‘మా’ ఎన్నికల అధికారి: నిబంధనలకు అనుగుణంగా ఫుటేజ్‌ ఇస్తా

‘మా’ ఎన్నికలు ఎంతో పారదర్శకంగా జరిగాయనీ, పబ్లిసిటీ కోసం కొందరు విమర్శలు చేస్తున్నారనీ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ అన్నారు. ‘మా’ ఎన్నికలపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ‘మా’కు సంబంధించి 14 ఎన్నికలు జరిగితే అందులో 10సార్లు ఆయనే నిర్వహించినట్లు గుర్తు చేశారు. ‘‘ప్రతిసారీ ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించా. ఇండస్ట్రీలో చాలామందికి నేను లీగల్‌ అడ్వైజర్‌గా ఉన్నా. ఎప్పుడూ విమర్శలు రాలేదు. ఇదే మొదటిసారి’’ అని కృష్ఱమోహన్‌ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘బ్యాలెట్‌ పేపర్‌ ఇంటికి తీసుకెళ్లను అనడంతో నిజం లేదు. నా చేతిలో ఉన్న కౌంటింగ్‌ ఛార్ట్స్‌, కొన్ని డమ్మీ బ్యాలెట్‌ పేపర్స్‌ను చూసి, వాటిని బ్యాలెట్‌ బాక్స్‌లో భద్రపరచమని అక్కడున్న ఓ అభ్యర్థి నాతో చెప్పారు. అవి బ్యాలెట్‌ పేపర్స్‌ కాదని వివరించాను. అయినా ఆయన అలా ప్రచారం చేశాడు. కౌంటింగ్‌ అయినవి, కానివి అన్నీ స్కూల్‌లోనే భద్రపరిచాం. ఎక్కడికీ తీసుకెళ్లలేదు. 


ఆఫీస్‌ బ్యారర్‌ రిజల్ట్స్‌ మొత్తం పదో తేదీ రాత్రే ప్రకటించాం. ఈసీ మెంబర్స్‌ రిజల్ట్స్‌ మాత్రం తర్వాత రోజు చేశాం. ఎన్నికల సిబ్బంది అప్పటికే అలసిపోవడంతో రేపు కౌంటింగ్‌ చేద్దాం అని కోరారు. అప్పటికే సమయం పదిన్నర దాటింది. ఇరు ప్యానల్‌ సభ్యులను పిలిచి విషయం చెప్పి సమ్మతమేనా అనడిగాను. వారు సరే అన్నాకే నేను తర్వాతి రోజు మిగిలిన ఫలితాలు వెల్లడిస్తాం అని ప్రకటించాను. 


సీసీటీవీ ఫుటేజ్‌ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది న్యాయ నిబంధనల ప్రకారం చేస్తాను. 56మంది అభ్యర్థుల్లో అందరూ సీసీటీవీ ఫుటేజ్‌ అడుగుతారు. అందరికీ నేను ఇవ్వలేను కదా. న్యాయబద్ధంగా  నిబంధనలకు అనుగుణంగా ఎలా ఇవ్వాలో అలాగే అందజేస్తాను. కోర్టులో కేసు వేసి నన్ను అడిగితే కోర్టు ద్వారా ఇస్తాను. ఎన్నికలు సక్రమంగా జరగలేదు అని విమర్శించే వారంతా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే.. దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటాం.  


Advertisement