మాన్‌సూన్.. యాక్షన్ ప్లాన్..!

ABN , First Publish Date - 2020-05-31T11:45:44+05:30 IST

వర్షాకాలంలో ముంపు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. రోడ్లపై వరద నీరైనా... కాలనీలు, బస్తీలను

మాన్‌సూన్..  యాక్షన్ ప్లాన్..!

నగర ప్రజలకు వానాకాలం వస్తోందంటే వణుకు పుట్టుకొస్తోంది. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడం, ఎడతెగని ట్రాఫిక్‌ జామ్‌లు, విజృంభించే సీజనల్‌ వ్యాధులు.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితా తయారవుతుంది. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌, పోలీస్‌, ట్రాఫిక్‌ తదితర విభాగాలన్నీ కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే కొంతమేరకైనా పౌరులను  ఈ ఇక్కట్ల నుంచి కాపాడగలుగుతాయి. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. వచ్చిపడుతోంది వానాకాలం గోల. వేలాదిమంది సిబ్బందితో కూడిన వివిధ విభాగాలు వర్షాకాలం విపత్తులను ఎదుర్కోవడానికి ఏ మేరకు సన్నద్ధం అయ్యాయి అన్నదానిపై.. ప్రత్యేక కథనం..


హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): 


రూ. 25 కోట్లతో జీహెచ్‌ఎంసీ

వర్షాకాలంలో ముంపు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. రోడ్లపై వరద నీరైనా... కాలనీలు, బస్తీలను ముంచెత్తే వర్షపు నీటినైనా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాట్లు చేశామంటోంది. ఇందుకోసం అధికారులు మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేశారు. రూ.24.53 కోట్లతో ప్రత్యేక బృందాలు, యంత్రాలను సమకూరుస్తున్నారు. గ్రేటర్‌ వరద నీటి  ప్రవాహ సామర్థ్యం గంటకు 12 మిల్లీమీటర్లు మాత్రమే. అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే రహదారులు వరద గోదారులవుతాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. చినుకు పడితే రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. రెండు, మూడు రోజులు బస్తీలు, కాలనీలు నీళ్లలోనే ఉంటున్నాయి. ఈ ఇబ్బందులను వీలైనంత త్వరగా పరిష్కరిచేందుకు యాక్షన్‌ ప్లాన్‌ ఉపకరిస్తుందని చీఫ్‌ ఇంజనీర్‌ జియావుద్దీన్‌ తెలిపారు. నగరంలో 157 వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు గుర్తించారు.


వర్షం పడితే రోడ్లపై నీరు నిలిచే ఆయా ప్రాంతాల్లో 127చోట్ల సమస్యకు పరిష్కారం చూపామని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల నీరు దానంతట అదే వెళ్లే ఏర్పాట్లు చేయగా, మరికొన్నిచోట్ల మాన్‌సూన్‌ బృందాలు చెత్తను తొలగిస్తాయి.  మరో 30 ఏరియాల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపే అవకాశం లేదు. ఆ ప్రాంతాల్లో 10 అశ్వసామర్థ్యం కలిగిన మోటార్లను ఏర్పాటుచేసి నీటిని తోడేయనున్నారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు మోటార్లు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. కేంద్ర కార్యాలయంతోపాటు జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల స్థాయిలో బృందాలు పని చేయనున్నాయి. 87 మినీ మొబైల్‌ ఎమర్జెన్సీ బృందాలు, ఎక్స్‌కవేటర్‌తో కూడిన 79 మొబైల్‌ మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు షిఫ్టుల వారీగా పని చేయనున్నాయి. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో చెత్తా చెదారం తొలగించేందుకు 101 స్టాటిక్‌ లేబర్‌ టీంలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలూ వర్షాకాల ఇబ్బందుల పరిష్కారానికి పని చేస్తాయి. విరిగిన చెట్లు, కూలిన గోడలు, భవనాల వద్ద శిథిలాల తొలగింపు వంటి పనులు ఈవీడీఎం సిబ్బంది చేస్తారు. 


సన్నద్ధమవ్వని విద్యుత్‌శాఖ

కరోనా నేపథ్యంలో విద్యుత్‌ అధికారులు మాన్‌సూన్‌ చర్యలు చేపట్టలేదు. దీంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇటీవల గంటపాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కలిగింది. 70కి పైగా విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో పాటు ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. మున్ముందు భారీగా వర్షా లు పడితే ఆస్తినష్టాలతో పాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేలాడుతూ ఉన్న విద్యుత్‌ తీగలను సరిచేయాల్సి ఉంది. లేకుంటే గాలివానకు విద్యుత్‌ తీగలు తగిలి ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్పు అవుతాయి. విద్యుత్‌ తీగలకు తగిలే చెట్ల కొమ్మలను వేసవిలోనే కొట్టేస్తారు. ఈసారి ఎక్కడా ఆ చర్యలు చేపట్టలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల వద్ద ఎర్తింగ్‌ సమస్యలు ఉంటాయి. పరిష్కార చర్యలు లేకపోవడంతో వర్షాకాలాన్ని విద్యుత్‌ అధికారులు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.


వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్‌

ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మరోవైపు వర్షాకాలం రాబోతోంది. ఇది వైద్య ఆరోగ్యశాఖకు ఒక సవాల్‌గా మారుతోంది. పకడ్బందీ ప్లాన్‌తో ముందుకు వెళితేనే వ్యాధులను నియంత్రణలో పెట్టే అవకాశముంది. నిజానికి ప్రతి వర్షాకాల సీజన్‌లో కార్యక్రమాలు సాధారణంగానే ఉంటాయి. క్యాంపులు నిర్వహించడం, పరీక్షలు చేయడం, ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం. కానీ ఈసారి కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొంటూనే మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధం చేయాలి. వర్షాకాలంలో యూపీహెచ్‌సీల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కరోనా వైర్‌సను నియంత్రించడం, పాజిటివ్స్‌ను గుర్తించడం, ఆయా ప్రాంతాలను పర్యవేక్షించడంలో నిమగ్నమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు వర్షకాల యాక్షన్‌ ప్లాన్‌పై దృష్టి పెట్టాలి. జూన్‌ మొదటి వారంలో మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ చేస్తామని ఓ అధికారి తెలిపారు. శ్వాసకోశ జబ్బులు, దగ్గు, జలుబుతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని అధికారులు పేర్కొంటున్నారు.


ట్రాఫిక్‌ పోలీసుల ప్లాన్‌ ఏంటో...

పోలీసులు ఇంకా కరోనా విధుల్లో ఉన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు. లాక్‌డౌన్‌లో అహర్నిశలు కష్టపడి కొవిడ్‌తో పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ట్రై కమిషనరేట్‌లో పదుల సంఖ్యలో పోలీసులు కరోనా బారినపడ్డారు. దీంతో పోలీసుల్లో కరోనా కలవరం మొదలైంది. ఇదిలా ఉండగా, జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నగరంలో ఎక్కడపడితే అక్కడ విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే సమయం చాలా తక్కువగా ఉండగా, ఇప్పటి వరకూ ట్రై కమిషనరేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఎలాంటి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా ట్రాఫిక్‌ పోలీసులు మాన్‌సూన్‌ సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తారు. 


అటెన్షన్‌లో వాటర్‌బోర్డు 

వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో వర్షాకాలంలో అత్యవసర పనులు చేపట్టేందుకు ఈఆర్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో వర్షాకాలంలో జరిగిన మ్యాన్‌హోల్‌ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నగరంలోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలు వచ్చేనాటికి పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో వర్షాకాలంలో నీళ్లు నిలిచే  180 ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో గల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. లోతుగా ఉన్న మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చే సమయంలో  సివరేజీ సూపర్‌ వైజర్లను నియమించనున్నారు. వర్షాకాలంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, మురుగునీటి ఇబ్బందులు రాకుండా వెంటనే చర్యలను చేపట్టేందుకు అధికారుల ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించారు.


Updated Date - 2020-05-31T11:45:44+05:30 IST