మా సొమ్ము మీరెలా తీస్తారు!?

ABN , First Publish Date - 2022-06-30T05:14:58+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోని జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) సొమ్ము వారికి తెలియకుండానే మాయం కావటంతో ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

మా సొమ్ము  మీరెలా తీస్తారు!?

జీపీఎఫ్‌ సొమ్ము మాయం

భగ్గుమంటున్న ఉద్యోగులు, నాయకులు


నెల్లూరు(హరనాథపురం), జూన 29 : ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోని జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) సొమ్ము వారికి తెలియకుండానే మాయం కావటంతో ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తమ ఖాతాల్లోని సొమ్మును ప్రభుత్వం ఎలా తీసుకుం టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే తమ నగదుకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.


ఉద్యోగులు వారి జీవిత కాలపు అవసరాలకోసం నెల జీతం నుంచి కొంత మొత్తాన్ని  జీపీఎఫ్‌లో దాచుకుంటారు. దీనికి వడ్డీకూడా వస్తుండటం, అవసరమైనప్పుడు తీసుకునే వెసలుబాటు ఉండటంతో నగదు జమ చేస్తుంటారు. అయితే సోమవారం ఆర్ధరాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ అవుతున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఉద్యోగులు అవాక్కయ్యారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్‌ ఖాతాల్లో జరిగిన లావాదేవీల స్లిప్పులను పరిశీలిం చగా డీఏ బకాయిల రూపంలో తమ ఖాతాల్లో జమ అయిన సొమ్ము మాయమైనట్లు గుర్తించారు. మార్చి నెలలో ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎఫ్‌ సొమ్ము ఉపసంహరించి నట్లు స్లిప్పుల్లో కనిపిస్తోంది. డీఏ బకాయిలు చెల్లించినట్లే చెల్లించి తమకు తెలియ కుండానే ఖాతాల్లో సొమ్మును ప్రభుత్వం మాయం చేసిందని ఉద్యోగులు మండిపడు తున్నారు.


ఎందుకలా జరిగిందో ఆర్థం కాలేదు  


నా జీపీఎఫ్‌ స్లిప్పును పరిశీలించగా రూ.77 వేలు వితడ్రా చేసినట్లు కనిపించింది. అయితే ఆ మొత్తం నా ఖాతాలో పడినట్లు లేదు. విత డ్రా మాత్రమే చూపిస్తోంది. ఎందుకలా జరిగిందో అర్థం కాలేదు. డీఏ బిల్లులను ఆమోదించి వెంటనే ఖాతాల్లో డబ్బును జమ చేయాలి.

- మన్నేపల్లి పెంచలరావు, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు


డీఏ బిల్లులను వెంటనే ఆమోదించాలి 


డీఏ బకాయిల మొత్తం జీపీఎఫ్‌ ఖాతాలో పడుతుందని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. పిల్లల చదువులు, ఇతర అవసరాలకు జీపీఎఫ్‌ ఎంతగానో ఉపయో గపడుతుంది. డీఏ బిల్లులను వెంటనే ఆమోదించి డబ్బును ఖాతాల్లో జమ చేయాలి. 

- కిరణ్‌కుమార్‌, ట్రైజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 


సొమ్ము మాయమైంది 


నా జీపీఎఫ్‌ స్లిప్పును పరిశీలిస్తే ఖాతాలో రూ.45 వేల డీఏ బకాయిలుపడ్డాయి. అవి మళ్లీ మాయమవడంతో ఆశ్చర్యపోయాను. మా ఖాతాల్లోని సొమ్మును మేమే వితడ్రా చేసుకోవాలి. ఇతరులు వితడ్రా చేసే అధికారం లేదు. ఆ నగదును వెంటనే ఖాతాల్లో జమచేయాలి.

- ఆరణి విజయనిర్మల, మెడికల్‌ సూపర్‌వైజర్‌


రూ.73వేలు జమ.. మాయం


డీఏ బకాయిలు ఎప్పటి నుంచో పెండింగ్‌ ఉన్నాయి. నా జీపీఎఫ్‌ స్లిప్పును పరిశీ లించగా రూ.73వేలు డీఏ బకాయి జమైంది. అంతే మొత్తం వితడ్రా చేసినట్లు ఉంది. వెంటనే తిరిగి ఇచ్చేయాలి.

- ఎస్‌ నాగరాజు, వైద్యశాఖ ఉద్యోగి 

Updated Date - 2022-06-30T05:14:58+05:30 IST