ఉద్యోగం వదిలేసి ఊరికి వచ్చిన యువకునికి బ్రహ్మరథం... కారణమిదే!

ABN , First Publish Date - 2022-03-20T15:04:37+05:30 IST

అతను ఉద్యోగం మానేసినప్పుడు అందరూ హేళన చేశారు...

ఉద్యోగం వదిలేసి ఊరికి వచ్చిన యువకునికి బ్రహ్మరథం... కారణమిదే!

అతను ఉద్యోగం మానేసినప్పుడు అందరూ  హేళన చేశారు.. ఇప్పుడు అతను చేస్తున్న పనిని చూసి భేష్ అంటున్నారు. యూపీలోని ఘాజీపూర్ నివాసి సిద్ధార్థ్ రాయ్ 2012లో ఎంబీఏ చేశారు. గోల్డ్ మెడల్ సాధించాడు. బహుళజాతి కంపెనీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ కూడా పొందాడు. రెండేళ్ల తర్వాత రైల్వేలో రెగ్యులర్ ఉద్యోగం దొరికింది. మంచి జీతం, స్థిరమైన జీవితం దక్కాయి. కానీ సిద్ధార్థ్‌కి ఇవి తృప్తినివ్వలేదు. ఐదేళ్ల తరువాత అతను ఉద్యోగం వదిలి గ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఇక్కడ తన బంజరు భూమిలో చెరువు తవ్వి.. రెండు ఆవులను పెంచాడు. దీనిని చూసిన గ్రామంలోని పలువురు.. ఆవు పేడ ఏరుతున్నాడంటూ ఎగతాళి చేశారు. అతని కుటుంబం కూడా సహకరించలేదు. 


అయినా అతను ఎక్కడా వెనుకడుగు వేయలేదు. జీరో కాస్ట్ ఫార్మింగ్‌కు సిద్ధమయ్యాడు. సిద్ధార్థ్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి చాలా కాలం క్రితం చనిపోయాడు. తరువాత తల్లి.. సిద్ధార్థ్‌ను చదివించింది. సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ.. నాకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా సంతోషించారు. అయితే ఆ ఉద్యోగంలో నాకు తృప్తి కలగలేదు. మన పని మరొకరికి ప్రయోజనం కలిగించనంత కాలం అది వృథానే అని అనిపించింది. అదే ఉద్దేశ్యంతో 2019లో ఉద్యోగం వదిలేసి గ్రామానికి వచ్చాను. ప్రస్తుతం సిద్ధార్థ్ వద్ద 18 రకాల ఆవులు ఉన్నాయి. అంతే కాకుండా ఇతర రైతుల నుంచి పాలను సేకరించి, ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. దీని తరువాత సిద్ధార్థ ఒక చిన్న భూమిలో ఒక చెరువును తవ్వి అందులో చేపల పెంపకం చేపట్టాడు. పక్కనే ఒక పాక వేసి, రెండు ఆవులను కట్టాడు. దీంతో అతనికి పిచ్చి పట్టిందని కుటుంబీకులు, గ్రామస్థులు విమర్శించడం మొదలుపెట్టారు. అయినా సిద్ధార్థ్ వెనుకడుగు వేయలేదు. తన పనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అతనికి బాగా తెలుసు. చెరువులో చేపలు పట్టడం మాత్రమే కాదని.. ఇంకేదో చేయాలని అనుకున్నాడు. అతని మదిలో బాతులు పెంచాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన చెరువులో బాతులను పెంచాడు. అది కూడా లాభదాయకంగా నడిచింది. అతని సంపాదన కూడా పెరిగింది. కరోనా సమయంలో సిద్ధార్థ్..కరోనా వ్యాప్తిని నివారించడానికి గాజు సీసాలలో పాలను పంపిణీ చేయడం ప్రారంభించాడు.  ప్రస్తుతం రోజూ వందల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నాడు. మెల్లమెల్లగా ఆవుల సంఖ్యను కూడా పెంచాడు. ఇంతలో కరోనా విజృంభణతో వ్యాపారం నిలిచిపోయింది. తరువాత పరిస్థితులు చక్కబడ్డాయి. 


ప్రస్తుతం సిద్ధార్థ్‌ దగ్గర 18 ఆవులు ఉండగా, 122 మందికి పైగా రైతులు అతనికి పాలు సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ వందల లీటర్ల పాలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీనికితోడు ఇటీవలే చెరువులో నిర్మించిన సెలబ్రేషన్ పాయింట్‌కు డిమాండ్ పెరిగింది.  అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతోంది. ఇప్పుడు సిద్ధార్థ్ ఆవులు, బాతుల తర్వాత మేకలు, గుర్రాలు, ఒంటెలను కూడా పెంచుకున్నాడు. ఫలితంగా జనం తమ సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారు కొందరు చేపలు, బాతులకు ఆహారం ఇస్తుంటారు. మరికొందరు గుర్రపు స్వారీ చేస్తుంటారు. ఇలీవలే సిద్ధార్థ్ ఒక రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించాడు. అక్కడ సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన ఆహారాన్ని ఆహార ప్రియులకు అందిస్తున్నారు. తన రెండెకరాల భూమిని గ్రామంగా మార్చుకున్నాడు. దానికి ఖుర్పీ అని పేరు పెట్టాడు.  ఈ గ్రామానికి రావాలంటే ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఇక్కడ పాలు, నెయ్యి, మట్టి పాత్రలు వంటి తమ విభిన్న ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ప్రతిరోజు 500 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు. సిద్ధార్థ్, అతని బృందం రైల్వే స్టేషన్, మురికివాడలకు వెళ్లి పేదలకు ఆహారం అందిస్తారు. అనాథ పిల్లల చదువుల బాధ్యత కూడా సిద్ధార్థ తీసుకున్నాడు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు సిద్ధార్థ్ సేవలను ఎంతగానో మెచ్చుకున్నారు. 

Updated Date - 2022-03-20T15:04:37+05:30 IST