ఒకే ఒక్క పర్యాటకుడి కోసం తెరుచుకున్న ‘మాచుపిచు’

ABN , First Publish Date - 2020-10-14T02:22:39+05:30 IST

అనుకోని సంఘటనలు కొన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తితే, మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది

ఒకే ఒక్క పర్యాటకుడి కోసం తెరుచుకున్న ‘మాచుపిచు’

లిమా: అనుకోని సంఘటనలు కొన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తితే, మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఆశ్చర్యానికి గురిచేసే ఘటనే. పెరూలో జరిగింది.


జపాన్‌లోని నారాకు చెందిన 26 ఏళ్ల బాక్సింగ్ శిక్షకుడు జెస్సీ కటయామా ప్రముఖ పర్యాటక ప్రదేశమైన మాచుపిచును తిలకించేందుకు మార్చి మధ్యలో పెరూ చేరుకున్నాడు. అదే సమయంలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అక్కడ చిక్కుకుపోయాడు. దీంతో మాచుపిచును తిలకించాలన్న అతడి ఆశ నెరవేరకపోగా అక్కడే చిక్కుకుపోయాడు. 


నిజానికి మూడు రోజులు మాచుపిచులో గడిపి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే అతడు పెరులో అడుగుపెట్టాడు. చేతిలో ఎంట్రీ టికెట్ ఉన్నప్పటికీ అతడి కోరిక మాత్రం నెరవేరలేదు. అయితే, దానిని చూడందే వెనక్కి వెళ్లకూడదని కటయామా నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసిన ప్రభుత్వం అతడి ఒక్కడి కోసం మాచుపిచును తిరిగి తెరవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్టే అతడి ఒక్కడి కోసం మాచుపిచును తెరవడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. 


‘‘లాక్‌డౌన్ తర్వాత మాచుపిచును సందర్శించిన ఈ భూమ్మీది తొలి వ్యక్తిని నేనే’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్టు చేసి ఆనందం పంచుకున్నాడు. ‘‘నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ధన్యవాదాలు’’ అని కుస్కోలోని స్థానిక పర్యాటక శాఖ ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసింది.


తానిక మాచుపిచును చూడలేనేమోనని అనుకున్నానని, కానీ మేయర్, ప్రభుత్వానికి తన గురించి చెప్పి తన కలలను నిజం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. ఇది తనకు దక్కిన అత్యంత ప్రత్యేకమైన అవకాశమని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. 


16వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమణకు ముందు పశ్చిమ దక్షిణ అమెరికాను 100 సంవత్సరాల పాటు పాలించిన ఇన్‌కా సామ్రాజ్యానికి చెందిన అత్యంత శాశ్వతమైన వారసత్వం మాచుపిచు. శిథిలమైన ఇన్‌కా ప్రాంతాన్ని 1911లో అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బింఘమ్ కనుగొన్నాడు. 1983లో యునెస్కో మాచుపిచును ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 

Updated Date - 2020-10-14T02:22:39+05:30 IST