కిట్టు..కు ఏంటి?

ABN , First Publish Date - 2022-06-30T05:47:17+05:30 IST

కిట్టు..కు ఏంటి?

కిట్టు..కు ఏంటి?
పేర్ని కిట్టూను ఉద్దేశించి కొడాలి నాని ప్రసంగం

మచిలీపట్నం వైసీపీ ప్లీనరీలో ఆద్యంతం పేర్ని కిట్టు భజన

మంత్రి జోగి రమేశ్‌ మొదలు అందరిదీ అదే దారి

కిట్టూకు అసెంబ్లీ టికెట్‌ ఖరారు చేసిన కొడాలి నాని

వారసత్వం కాదు.. సత్తువ కావాలంటున్న సొంత నేతలు

కొడాలి వ్యాఖ్యలపై విమర్శలు


సమయమంతా సొంత భజన.. సందు దొరికితే ప్రతిపక్షంపై నిందారోపణ.. 

నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని, ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయాల్సిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు దారి మళ్లుతున్నాయి. మచిలీపట్నంలో బుధవారం జరిగిన ప్లీనరీ అయితే మరో అడుగు ముందుకేసి ఆద్యంతం పేర్ని నాని తనయుడు కిట్టు భజనకే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో బందరు అసెంబ్లీ సీటు కిట్టూకే అన్నట్టు మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తుండగా, అసలు ఈ నిర్ణయం వెనుక కిటుకు ఏమిటోనని  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


(విజయవాడ/మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి) : మూడేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాన్ని కార్యకర్తల ద్వారా తెలుసుకోవడం, రానున్న ఎన్నికలకు మండల స్థాయి నాయకులను, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీల ఉద్దేశం. ఇక్కడి అభిప్రాయాలను జూలై 8, 9న జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీలో చర్చించాలన్నదే ముఖ్యాంశం. కానీ, రెండు జిల్లాల్లోని ప్లీనరీలు ఆ దిశగా జరగట్లేదు. ఒకరికొకరు భజన చేసుకునే వేదికలుగా ప్లీనరీలు మారాయని, నాయకులు, సీనియర్‌ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ఓ వైసీపీ నాయకుడు వాపోయారు. మచిలీపట్నంలో బుధవారం జరిగిన వైసీపీ ప్లీనరీ.. పొగడ్తలకు పరాకాష్టగా మారింది. మాజీమంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు భజనకు వేదికైంది. ప్రస్తుతం పార్టీలో ఎలాంటి పదవి లేకున్నా, గతంలో ఏ పదవి చేపట్టిన అనుభవం లేకున్నా కేవలం ఎమ్మెల్యే తనయుడు అనే అర్హతతో పేర్ని కిట్టూకు వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం టికెట్‌ ఖరారు చేసేశారు. కిట్టు అసామాన్యుడు అనే రీతిలో ప్లీనరీలో పాల్గొన్న మంత్రి జోగి రమేశ్‌ మొదలు ఎమ్మెల్యేలంతా భజన చేయడం సొంత పార్టీ నాయకులనే అసహనానికి గురిచేసింది.  

వారసులంటూ కొత్త భాష్యం

వారసులు, వారసత్వ రాజకీయాలకు మాజీమంత్రి కొడాలి నాని కొత్త భాష్యం చెప్పారు. మచిలీపట్నం ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ వారసులంటే అల్లుళ్లు కాదని తాత, తండ్రి, కొడుకు, మనవడు అన్నారు. ఈ వ్యాఖ్యలు మచిలీపట్నం వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ‘తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులకు నిజంగా వారే వారసులు. అంతేకానీ ప్రజాజీవితంతో ముడిపడిన రాజకీయాల్లో సమర్థత, సామర్థ్యం ఉన్నవారే వారసులు తప్ప.. నా తాత, తండ్రి రాజకీయ నాయకులు నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వండి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఎలా సాధ్యం’ అని మచిలీపట్నానికి చెందిన వైసీపీ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. తరాలుగా ఒకే కుటుంబానికి ఊడిగం చేయడానికి ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అని ప్రశ్నించారు. చదువు లేకున్నా, గతంలో ఎలాంటి రాజకీయ పదవులు నిర్వహించిన అనుభవం లేకున్నా వారసులుగా చెలామణి అయిపోదామని అంటే ప్రజలే కాదు సొంత పార్టీ కార్యకర్తలూ ఒప్పుకోరని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, కొల్లు రవీంద్రను ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యలు చేసినా.. సమర్థతే రాజకీయాల్లో వారసత్వాన్ని నిరూపిస్తుందని, కొడుకులను, మనవళ్లను బలవంతంగా రుద్దితే జనాగ్రహం తప్ప ఒరిగేదేమీ ఉండదని మరో వైసీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. 

వైసీపీ నాయకుల ఆగ్రహం

వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం అసెంబ్లీ వైసీపీ టికెట్‌ను పేర్ని నాని కొడుకు కిట్టూకు ఇస్తామని కొడాలి నాని ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. కిట్టు వ్యవహారశైలిపై ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారు. తాత, తండ్రులకు ఊడిగం చేస్తూ వచ్చామని, ఇప్పుడు మనవడికి కూడా చేయాలనడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. సమర్థత ఉన్న నాయకులు చాలామందే మచిలీపట్నం వైసీపీలో ఉన్నారంటూ టికెట్‌ ఆశావహులు పేర్కొంటున్నారు. పార్టీ టికెట్లను ఎవరికి వారే ఖరారు చేసుకుంటే అధిష్ఠానం ఎందుకు.. పీకే టీంలు.. సర్వేలు ఎందుకు..?    అని వారు ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నానిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాంటిది ఆయన కొడుక్కి టికెట్‌ ఇస్తే పార్టీ ఓటమిపాలు కావడం ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు.


ఎంపీ దూరం..!

ఈ ప్లీనరీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి హాజరుకాలేదు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు వరుసగా పెనమలూరు, పామర్రు, పెడన, గుడివాడ నియోజకవర్గ ప్లీనరీల్లో పాల్గొన్న బాలశౌరి అదే వరుసలో జరిగిన మచిలీపట్నం ప్లీనరీకి మాత్రం గైర్హాజరయ్యారు. ప్లీనరీ నిర్వాహకుల నుంచి తగినరీతిలో ఆహ్వానం లేకపోవడంతో ఆయన మంగళవారం సాయంత్రం వరకు వేచిచూసి ఢిల్లీ వెళ్లిపోయారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తొలి నుంచీ బాలశౌరితో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కనీసం ప్రొటోకాల్‌ పాటించకుండా తనను అవమానిస్తున్నారని సాక్షాత్తూ ఎంపీనే బహిరంగంగా ఆవేదన వ్యక్తంచేసినా ఫలితం లేదు. మూడేళ్లలో పేర్ని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జరిగిన ప్రధాన కార్యక్రమాలకు కానీ, పార్టీ కార్యక్రమాలకు కానీ బాలశౌరిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని స్వయంగా ఎంపీనే ప్రస్తావించారు. ఇదంతా ఒక ఎత్తయితే కొద్దిరోజుల క్రితం ఓ కార్పొరేటర్‌ను ఎంపీ స్థాయి వ్యక్తిపైకి ఉసిగొల్పడంపై సొంత కేడర్‌లోనే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్లీనరీకి ఎంపీ హాజరుకాకపోవడం పార్టీశ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-06-30T05:47:17+05:30 IST