాంత ప్రభావం బాగా ఉండేది. నా భావాలు, అభిప్రాయాలలో మార్క్సిజం ప్రభావం బాగా కన్పిస్తుందని ఆయన అనేవారు.


సామాజిక న్యాయం విషయమై మాధవ్‌ విశేష శ్రద్ధ చూపేవారు. అధికారంలో ఉన్నవారిని ఆయన సంశయించేవారు. రైతులు, పశుపాలకుల నుంచి మాధవ్‌ నేర్చుకున్న విషయాలు ఆయన పర్యావరణ పరిశోధనలకు బాగా ఉపక రించాయి. పర్యావరణ శాస్త్రం విశేషంగా లబ్ధి పొందిందనడంలో అతిశయోక్తిలేదు. వారి పట్ల కృతజ్ఞతగా వనరుల నిర్వహణలో ప్రయోజనకరంగా ఉండే కొన్ని సుస్థిర నమూనాలను ఆయన రూపొందించారు. ఇందుకు ఆయన స్థానిక సామాజిక సముదాయాలతో కలిసి పనిచేశారు. తద్వారా రైతుల సంక్షేమానికి ఆయన దోహదం చేశారు. ఈ అంశాలపై ఆయన తరుచు వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ధర్నాలలో పాల్గొనడం, ప్రభుత్వానికి సమష్టిగా సమర్పించే విజ్ఞాపన పత్రాలపై సంతకం చేయడం మొదలైన విషయాలలో ఆయన శ్రద్ధ చూపేవారు కాదు. ప్రభుత్వ ఆధికారుల తీరుతెన్నులను ఆయన సహజంగానే వ్యతిరేకించేవారు. సూటిగా, నిష్కపటంగా వ్యవహరించడమే ఆయన స్వతస్సిద్ధ స్వభావం. మాధవ్‌ తన మేధో కృషికి సంబంధించిన స్వీయచరిత్ర రాస్తున్నారు. అది వచ్చే ఏడాది ప్రచురితమవనున్నది. పశ్చిమ కనుమల పర్యావరణ రక్షణ విషయమై ఆయన నేతృత్వంలోని నిపుణుల సంఘం (‘పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల ప్యానెల్’ ఇది గాడ్గిల్ కమిటీగా ప్రసిద్ధమయింది) ఇచ్చిన నివేదిక గురించి అందులో విపులంగా ఉంటుంది. మైనింగ్ మొదలైన విధ్వంసక కార్యకలాపాల నుంచి కొండాకోనలను రక్షించాలని ఆ నివేదిక గట్టిగా సిఫారసు చేసింది. అడవుల పరిరక్షణలోనూ, సంబంధిత విధానాల రూపకల్పనలోనూ గ్రామ పంచాయత్‌లకు, స్థానిక సామాజిక సముదాయాలకు మరింత భాగస్వామ్యం కల్పించాలని మాధవ్‌ స్పష్టంగా సిఫారసు చేశారు. గాడ్గిల్ కమిటీ నివేదికకు కాంట్రాక్టర్లు– రాజకీయవేత్తలు– ప్రభుత్వాధికారుల సమూహం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే సమాజంలోని ప్రజాహిత శ్రేణులు దాన్ని స్వాగతించాయి. ఆ నివేదికను అమలుపరిచి ఉన్నట్టయితే ఇటీవలి సంవత్సరాలలో కేరళ, కర్ణాటక, గోవాలను అతలాకుతలం చేసిన పెను వరదలను నివారించడం సుసాధ్యమై ఉండేదనడంలో సందేహం లేదు.

మాధవ్‌ గాడ్గిల్ నాకు నాలుగు దశాబ్దాలుగా సుపరిచితుడు. ఈ నా ప్రియమైన, గౌరవనీయమైన స్నేహితుడు, సహచరుడి గురించి నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన గృహంలోనూ, మా ఇంటి వద్ద, ఐఐఎస్ డైనింగ్ హాల్‌లోనూ, వివిధ నగరాలలో పాల్గొన్న సదస్సులు, సమావేశాలలోనూ, ఉభయలమూ కలిసి చేసిన బస్, రైల్ ప్రయాణాలలోనూ వివిధ అంశాలపై మా మాటా మంతీ మొదలైన వాటి గురించి మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ తలపోతల సందోహంలో ఒక దాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోదలుచుకున్నాను. అది, ఆయనకు ప్రియాతి ప్రియమైన పశ్చిమ కనుమలకు సంబంధించినది.

మాధవ్‌ సమున్నతంగా గౌరవించే వారిలో కీర్తిశేషుడు ఫాదర్ సీసిల్ జె.సల్దన్హ ఒకరు. జెస్యూట్ మతాచార్యుడు అయిన సల్దన్హ తన చర్చి వైజ్ఞానిక సంప్రదాయాలకు సంపూర్ణ వారసుడు. తన కన్నభూమి కర్ణాటకలోని వృక్షజాలంపై ఆయన ఒక ప్రామాణిక గ్రంథాన్ని రాశారు. కన్నడ ప్రాంతాల అడవులు, మైదానాలలోని వృక్షాలకు సంబంధించిన తన ఫోటోగ్రాఫ్‌ల ప్రదర్శనకు సల్దన్హ సన్నాహాలు చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆయన వాటిని సెంటర్ ఫర్ ఎకొలాజికల్ సైన్సెస్ నడవాలలో ఉంచారు. అప్పటికి ఆ ఫోటోలకు ఆయన ఎటువంటి శీర్షికలు పెట్టలేదు. నన్ను విశేషంగా ఆకట్టుకున్న ఆ ఫోటోలను మాధవ్‌కు చూపించి, అది ఏ ప్రదేశానికి సంబంధించినదో చెప్పగలరా అని అడిగాను. మాధవ్‌ అప్రయత్న పూర్వకంగా ఏ అటవీ ప్రాంతంలో ఏ పక్షి జాతి ప్రముఖంగా ఉంటుందీ, వివిధ ప్రాంతాలలోని వాగు, ఏరు, నదుల పేర్లు, ఏ విద్యుత్ స్తంభానికి ఏ గ్రామం సమీపంలో ఉండేది విపులంగా వివరించారు. పశ్చిమ కనుమలకు సంబంధించిన ఆయన సమగ్ర పరిజ్ఞానానికి నేను చకితుడిని అయ్యాను (నేనూ క్షేత్ర పరిశోధకుడినే అయినప్పటికీ పరిసరాలపై నా ఆసక్తి అంత సమగ్రమైనది కాదు). విస్మయం నన్ను ముప్పిరి గొలిపింది. నా మనసులో మాధవ్‌ పట్ల గౌరవాదరాలు మిక్కుటమయ్యాయి. ఈ నా అనుభవాన్ని ఇప్పటికీ సంతోషపూర్వకంగా మననం చేసుకుంటుంటాను.

పర్యావరణం ప్రజావరణమే

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.