యంత్రం.. ఏదీ అందే మంత్రం

ABN , First Publish Date - 2022-05-22T06:29:09+05:30 IST

అన్నదాతలు ఆధునిక పద్ధతులలో సాగు చేసేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ఎందుకూ కొరగాకుండా పోయింది.

యంత్రం.. ఏదీ  అందే మంత్రం

  1. రైతుల దరి చేరని వైఎస్సార్‌ ‘యంత్ర సేవా పథకం’ 
  2. జిల్లాలో సగం ఆర్బీకేలకు కూడా అందని రాయితీ ట్రాక్టర్లు 

ఆదోని (అగ్రికల్చర్‌), మే 21: అన్నదాతలు ఆధునిక పద్ధతులలో సాగు చేసేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఈ పథకం కింద రాయితీపై ఇవ్వాల్సిన యంత్రాలు రైతులకు అందడం లేదు. జిల్లాలో సగం ఆర్బీకేలకు రాయితీ ట్రాక్టర్లు అందలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా గతంలో వ్యక్తిగతంగా రాయితీపై యంత్రాలు అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బృందంగా ఏర్పడితేనే అందించాలని నిర్ణయించారు. ఆవిధంగా తీసుకున్నా ఇప్పటి వరకు  సగం ఆర్బీకేలకు కూడా అందించని పరిస్థితి ఉంది. 

    జిల్లాలో 466 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి రైతుమిత్ర గ్రూపులకు యంత్రసేవా పథకం కింద సాగు పరికరాలను ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది ఒక్కో రైతుమిత్ర బృందంలో ఐదుగురు నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు. యూనిట్‌ మొత్తంలో 50శాతం బ్యాంకు రుణం కాగా... 40శాతం ప్రభుత్వ రాయితీ, 10శాతం లబ్ధిదారుడి వాటా కింద చెల్లించాలి. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద  రూ.15 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలు, పవర్‌ రీడర్లు, ప్యాడి రేపర్స్‌, కల్టివేటర్స్‌, దుక్కి యంత్రాలు, రోటావేటర్‌, నూర్పిడి యంత్రాలు, స్ర్పేయర్లు,  బ్రెష్‌ కట్టర్‌, కేజీవీల్స్‌తోపాటు ట్రాక్టర్‌ రాయితీపై అందజేస్తారు. జిల్లాలో సగం ఆర్బీకేలకు కూడా రాయితీ వైఎస్సార్‌ యంత్రసేవా పథకం అందలేదు. ఇప్పటి వరకు 268 ట్రాక్టర్లు, పరికరాలను మాత్రమే అందజేశారు. 


వ్యక్తిగత పథకాలకు మంగళం

గతంలో రైతులకు వ్యక్తిగతంగా రాయితీపై యంత్ర పరికరాలు అందించేవారు.  ఈ విధానానికి వైసీపీ ప్రభుత్వం మంగళం పాడేసింది. రైతుమిత్ర గ్రూపులకు మాత్రమే రాయితీ పరికరాలను అందిస్తున్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రయోజనం పొందిన వారు అధికంగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి యంత్రాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆర్బీకేల వద్ద అందుబాటులో ఉంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అద్దెకు ఇవ్వాలని నిబంధన ఉంది. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. 


కొన్నిటికే పరిమితం

ఖరీఫ్‌ సీజన్‌ 15 రోజుల్లో ప్రారంభం కానుంది. రైతులకు వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ చాలా కీలకం. దుక్కిదున్నిన నాటి నుంచి పంట ఇంటికి తరలించే వరకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ట్రాక్టర్‌ ఉంటేనే కొన్ని పనులకు ఉపయోగపడుతుంది. జిల్లాలో 466 ఆర్బీకేలు ఉండగా, 268 గ్రూపులకు మాత్రమే ట్రాక్టర్లు అందించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆదోని మండలంలో 36 గ్రామాల్లో ఆర్బీకేలు ఉన్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా 22 ట్రాక్టర్లు, పరికరాలను అందజేశారు. ఇంకా 14 ఆర్బీకేలకు వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా రైతులకు యంత్రాలు అందలేదు. 


150 ట్రాక్టర్లు అందిస్తాం 

వచ్చే నెలలో మెగా మేళా ద్వారా రైతుమిత్ర గ్రూపులకు 150 ట్రాక్టర్లను, యంత్ర పరికరాలను వైఎస్సార్‌ సేవా పథకం ద్వారా అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రూపుల నుంచి దరఖాస్తులు అందాయి. రైతు బృందాలు గ్రామాల్లో యంత్రాలను అద్దెకు ఇచ్చి వ్యవసాయం చేసుకోవాలని సూచించాం. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది వ్యక్తిగతంగా కూడా వ్యవసాయ యాంత్ర పనిముట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

 వరలక్ష్మి, జేడీఏ, కర్నూలు 



Updated Date - 2022-05-22T06:29:09+05:30 IST