భక్తులతో కిక్కిరిసిన మేడారం

ABN , First Publish Date - 2021-02-25T08:23:13+05:30 IST

వన దేవతల ఉత్సవం మేడారం మినీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తొలి రోజు మండెమెలిగే పండుగను వైభవంగా నిర్వహించారు.

భక్తులతో కిక్కిరిసిన మేడారం

మినీ జాతర ప్రారంభం.. మొక్కులు చెల్లించుకున్న లక్ష మంది 

మేడారం, ఫిబ్రవరి 24 : వన దేవతల ఉత్సవం మేడారం మినీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తొలి రోజు మండెమెలిగే పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించుకున్నారు. ముందుగా గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు. గ్రామ దిగ్బంధం చేసి తల్లుల గద్దెల ముందు ప్రధాన రహదారిపై ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాకను ఆరగించి మామిడి తోరణాలు కట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతల గద్దెల ప్రాంతంలో బుధవారం రాత్రంతా జాగారం చేశారు. అదే విధంగా కన్నెపల్లిలో సారలమ్మకు కాక వంశీయులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మినీ జాతర సందర్భంగా తొలి రోజు మేడారానికి లక్ష మంది భక్తులు వచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.


సమ్మక్క తల్లి పుట్టినిల్లు బయ్యక్కపేటలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున చంద వంశీయులు జాతర నిర్వహిస్తారు. ఇందుకు బుధవారం ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం దేవునిగుట్ట నుంచి సమ్మక్కను వడ్డెలు గ్రామశివారులో ఉన్న గద్దెకు తీసుకొస్తారు. కాగా, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. తల్లులకు పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం), చీర, సారె, పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మినీ జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు.

Updated Date - 2021-02-25T08:23:13+05:30 IST