మాభూమి జబ్ సినిమా జాగే!

ABN , First Publish Date - 2020-03-22T05:53:37+05:30 IST

నలుపు తెలుపుల జీవితాన్ని దాటి, రంగులలోకి సినిమా ప్రయాణిస్తున్న సమయం. వాస్తవికత కన్నా ఊహాలోక విహారమే కాసులు కురిపిస్తాయని నమ్ముతున్న తరుణం. మంచి కథ... మంచి సాహిత్యం... కన్నా మాస్‌ హీరో...

మాభూమి జబ్ సినిమా జాగే!

మా భూమి @ 40


సరిగ్గా 40 ఏళ్ళ క్రితం సంగతి... 

నలుపు తెలుపుల జీవితాన్ని దాటి, రంగులలోకి సినిమా ప్రయాణిస్తున్న సమయం. వాస్తవికత కన్నా ఊహాలోక విహారమే కాసులు కురిపిస్తాయని నమ్ముతున్న తరుణం. మంచి కథ... మంచి సాహిత్యం... కన్నా మాస్‌ హీరో... మసాలా పాటలు... ఫైట్లు... ముఖ్యం అవుతున్న సందర్భం. తెలుగు తెర హీరో ‘బుచ్చిబాబు’, ‘ఘరానాదొంగ’గా, ‘సూపర్‌ మేన్‌’గా సాక్షాత్క రించి, కమర్షియల్‌ కథల ‘కక్ష’తో ‘ఆటగాడు’, కలెక్షన్ల ‘వేటగాడు’ అయిన సమయం... ఏటా 130 చిత్రాలతో దేశంలో రెండో స్థానంలో తెలుగు సినీసీమ నిలుస్తున్న సందర్భం...


ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో... 

రెండు సినిమాలు ఏటికి ఎదురీదాయి. ప్రపంచాన్ని ఆకర్షించాయి. గతి తప్పిన సినిమా రీతిని... ఆగి, ఆలోచించేలా చేశాయి. ఒకటి.. సంప్రదాయ సంగీతజ్యోతికి కాపు కాసిన సంచలనం ‘శంకరాభరణం’ రెండోది... ‘శంకరాభరణం’ తర్వాత 50 రోజులకు తెరపైకొచ్చి, జనచైతన్యాన్ని మేలుకొల్పిన వాస్తవచిత్ర విప్లవజ్యోతి... ‘మా భూమి’. 


రెండు కల్ట్‌ సినిమాలు... 

ఒకే సమయంలో.. ఒకే ఏడాదిలో.. ఒకే లక్ష్మీఫిలిమ్స్‌ పంపిణీలో..  కొన్నిచోట్ల ఒకే థియేటర్‌లో... విజయవిహారం చేయడం... ఒక అనూహ్య సందర్భం! ఒక అసాధారణ సంఘటన!  ఒక అపురూప చరిత్ర!! నిద్రపోతున్న సమాజాన్నీ, తెలుగు సినిమానూ దిగ్గున మేల్కొల్పిన  మరపురాని మానవ జీవితచిత్రణ... ‘మా భూమి’కి నేటి (మార్చి 22)తో 40 వసంతాలు. 


ఇది ఒక అపూర్వ సినీయానం... 

భూమి కోసం... భుక్తి కోసం... విముక్తి కోసం... 

నేటికీ... బండెనక బండి కట్టి... సాగుతున్న నిర్నిద్ర గానం.


ఎమర్జెన్సీ తరువాతి రోజులు... తెలుగులో అప్పుడప్పుడే వాస్తవిక చిత్రధోరణి మొదలవుతోంది. దర్శక ప్రముఖుడు మృణాల్‌సేన్‌ను ఒప్పించి, ప్రసిద్ధ పంపిణీ సంస్థ నవయుగ ఫిలిమ్స్‌ వారు తీసిన ‘ఒక ఊరి కథ’ (1977) తెలుగుతెరపై నవ్యచిత్రాల ధోరణికి నాంది పలికింది. ఆ తరువాత శ్యామ్‌బెనెగల్‌ దర్శకత్వంలో ’అనుగ్రహం’ (మరాఠీలో తానే తీసిన ‘కొండూర’కి తెలుగు రీమేక్‌ - 1978) వచ్చింది. వాటి కన్నా కొద్దిగా ముందుగా దాశరథి రంగాచార్య నవల ‘చిల్లర దేవుళ్ళు’ ఆధారంగా అదే పేరుతో సినిమా (1975) వచ్చింది. తెలంగాణ భాషతో స్థానికతను ప్రతిబింబిస్తూ తయారైన తొలి చిత్రంగా దీన్ని పేర్కొంటారు. అయితే, ఇవేవీ వాణిజ్య విజయం సాధించలేదు. ఆ పరిస్థితుల్లో... ఎమర్జెన్సీ నుంచి దేశం బయటపడిన కొత్తల్లో... సినిమా మాధ్యమం ద్వారా జనం దగ్గరకు వెళ్ళాలనుకున్నారు విప్లవస్ఫూర్తి నిండిన బి. నరసింగరావు లాంటి కొందరు యువకులు, ‘జననాట్యమండలి’ కళాకారులు. ఆర్థిక వసతులు లేకపోయినా, గుండెల నిండుగా ఆత్మవిశ్వాసంతో, నమ్మిన సిద్ధాంతాన్ని శక్తిమంతమైన సినిమా మాధ్యమం ద్వారా జనంలోకి తీసుకువెళ్ళాలనీ, ఆలోచింపజేయాలనీ నిశ్చయించుకున్నారు. ఆ నిశ్చయానికి ఫలితం ‘మా భూమి’ నిర్మాణ ప్రయత్నం! 


కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన పక్కా బెంగాలీయుడు, రంగస్థల కళాకారుడు, స్వయంగా ఫొటోగ్రాఫరైన గౌతమ్‌ ఘోష్‌ పక్కా తెలుగు వాతావరణంలోని ఈ చిత్రాన్ని రూపొందించడం విచిత్రం. మూడేళ్ళు నిర్మాణంలో ఉన్న ‘మా భూమి’ని పూర్తి చేసేనాటికి ఆయన వయస్సు కేవలం 29 ఏళ్ళే. స్వతహాగా మార్కిస్టు భావాలున్నవాడు. సారథీ స్టూడియోతో, అంతకు ముందే మృణాల్‌సేన్‌ రూపొందించిన ‘మృగయా’, తెలుగు ‘ఒక ఊరి కథ’ చిత్రాల నిర్మాణంతో అనుబంధమున్న నిర్మాత జి. రవీంద్రనాథ్‌. కలకత్తాలో మృణాల్‌సేన్‌ ద్వారా ఆయనకు ఘోష్‌ పరిచయమయ్యారు. మంచి తెలుగు సినిమా తీయాలన్న రవీంద్రనాథ్‌, నరసింగరావులతో ఘోష్‌ సరేనన్నారు. అప్పటికే తాను చదివిన కిషన్‌ చందర్‌ నవలిక ‘జబ్‌ ఖేత్‌ జాగే’ ఆధారంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చిత్ర రూపకల్పన చేయాలని రంగం సిద్ధం చేశారు. ఆ తరువాత మూడేళ్ళు అనేక కష్టనష్టాల మధ్య ఆ దర్శక, నిర్మాతలు, నటీనట సాంకేతిక నిపుణులు అందరూ కలసి కన్న కల ఫలితమే సినీ ఆణిముత్యం ‘మా భూమి’. ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఉద్వేగంతో ఊపేసిన సినిమా. 40 ఏళ్ళు నిండినా, ఇప్పటికీ మరపురాని చరిత్ర. 


‘జబ్‌ తెలుగు సినిమా జాగే’ (తెలుగు సినిమా మేల్కొన్న వేళ...)గా... వెండితెరపై ‘మా భూమి’ సాహసాన్ని సాధ్యం చేసిన కొందరు   సినీ యోధులు ‘నవ్య’తో పంచుకున్న...  జ్ఞాపకాల ప్రయాణం ఇది!


చిత్ర కథేమిటంటే...

నల్లొండ జిల్లా సిరిపురం గ్రామం. రైతు వీరయ్య (కాకరాల). అతని కుమారుడు రామయ్య (సాయిచంద్‌). చిన్నప్పుడే రామయ్య తన తండ్రితో సహా ఆ ఊరి భూస్వామి భూస్వామి జగన్నాథరెడ్డి (ఎం.బి.కె.వి. ప్రసాదరావు) వద్ద వెట్టిచాకిరీ చేయాల్సి వస్తుంది. రామయ్య ఊరొదిలి, పట్నానికి వెళతాడు. రిక్షా తొక్కుతాడు. ఫ్యాక్టరీ కార్మికుడవుతాడు. శ్రమకు తగ్గ ఫలితం దొరకక, సమ్మెలో పాల్గొని, జైలుకూ వెళతాడు. మరోపక్క గ్రామంలో ‘సంఘం’ ఏర్పడి, భూస్వామిపై తిరుగుబాటు చేస్తుంది. జైలు నుంచి ఊరికి వచ్చిన రామయ్య... సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. ఇంతలో దేశానికి స్వాతంత్య్రం వస్తుంది. కానీ, అప్పటి దాకా నైజామ్‌కు తొత్తులుగా పనిచేసిన దొరలు, కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. సైనికుల దాడిలో రామయ్యతో సహా గ్రామస్థులే వందలాదిగా వీరమరణం పొందుతారు. భూమి కోసం.. భుక్తి కోసం.. పీడన నుంచి విముక్తి కోసం... జనంలో కాకపోతే, వనంలో నుంచి పోరు సాగుతూనే ఉంటుందని విప్లవ చైతన్యదృష్టితో సినిమా ఆశావహంగా ముగుస్తుంది.



ఇల్లు తాకట్టు పెట్టా! - బి. నరసింగరావు, 

చిత్ర నిర్మాతల్లో ఒకరు


‘‘జననాట్యమండలి స్థాపకుల్లో ఒకడిగా నాది విప్లవ పోరాట పంథా. దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అజ్ఞాతంలో ఉన్నా. ఎమర్జెన్సీ ఎత్తేశాక బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధంలో పడ్డా. అప్పటికే సినీ నిర్మాణంలో ఉన్న మిత్రుడు రవీంద్రనాథ్‌ ద్వారా సినీరంగం వైపు వచ్చా. అక్కడ కూడా మునుపటి విప్లవ పంథాలో వెళ్ళాలనీ, తెలంగాణ పోరాట నేపథ్యాన్ని చూపాలనీ ఆలోచించాం. మహీధర, బొల్లిముంత, కా.రా, రావిశాస్త్రి లాంటి ప్రసిద్ధుల రచనలతో మృణాల్‌సేన్‌తో చర్చించాం కూడా! లక్ష రూపాయల తక్కువ బడ్జెట్‌లో తీయాలని, మృణాల్‌ సేన్‌ సూచించిన గౌతమ్‌ఘో్‌షతో ప్రయాణం మొదలుపెట్టాం. ‘జబ్‌ ఖేత్‌ జాగే’ నవలలోని రొమాంటిసిజమ్‌ కన్నా చరిత్రకూ, జీవితానికీ పెద్ద పీట వేసేందుకు నెల రోజులు మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలు తిరిగాం. హైదరాబాద్‌లో అఫ్జల్‌గంజ్‌ లైబ్రరీలో ‘మీజాన్‌’, ‘గోల్కొండ పత్రిక’, ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రికలు చూసి, వార్తలు ఎత్తి రాసుకున్నాం. సాయుధ పోరాటంలో పాల్గొన్నవాళ్ళను ఇంటర్వ్యూ చేశాం. వాటన్నిటితో స్ర్కిప్టు సమూలంగా మార్చేశాం. సి.పి.ఎం.లో ఉన్న మిత్రుడు లక్ష్మారెడ్డితో కూర్చొని, ఎప్పటికప్పుడు స్ర్కిప్టులో చారిత్రక విరుద్ధాంశాలు లేకుండా జాగ్రత్త పడ్డాం. మొదట ఈ సినిమాకు ఏవేవో పేర్లు చర్చకు వచ్చాయి. అయితే అప్పటికే తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యపు ‘మా భూమి’ నాటకం స్ఫూర్తితో, ఈ సినిమాకు నేనే ఆ పేరు పెట్టా. విస్తృత క్యాన్వాస్‌ ఉన్న సబ్జెక్ట్‌ కావడంతో నాలుగైదు షెడ్యూళ్ళు, 45 రోజుల దాకా షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. లక్ష అనుకున్న బడ్జెట్‌ చివరకు రూ. 5.3 లక్షలైంది. నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో ఆల్వాల్‌లో మా ఇల్లు ‘సిండికేట్‌ బ్యాంక్‌’లో తాకట్టు పెట్టా. ఆ తరువాత ‘ఎస్‌.బి.ఐ’లో బంగారం తనఖా పెట్టా. చివరకు సినిమా అంతా అయ్యాక, సెన్సార్‌కు రూ.700 కావాల్సొచ్చింది. డబ్బుల్లేవు. దాంతో, ఈ చిత్రానికి మరో నిర్మాత రవీంద్రనాథ్‌ తన పెళ్ళి ఉంగరం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. అయితే, సినిమా రిలీజై, వేస్తున్న ప్రతిచోట జనం తండోపతండాలుగా వచ్చి చూశారు. పదే పదే చూసి, ‘మా భూమి’ని ‘మన సినిమా’గా చేసుకున్నారు కాబట్టే, ఇవాళ్టికీ చరిత్రలో అది నిలిచిపోయింది. సినిమా నెగటివ్‌ పాడవడంతో రవీంద్రనాథ్‌, మేము కలసి పాతిక లక్షలు ఖర్చుపెట్టి, అయిదేళ్ళ క్రితం డిజిటలైజ్‌ చేయించాం.’’



ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు!

- తోట వైకుంఠం, చిత్ర కళాదర్శకుడు


‘‘చిన్నప్పుడెప్పుడో చూసిన గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ లాంటి కొన్ని మినహా నాకు మళ్ళీ గొప్పగా అనిపించిన సినిమాలు తక్కువ. వినోదాత్మక చిత్రాలెన్నో రావచ్చు. కానీ, వివేచన కలిగించేవి కొన్నే. నా మటుకు నాకు ‘మా భూమి’ లాంటి గొప్ప సినిమా మరొకటి ఎదురవలేదు. పెయింటింగులు వేసుకుంటూ, పేదరికంలో గడుపుతున్న నేను సినిమాల్లోకి రావాలనీ, వస్తాననీ అసలెప్పుడూ అనుకోలేదు. బి. నరసింగరావు వల్ల ‘మా భూమి’తో ఆర్ట్‌ డైరెక్టర్‌ అయ్యా. మొదట ఆర్టిస్టు చంద్ర కళాదర్శకత్వం చేయాలనుకుంటా. ఏమైందో ఆ అవకాశం నాకు వచ్చింది. ‘సినిమాలకు పని చేయడం నాకేమీ తెలియదయ్యా’ అన్నా. కానీ, ఘోష్‌, నరసింగరావు ప్రోత్సహించారు. తరువాత ‘రంగుల కల’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’కు కళాదర్శకత్వం వహించా. నిజం చెప్పాలంటే, ‘మా భూమి’ వచ్చి ఇన్నేళ్ళయినా తెలంగాణ ఏం మారింది? నీళ్ళు వచ్చాయి, మరొకటి వచ్చిందని అంటారు కానీ... అణగారిన మనుషులలో ధైర్యం రావాలి. జ్ఞానం రావాలి. వాళ్ళకు గౌరవం రావాలి. ఎవరికి, ఎందుకు ఓటేస్తున్నామో తెలుసుకొనే చదువు రావాలి. ఆ పరిస్థితులు రానంత వరకు ‘మా భూమి’ సమకాలీనమే!’’



మరో ‘మా భూమి’ తీయాలనుంది!

- గౌతమ్‌ ఘోష్‌, చిత్రదర్శకుడు 


‘‘నా తొలి సినిమా ‘మా భూమి’ వచ్చి 40 ఏళ్ళు నిండిందంటే నమ్మలేకపోతున్నా. నాకు ఇప్పటికీ నిన్న, మొన్ననే ఆ సినిమా తీసినట్టు అనిపిస్తుంటుంది. ప్రతిరోజూ జరిగిన సంఘటనలు నాకిప్పటికీ గుర్తున్నాయి. ఆ సినిమా నాకిచ్చిన బలం, ధైర్యమే నాకిప్పటికీ ఇంధనం. తాజాగా ఇటాలియన్‌, ఇంగ్లీషు, హిందీల్లో ‘పరిక్రమ’ అనే సినిమా తీస్తున్నా. నెల క్రితమే ఇటలీ షెడ్యూల్‌ ముగించుకొని వచ్చాం. వెంట్రుకవాసిలో కరోనా బారి నుంచి తప్పించుకున్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఆ రోజుల్లో ఎంతో కష్టనష్టాలతో ‘మా భూమి’ రూపొందించిన సందర్భమే గుర్తొస్తుంది. ఆ చిత్ర స్ఫూర్తి, ఉత్తేజమే మాకు తారక మంత్రం. ‘కాడి కిందపడేయద్దు. మనం చేయగలం’ అంటూ నా యూనిట్‌ వాళ్ళకు ఇప్పటికీ ‘మా భూమి’ సంగతులు చెబుతుంటా. నిజానికి, నన్ను ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించమంటూ రవీంద్రనాథ్‌ అడిగేటప్పటికే నేను తెలంగాణ సాయుధ పోరాటంపై కిషన్‌ చందర్‌ నవలిక  ‘జబ్‌ ఖేత్‌ జాగే’ (పొలాలు మేల్కొన్నవేళ), అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారి రచన, కవి హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ రాసిన ‘ది టేల్‌ ఆఫ్‌ తెలంగాణ’ లాంటివన్నీ చదివి ఉన్నా. అందుకే, ‘జబ్‌ ఖేత్‌ జాగే’ నవలిక ఆధారంగా సినిమా తీద్దామని ప్రతిపాదించా. నేను, నా కవి మిత్రుడు పార్థా కలసి ఆ నవలికకు మొదట ఒక చిన్న ట్రీట్మెంట్‌ రాశాం. కానీ, తరువాత నరసింగరావు బృందంతో మేమంతా కలసి తెలంగాణ గ్రామాల్లో సర్వే చేసి, ఇంటర్వ్యూలు చేసి, వాస్తవ చరిత్ర రికార్డు చేశాక ఆ ట్రీట్మెంట్‌ పనికి రాదని, కొత్త స్ర్కిప్టు సిద్ధం చేసుకున్నాం. అలా ఎన్నో అనుభవాలు. నేను స్వయంగా ఫోటోగ్రాఫర్‌ని అయినా, ఆ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కూడా ఉండడంతో, మిత్రుడైన సినిమాటోగ్రాఫర్‌ కమల్‌ నాయక్‌కు ఆ బాధ్యత అప్పగించా. చిక్కడపల్లిలో ఒక చిన్న గది, వరండాలో మా సినిమా యూనిట్‌ ఆఫీసు. (నవ్వుతూ...) నేను, నా సహచరి నీలాంజన (తరువాత పెళ్ళి చేసుకున్నాం) కలసి అక్కడే ఉండేవాళ్ళం. షూటింగు కోసం గ్రామానికి ఒక ఓపెన్‌ ట్రక్కులో మేమంతా ఒక సాహసంలా వెళ్ళిన దృశ్యం నాకిప్పటికీ గుర్తే. ఆర్థిక ఇబ్బందులతో చాలాకాలం చిత్ర నిర్మాణం సాగడంతో, కమల్‌ నాయక్‌ వేరే సినిమా పనికి వెళ్ళడంతో కొంత భాగం సినిమా నేనే కెమెరాతో షూట్‌ చేశా. నేను ‘మామా’ అని పిలిచే అద్భుతమైన పెయింటర్‌ తోట వైకుంఠాన్ని ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఒప్పించడం, పరమ సిగ్గుతో కళ్ళెత్తిచూడని సాయిచంద్‌ను హీరోగా ఎంచుకొన్న సందర్భం కళ్ళముందు కదులుతున్నాయి. అందరం ఎంతో కష్టపడి తీసిన ఆ వాస్తవిక చిత్రం నాకొక గొప్ప అనుభవం, అనుభూతి. ఆ సినిమా రిలీజ్‌, ఆ జనాదరణ మర్చిపోలేను. అప్పట్లో ఒకేసారి ‘శంకరాభరణం’ లాంటి సంప్రదాయ సంగీతభరిత చిత్రాన్నీ, సామాన్య జనజీవితాన్నీ - వారి పాటనూ వాస్తవికంగా చూపిన ‘మా భూమి’నీ ప్రేక్షకులు ఆదరించారు. మనసును కదిలించే కొత్త అనుభూతినిస్తే అది సంగీతభరిత చిత్రమైనా, వాస్తవిక చిత్రమైనా ఆదరిస్తామని జనం ఋజువు చేశారు. తరువాత ఎన్నో చిత్రాలు తీసి, ప్రపంచమంతటా తిరిగి, ఎన్నో అవార్డులు వచ్చినా, ‘మా భూమి’కీ, ఆ చిత్ర యూనిట్‌కూ నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. నాకు ఇప్పటికీ ఓ కోరిక. మళ్ళీ తెలంగాణకు వచ్చి, అక్కడ ఊరూరూ తిరిగి, ఇవాళ్టి జనజీవితం మీద మరో చిత్రం తీయాలని ఉంది. (ఉద్వేగంగా...) రిటైరయ్యే ముందు బహుశా, అదే నా చివరి చిత్రం కావచ్చేమో!’’



అందుకే ఆ పాటలు అలా... 

- గద్దర్‌, ప్రజా గాయకుడు  


‘‘ఆ రోజుల్లో నేనూ జననాట్యమండలిలో ప్రజాచైతన్యం కోసం ఆట, పాటతో కృషి చేస్తుండేవాణ్ణి. బి. నరసింగరావు మా జననాట్యమండలి వ్యవస్థాపక కళాకారుడు, మాలాంటి వాళ్ళకు అప్పుడొక గైడ్‌. ఎమర్జెన్సీ ఎత్తేశాక, సినిమా ద్వారా ప్రజాచైతన్యం తేవాలని రవీంద్రనాథ్‌ సాయంతో నరసింగరావు అటు వెళ్ళాడు. మహాభారత యుద్ధం మొదలు ప్రపంచ యుద్ధాల దాకా ఎన్నో భూమి కోసమే జరిగాయి. అలాంటి భూ సమస్యను తీసుకొని, ‘మా భూమి’ తీస్తుండడంతో నేనూ, నరసింగరావుతో కలసి చిన్న వేషం కట్టా. ఆడి, పాడా. అలా నేను సినిమాకు పాడిన తొలి పాట అమరవీరుడు బండి యాదగిరి రచన ‘బండెనక బండి కట్టి..’! ప్రజాకళాకారుల నోట ప్రచారాస్త్రంగా పాట ఆ ఉద్యమం తాలూకు ప్రయోజనాన్ని సాధించినప్పుడు దానికి శాశ్వతత్వం వస్తుంది. అందుకే, ‘బండెనక బండి కట్టి’ పాట కానీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అస్త్రమైన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...’ కానీ అలా నిలిచిపోయాయి. ఆ పాటల్లోని అంతస్సారమైన పీడన విశ్వజనీనం. ఒక దొర కొడుకై ఉండి, తన సొంతవర్గమైన భూస్వామ్య వ్యవస్థ మీదే నరసింగరావు ‘మా భూమి’, తరువాత ‘దాసి’ లాంటి గొప్ప సినిమాలు తీయడం విశేషం. ఎందరిదో కృషి ఫలితంగా వచ్చిన ‘మా భూమి’లో చూపిన నైజామ్‌ సర్కారోడు, పటేళ్ళు, పట్వారీలు పోయారు కానీ, ఇవాళ్టికీ నయా భూస్వామ్య విధానంలో సామాన్య ప్రజలకు పీడన పోలేదు. భూముల ఈక్వేషన్‌ మారలేదు. ఆ నిజామ్‌ రాజును మించిన ఈ నిజామ్‌లకు జనం ఎప్పుడు గోరీ కడతారో!’’



తెలుగు సినీ రంగంలో మైలురాయి!

- కాకరాల, సీనియర్‌ నటుడు


‘‘రచయిత దేవీప్రియ ద్వారా 1970లలో నాకు నరసింగరావుతో హైదరాబాద్‌లో పరిచయమైంది. ఆ తరువాత 1976 ప్రాంతంలో మద్రాసులో ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ జరిగింది. అప్పుడు సఫైర్‌ థియేటర్‌లో దర్శకుడు ఋత్విక్‌ ఘటక్‌ సినిమాలన్నీ వేశారు. అక్కడకొచ్చిన నరసింగరావుతో నా స్నేహం బలపడింది. ‘మా భూమి’లో హీరో తండ్రి పాత్రకు సరిపోతానంటూ, ఆయనే నేను ఓల్డ్‌ ఏజ్‌ గెట్‌పలో ఉన్న స్టిల్స్‌ అడిగి తీసుకున్నారు. ఆ తరువాత ఘోష్‌ కూడా అంగీకరించడంతో, ఆ పాత్ర నాకే వచ్చింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు... శ్రీకాకుళం పోరాటం కావచ్చు... అలాంటి ఏదైనా ఒక స్థానికత నుంచి విశ్వజనీనతను చూపడం ఏ కళారూపానికైనా విశిష్టత. అందుకే, ‘మా భూమి’ కేవలం తెలంగాణ సినిమా కాదు. విశ్వజనీన సినిమా. విప్లవ సిద్ధాంతం పట్ల ఇష్టమున్న నాకు ఈ చిత్రం వృత్తిగతంగానే కాక, సైద్ధాంతికపరంగా వ్యక్తిగతంగా కూడా ఎనలేని సంతృప్తినిచ్చింది. తెలంగాణ సాయుధపోరాట వారసత్వాన్ని నక్సల్బరీ అందుకొని, కొనసాగుతున్న పరిస్థితుల్లో వచ్చిన ఈ సినిమా ఒకరకంగా 1948 నాటి గత చరిత్రతో పాటు, చిత్ర నిర్మాణం నాటి సమకాలీన చరిత్రకు కూడా సెల్యులాయిడ్‌ సింబల్‌! అందుకే, సమూల సామాజిక మార్పు కోరుకొనే సందర్భం వచ్చినప్పుడల్లా ‘మా భూమి’ ప్రాధాన్యం, ప్రాసంగికత ఉంటాయి. నా దృష్టిలో తెలుగు సినీరంగంలో ‘మా భూమి’ ఒక మైలురాయి.’’


వెండితెర డాక్యుమెంట్‌

హైదరాబాద్‌ సంస్థానం నిజామ్‌ ఏలుబడిలో ఉంటూ, భారత యూనియన్‌లో విలీనం కాక ముందు 1948 పూర్వపు తెలంగాణ జీవిత దృశ్యాన్ని ‘మా భూమి’ తెరపై చూపింది. సుప్రసిద్ధ ఉర్దూ రచయిత కిషన్‌ చందర్‌ రాసిన ‘జబ్‌ ఖేత్‌ జాగే’ అనే చిన్న నవల ‘మా భూమి’కి మూలం.  గౌతమ్‌ ఘోష్‌ ఆ నవలికను సూచించారు. అప్పటికే ఆ ఉర్దూ రచన తెలుగులో ‘జైత్రయాత్ర’ (‘పొలాలు మేల్కొన్నవేళ...’ అనేది ఉపశీర్షిక, అనువాదకుడు పోలు శేషగిరిరావు) పేరుతో వచ్చింది. నరసింగరావు బృందానికీ ఆ నవల సుపరిచితమే. ఆ రచన ఆధారంగా గౌతమ్‌ ఘోష్‌ స్ర్కిప్టు రూపొందించారు. అయితే, జనజీవితానికీ, చరిత్రకూ మరింత దగ్గరగా ఉండేలా అనేక చారిత్రక విషయాలను దానికి మళ్ళీ జోడించారు. అలా స్థానిక సంఘటనలు, ప్రత్యక్ష అనుభవాలతో ఆ స్ర్కిప్టులో మార్పులు చేర్పులు చేయడంలో నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, పార్థూ బెనర్జీలు ఘోష్‌కు వెన్నుదన్నయ్యారు. అలా ‘మా భూమి’ వాస్తవ చరిత్రకు వెండితెర డాక్యుమెంట్‌ అయింది. 



నాకు శాశ్వతకీర్తి నిచ్చింది!  - సాయిచంద్‌, చిత్ర హీరో

‘‘నా తొలి చిత్రమే ‘మా భూమి’. నిజానికి, రామయ్య పాత్రకు నా కన్నా ముందే నిర్మాత రవీంద్రనాథ్‌ తమ్ముడైన హీరో నారాయణరావు (‘ఒక ఊరి కథ’ ఫేమ్‌)తో సహా పలువురిని అనుకున్నారు. చివరకు ఆ పాత్రకు కొత్తవాడైతేనే బాగుంటుందని నన్ను తీసుకున్నారు. మా నాన్న గారైన రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్‌ నుంచి సినిమాతో పరిచయమున్న కుటుంబం కాబట్టి, నేనూ నటించడానికి ఉత్సాహపడ్డాను. ఏదో చిన్న పాత్ర ఇస్తారనుకుంటే, ఏకంగా హీరో పాత్ర అనేసరికి షాక్‌ అయ్యా. భయపడ్డా. కానీ, గౌతమ్‌ ఘోష్‌, నరసింగరావులు నాకు నటన గురించి, పాత్ర స్వరూపస్వభావాల గురించి, వాటికి తగిన రిఫరెన్స్‌ల గురించి చెప్పడంతో ఇంత కీలకమైన, పెద్ద పాత్ర చేయగలిగా. అద్భుతమైన సినిమా టేకింగ్‌, మహాద్భుతమైన చరిత్ర, మనసును పిండేసే జీవితం - ఇవన్నీ కలవడమే ‘మా భూమి’లోని అందం. ఇన్నీ కలిసేసరికి ఈ సినిమా ఒక మాస్టర్‌పీస్‌ అయింది. కేవలం మేధావులకో, ఒక వర్గానికో పరిమితం కాకుండా, సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా చేరింది. అది ఈ సినిమాకు దక్కిన ప్రత్యేక గౌరవం. ఈ సినిమా ముందు దాకా నేను కేవలం ‘గోపీచంద్‌ గారి అబ్బాయి’గా తెలుసు. ఈ చిత్రం వచ్చాక ‘మా భూమి చిత్ర హీరో’గా గుర్తుండిపోయా. అలా నాకు ఈ చిత్రం శాశ్వతమైన కీర్తినిచ్చింది. ఇటీవల శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’లో చేసిన తండ్రి పాత్ర, చిరంజీవి ‘సైరా’లో చేసిన ప్రత్యేక పాత్ర మళ్ళీ నన్ను జనానికి దగ్గర చేశాయి. ‘మా భూమి’ వచ్చి 40 ఏళ్ళవుతున్నా... ఇప్పటికీ నన్ను ఎక్కడ, ఏ చలనచిత్రోత్సవంలో చూసినా నా తొలి చిత్రమైన ‘మా భూమి’ హీరోగానే ఇతర ప్రాంతాలవారు గుర్తుపట్టడం నాకు గర్వంగా అనిపిస్తుంటుంది.’’



ఆంధ్రాలోనూ అంతే హిట్‌!


నిర్మాణంలో, విడుదలలో అష్టకష్టాలు పడిన ‘మా భూమి’ రిలీజ్‌కు ముందే మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ‘ఫిల్మోత్సవ్‌-80’లో ప్రీమియర్‌ జరుపుకొని, వార్తల్లో నిలిచింది. పత్రికలన్నీ బాసటగా నిలిచి, తమ కథనాలతో ఆసక్తి రేపాయి. సినిమా రిలీజయ్యాక అంతకు మునుపటి ఇబ్బందులన్నీ దర్శక, నిర్మాతలు మర్చిపోయేలా జనం నుంచి ఊహించని స్పందన వచ్చింది.


అరడజను లోపు ప్రింట్లతో, పరిమిత కేంద్రాల్లో 1980 మార్చి 22న విడుదలైంది. ఆదరణతో ప్రింట్లు, కేంద్రాలు పెరిగాయి.


కేవలం ఉదయం ఆటలుగా ప్రదర్శించిన ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో, అలాగే సికింద్రాబాద్‌లోని మనోహర్‌, రాజేశ్వర్‌ థియేటర్లలో కలిపి ఏడాది ఆడింది. 


కమ్యూనిస్టు భావజాలానికి కేంద్రంగా వెలిగి, ‘ఆంధ్రా మాస్కో’గా పేరున్న విజయవాడలో సైతం అప్సర థియేటర్‌లో 100 రోజుల పైగా (నూన్‌షో) ప్రదర్శితమైంది. ఉద్యమ ప్రభావం ఎక్కువున్న ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి జనం విజయవాడ వచ్చి, సినిమా చూసివెళ్ళేవారు.


అలాగే, విశాఖపట్నంలోనూ అలంకార్‌ థియేటర్‌లో, వరంగల్‌లో కాకతీయ థియేటర్‌లో సినిమాకు మంచి ఆదరణ లభించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో స్వయంగా పాల్గొన్నవారు చాలామంది అప్పటికీ ఉండడంతో, వారందరికీ ఈ సినిమా ప్రాణమైంది. ఉద్యమంలో విస్తృత ప్రచారమైన ‘బండెనక బండి గట్టి...’ గీతం వచ్చినప్పుడు, థియేటర్లలో జనం లేచి, నర్తించేవారు.


డాక్టర్‌ రెంటాల జయదేవ

Updated Date - 2020-03-22T05:53:37+05:30 IST