చిత్తూరు జిల్లా: మదనపల్లె ఘటనలో కొత్త విషయాలు

ABN , First Publish Date - 2021-01-25T18:46:54+05:30 IST

మదనపల్లెలో ఇద్దరు కుమార్తెలను మంత్రాల పేరుతో కన్న తల్లే హత్య చేసిన ఘటన..

చిత్తూరు జిల్లా: మదనపల్లె ఘటనలో కొత్త విషయాలు

చిత్తూరు జిల్లా: మదనపల్లెలో ఇద్దరు కుమార్తెలను మంత్రాల పేరుతో కన్న తల్లే హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ఒకరైన సాయి దివ్య మూడు రోజుల క్రితం సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టినట్లుగా విచారణలో తేలింది. ‘శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరచూ ఘటన జరిగిన ఇంట్లో పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పూటేజీలను పరిశీలిస్తున్నారు.


ఇప్పటికే మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంట్లోనే విచారిస్తున్నారు. ఆ నివాసంలో దేవుళ్లతోపాటు చిత్ర విచిత్రంగా ఉన్న ఫోటోలను పోలీసులు గమనించారు. నిందితులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. వైద్యుల సలహాతోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఆధారాలను సేకరించేందుకు సోమవారం ఉదయం క్లూస్ టీమ్ కూడా మదనపల్లెకు వెళ్లింది.


కాగా చిన్న కుమార్తె సాయి దివ్య వారం రోజుల నుండి విచిత్రంగా ప్రవర్తిస్తోందని, ఇంటిపైకి ఎక్కి దూకేస్తానంటూ హడావిడి చేయడంతో మంత్ర సంబంధం తగిలిందనే ఉద్దేశంతో పూజలకు పూనుకున్నట్లు తల్లి పద్మజ చెప్పింది. పెద్దకుమార్తె అలేఖ్య కూడా ఇదే ట్రాక్‌లోకి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ వింతవింతగా ప్రవర్తించడంతో క్షుద్ర పూజకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు ఆమె తెలిపింది. నాలుగు రోజుల నుంచి పూజలు చేస్తున్నామని, అతీంద్రియ శక్తుల వల్ల సాయి దివ్య ఇంటిలోని తలుపులు సైతం తీసి పెట్టిందని, ఒక్కోసారి ఒక్కో రకంగా వింతగా ప్రవర్తిస్తోందని తల్లి తెలిపింది. కాగా హత్యకు గురైన అలేఖ్య, సాయిదివ్యల శవపంచనామా పూర్తి అయింది. మరోవైపు నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-25T18:46:54+05:30 IST