నెరవేరిన దశాబ్దాల కల.. సంబరాలు చేసుకుంటున్న మాసాయిపేట గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-07-02T22:26:02+05:30 IST

మాసాయిపేట ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటిస్తూ బుధవారం గెజిట్‌ విడుదల చేసింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మాసాయిపేట పట్టణాన్ని

నెరవేరిన దశాబ్దాల కల.. సంబరాలు చేసుకుంటున్న మాసాయిపేట గ్రామస్తులు

మెదక్‌ (ఆంధ్రజ్యోతి): మాసాయిపేట ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటిస్తూ బుధవారం గెజిట్‌ విడుదల చేసింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మాసాయిపేట పట్టణాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాలుగా స్థానికులు పలు రూపాల్లో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో వెల్దుర్తి మండలంలో మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన మాసాయిపేటను మండలకేంద్రంగా చే యాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలోనూ మండలాల పునర్విభజన సమయంలో మాసాయిపేట మండల కేంద్రం ప్రస్తావనకు వచ్చింది. 2018లో సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో మాసాయిపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అదే విధంగా జూన్‌ 25న నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా మాసాయిపేటను మండలకేంద్రం చేయాలంటూ ప్రజలు విజ్ఙప్తి చేశారు. అయితే అందుకు ఆయన స్పందిస్తూ గతంలోనూ మాసాయిపేట మండల కేంద్రం చేస్తానని మాటిచ్చానని, అదే సభలో సీఎంవో నర్సింగరావును ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేయాలని సూచించారు. 


పన్నెండు గ్రామాల తో మండలం ఏర్పాటు

 వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట, కొప్పుల పల్లి, బొమ్మారం, స్టేషను మాసాయిపేట, రామంతపూర్‌, రామంతపూర్‌ తండా, నాగ్సాన్‌పల్లి, అచ్చంపేట, హకీంపేట, చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి, పోతాన్‌పల్లి, పోతంశెట్టిపల్లి గ్రామాలను ఏర్పాటు చేస్తూ మండలాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మాసాయిపేట మండలం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకే మాసాయిపేట మండలం కూడా రానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చట్టం 1974 యాక్ట్‌ జీవో ఎంఎస్‌ నంబర్‌ 238 రెవెన్యూ శాఖ పేరిట జీవో జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డికి మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేటను మండలంగా పేర్కొంటు చీఫ్‌ సెక్రటరీ సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులిచ్చారు.


మండల ఏర్పాటుపై హర్షం

ఎట్టకేలకు వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో కాఫీని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ అందజేశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే ఆ గ్రామ సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డికి ఆ జీవో కాఫీని అందజేశారు. ఈ మేరకు గ్రామంలో తమ చిరకాల వాంఛ నెరవేరిందని, గ్రామస్థులు బాణాసంచాను పేల్చారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

Updated Date - 2020-07-02T22:26:02+05:30 IST