మేడ్‌ ఇన్‌ మయన్మార్‌

ABN , First Publish Date - 2020-05-25T09:27:20+05:30 IST

మయన్మార్‌లో నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన సిగరెట్లను ‘పారిస్‌’ బ్రాండ్‌తో బయటి

మేడ్‌ ఇన్‌ మయన్మార్‌

పొగరాయుళ్లను గ‘మ్మత్తు’గా మాయచేస్తోంది మాఫియా. పక్క దేశాల్లో ప్రమాణాలకు పాతరేసి తయారు చేసిన సిగరెట్లకు ప్రాచుర్యం ఉన్న దేశాల పేర్లను బ్రాండ్లుగా మార్చేసుకుంటున్నారు.


ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నకిలీ సిగరెట్ల మారకంలో అనేక మెలకువలు ఎరిగిన మాఫియాతో విజయవాడ లింక్‌లు కలుస్తున్నాయి. కొంతకాలంగా వివిధ మార్గాల్లో విజయవాడకు వస్తున్న నకిలీ సిగరెట్ల బాగోతం డీఆర్‌ఐ, ఎస్‌జీఎస్టీ అధికారులు సంయుక్తంగా చేసిన దాడులతో బయటపడింది.



ఆంధ్రజ్యోతి - విజయవాడ :  మయన్మార్‌లో నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన సిగరెట్లను ‘పారిస్‌’ బ్రాండ్‌తో బయటి రాష్ట్రాలకు పంపేస్తున్నారు. చాటుమాటున ఢిల్లీకి చేరిన ఆ సిగరెట్లను సీక్రెట్‌గా విజయవాడ కూడా చేరుస్తున్నారు మాఫియా.  


మయన్మార్‌ నుంచి సరుకును ముందుగా ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి భారీ ట్రక్‌లు, గూడ్స్‌ వాహనాలను ఉపయోగించుకుని, అందులోని డ్రైవర్లను తమ దారికి తెచ్చుకుంటున్నారు. మామూలు లారీల్లో తరలిస్తే అధికారులకు దొరికిపోయే అవకాశం ఉందని గుర్తించిన మాఫియా భారీ ట్రక్కులను ఉపయోగించుకుం టోంది. పెద్దపెద్ద వస్తువులను పార్శిల్‌ చేసే గోనె సంచుల్లో ఈ సిగరెట్ల బాక్స్‌లను పెట్టి కుట్టేస్తున్నారు.


వారిని కంటైనర్ల లోపల పెట్టి గుట్టుచప్పుడు కాకుండా వివిధ రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. పెట్టెలపై పారిస్‌ ముద్రను, దానికి గుర్తుగా ఈఫిల్‌ టవర్‌ బొమ్మను ముద్రిస్తున్నారు. టుబాకో చట్టం ప్రకారం సిగరెట్‌ పెట్టెపై కొన్ని హెచ్చరికలు ఉండాలి. దానితోపాటు పుర్రె బొమ్మ ఉండాలి. ఈ బాక్స్‌లపై పుర్రె బొమ్మలు ఎక్కడా కనిపించలేదు. స్మోకింగ్‌ కిల్స్‌, టుబాకో కాజెస్‌ మౌత్‌ కేన్సర్‌ అని మాత్రమే రాసి ఉన్నాయి.


ఈ సిగరెట్‌ పెట్టెలను స్టీల్‌ బాక్స్‌లో పెట్టి పార్శిల్‌ చేశారు. ట్రక్కు రాజఽస్థాన్‌ రిజిస్ట్రేషన్‌కు చెందినది కావడంతో సిగరెట్లు అక్కడి నుంచి వచ్చాయా? ఢిల్లీ నుంచి వచ్చాయా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అధికారులు ఇద్దరు డ్రైవర్లను విచారించినా వివరాలు మాత్రం చెప్పలేదు. ట్రక్కు ఢిల్లీ నుంచి బయలుదేరిందని మాత్రమే చెప్పారు. ట్రక్కులో ఉన్న రూ.29.99లక్షల విలువచేసే సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-05-25T09:27:20+05:30 IST