మువ్వన్నెల జెండాలతో మురిసిన మదనపల్లె

ABN , First Publish Date - 2022-08-13T04:38:45+05:30 IST

నాడు స్వాతంత్య్రపోరాటంలో వేదికగా నిలిచిన గడ్డ, 75 ఏళ్ల తరువాత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా మువ్వన్నెల జెండాల రెపరెపలతో మురిసి పోయింది.

మువ్వన్నెల జెండాలతో మురిసిన మదనపల్లె
జడ్పీహైస్కూల్లో జాతీయపతాకాలు ఊపుతున్న విద్యార్థులు

10వేల మంది విద్యార్థులతో మహార్యాలీ

జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 12: నాడు స్వాతంత్య్రపోరాటంలో వేదికగా నిలిచిన గడ్డ, 75 ఏళ్ల తరువాత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా మువ్వన్నెల జెండాల రెపరెపలతో మురిసి పోయింది. మదనపల్లెకు చెందిన స్వాతంత్య్ర ఉద్యమవీరుల త్యాగానికి గౌరవంగా పదివేల మంది విద్యార్థులు పట్టణంలో మహార్యాలీ నిర్వహించి దేశభక్తి చాటుకున్నారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మదనపల్లె ఆర్డీవో ఎంఎస్‌ మురళి ఆధ్వర్యంలో మదన పల్లెలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వేదికపై కలెక్టర్‌ గిరీషా, జేసీ తమీమ్‌ అన్సారియా, మదనపల్లె, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీషా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రాత్మక నేపథ్యం వున్న మదనపల్లె పట్టణంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో పాల్గొనడం గర్వకారణంగా వుందన్నారు. మహనీయుల త్యాగాలను గుర్తుంచుకుంటూ ఈనెల 15 తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలన్నారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేస్తే నేడు మనం స్వాతంత్య్రం అనుభవిస్తున్నామని, నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ 75ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందేలా ఈ ఉత్సవాలు నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. అనంతరం ప్రారంభమైన మహార్యాలీ జడ్పీ హైస్కూల్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌, టౌన్‌బ్యాంకు సర్కిల్‌, బెంగళూరు బస్టాండు, బీసెంట్‌ సర్కిల్‌, సొసైటీకాలనీ మీదుగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు కొనసాగింది. ప్రతి విద్యార్థి జాతీయ జెండాలు చేతపట్టి, దేశభక్తి నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ షమీంఅస్లాం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ, ఎంపీపీ రెడ్డెమ్మ, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు, కళాకారులు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు, కళాకారులను ఆర్డీవో మురళి సత్కరించారు.


జాతిపిత విగ్రహావిష్కరణ


మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ద్యానముద్రలో ఉన్న జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని కలెక్టర్‌ గిరీషా ఆవిష్కరించారు. జేసీ తమీమ్‌అన్సారియా, ఎమ్మెల్యే నవాజ్‌బాషా, ఆర్డీవో మురళి చేతుల మీదుగా గాంధీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. గతంలో సబ్‌ కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహానికి ధీటుగా రూపొందించిన కొత్త గాంఽధీ విగ్రహం పలువురిని అకట్టుకుంటోంది. సబ్‌కలెక్టరేట్‌ డీఏవో శేషయ్య, తహసీల్దార్లు శ్రీనివాసులు, ఫిరోజ్‌ఖాన్‌, విశ్వేశ్వరశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


జాతీయపతాకాలతో విద్యార్థుల ప్రదర్శన

మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జాతీయ పతాకాలతో నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థినులు ప్రతి ఒక్కరు జాతీయపతాకం చేతపట్టి దేశభక్తి ఉట్టిపడేలా నినాదాలు చేశారు.




Updated Date - 2022-08-13T04:38:45+05:30 IST