Fact-Checker జుబైర్‌కు ఎట్టకేలకు బెయిలు.. అయినా జైల్లోనే!

ABN , First Publish Date - 2022-07-15T21:49:47+05:30 IST

ఆల్ట్ న్యూస్ (Alt News) సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌(Mohammed Zubair)కు ఎట్టకేలకు బెయిలు లభించింది

Fact-Checker జుబైర్‌కు ఎట్టకేలకు బెయిలు.. అయినా జైల్లోనే!

న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ (Alt News) సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌(Mohammed Zubair)కు ఎట్టకేలకు బెయిలు లభించింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తాజాగా నేడు మరోమారు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జుబైర్, ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు జుబైర్‌కు బెయిలు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న జుబైర్ తరపు న్యాయవాదుల వాదనలపై విశ్వాసం వ్యక్తం చేసిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక కేసులో ఆయనకు బెయిలు మంజూరైనప్పటికీ, మరో రెండు కేసులు ఉన్న నేపథ్యంలో బెయిలు మంజూరైనా జైలులోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. 


2018లో చేసిన ట్వీట్‌పై ఢిల్లీలో నమోదైన కేసులో జుబైర్‌కు తాజాగా బెయిలు లభించింది. ఈ కేసులోనే జుబైర్ గత నెలలో అరెస్టయ్యారు. ఇప్పుడిదే కేసులో ఆయనకు బెయిలు లభించింది. జుబైర్‌పై మొత్తం 7 కేసులు నమోదు కాగా, అందులో ఆరు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఢిల్లీ, సీతాపూర్, హత్రాస్, లఖింపూర్ ఖేరీ కేసుల్లో ఆయన కస్టడీలో ఉన్నారు. ఈ నాలుగు కేసుల్లో ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరైంది.


నేడు ఢిల్లీ కేసులో బెయిలు లభించింది. ఇంకా, లఖింపూర్ ఖేరీ, హత్రాస్ కేసుల్లో బెయిలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ కేసులో బెయిలు లభించినా బయటకు వచ్చే దారి లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఆరు కేసులను రద్దు చేయాలని కోరుతూ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, తనపై కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా రద్దు చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-07-15T21:49:47+05:30 IST