Abn logo
Sep 25 2021 @ 01:00AM

జడ్పీ చైర్మన్‌గా ఎం.వెంకటసుబ్బారెడ్డి

ఎం.వెంకటసుబ్బారెడ్డి

  1. వైస్‌ చైర్మన్లుగా శిరివెళ్ల, హొళగుంద జడ్పీటీసీలు
  2. నేడు చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్లు, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక


కర్నూలు(న్యూసిటీ)/సంజామల, సెప్టెంబరు 24: జిల్లా పరిషత్‌ 14వ చైర్మన్‌గా సంజామల జడ్పీటీసీ ఎం.వెంకటసుబ్బారెడ్డి ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతోపాటు శిరివెళ్ల జడ్పీటీసీ దిల్షాద్‌ నాయక్‌, హొళగుంద జడ్పీటీసీ కురువ బొజ్జమ్మను వైఎస్‌ చైర్మన్లను కూడా ఖరారు చేశారు. శనివారం జరిగే ఎన్నికల్లో వీరి పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. జడ్పీ చైర్మన్‌గా ఎం.వెంకట సుబ్బారెడ్డి పేరు ఖరారు కావడంతో నొస్సంలో సంబరాలు జరుపుకున్నారు. కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల వెంకటరెడ్డిని జడ్పీ చైర్మన్‌గా గతంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆయన కరోనాతో మృతి చెందడంతో మల్కిరెడ్డిని పదవి వరించింది. నొస్సం గ్రామస్థుడైన వెంకట సుబ్బారెడ్డి, ఆయన తండ్రి జయరామిరెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వారు. పులివెందులకు వెళ్లే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నొస్సంలో మల్కిరెడ్డి ఇంట్లో భోజనం లేదా అల్పాహారం తీసుకునే వారు. భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీలో, చల్లా రామకృష్ణారెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి వైసీపీలో పని చేసిన వెంకట సుబ్బారెడ్డి తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జిల్లా రాజకీయాలతోపాటు కడప జిల్లా రాజకీయాల్లో కూడా మల్కిరెడ్డికి గుర్తింపు ఉంది. ఈయన నొస్సం ఉపసర్పంచ్‌గా, సంజామల సహకారం సంఘం వైస్‌ చైర్మన్‌గా పదవులు నిర్వహించారు. 


జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తా: మల్కిరెడ్డి


రాజకీయాలకు అతీతంగా జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తా. వర్గ వైషమ్యాలకు తావు లేకుండా జిల్లాలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నా లతోపాటు ప్రభుత్వ పథకాలు, నిరుపేదలకు అందేలా పని చేస్తా. జడ్పీ చైర్మన్‌ పదవి దివంగత ఎర్రబోతుల వెంకటరెడ్డికి అంకితం చేస్తున్నా. 


 సుదీర్ఘ చరిత్ర ఉన్న జిల్లా పరిషత్‌కు ఇప్పటి వరకు 13 మంది చైర్మన్లు సేవలు అందించారు. వీరిలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రెండు పర్యాయాలు (23-12-1959 నుంచి 27-01-1962 ఒకసారి, 11-09-1964 నుంచి 09-05-1967 మరోసారి) పని చేశారు. మద్దూరు సుబ్బారెడ్డి (28-01-1962 నుంచి 10-09-1964 వరకు) తన దైన ముద్ర వేశారు. ఎం.లక్ష్మీకాంతరెడ్డి(26-05-1967 నుంచి 09-02-1976) పది సంవత్సరాలు జడ్పీ చైర్మన్‌గా పని చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి(12-07-1981 నుంచి 11-08-1982), టీజీ వసంతగుప్తా (15-09-1982 నుంచి 11-07-1986), మసాల ఈరన్న (02-05-1987 నుంచి 19-05-1992), పీపీ నాగిరెడ్డి(20-03-1995 నుంచి 19-03-2000), బత్తిన వెంకటరాముడు(23-07-2001 నుంచి 22-07-2006), లబ్బి వెంకటస్వామి(23-07-2006 నుంచి 30-05-2009), సి.తిక్కన్న(31-05-209 నుంచి 29-09-2009), ఆకెపోగు వెంకటస్వామి (30-09-2009 నుంచి 22-07-2011), మల్లెల రాజశేఖర్‌ (5-07-2014 నుంచి 04-07-2019) వరకు సేవలు అందించారు. ఈ వరుసలో వెంటకసుబ్బారెడ్డి జడ్పీ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. 


పూర్తయిన ఏర్పాట్లు


జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక శనివారం జరగనుంది. అలాగే ఇద్దరు వైఎస్‌ చైర్మన్లు, ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీలకు ఈ ఎన్నిక కోసం ఇప్పటికే కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటలకు కో ఆప్షన్‌ సభ్యుల నుంచి నామినేషన్లు స్వీకరించి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది. అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముందుగా కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌ 


జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్లు, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికల అబ్జర్వర్‌ నవీన్‌కుమార్‌తో కలిసి జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు నిర్వహించే భవనంలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సభ్యులకు, అధికారులకు స్థానాలు ఎక్కడ కేటాయించాల్సిందీ సూచించారు. మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఉండాలని ఆదేశించారు. బారికేడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. వీవీఐపీ పార్కింగ్‌, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చూసుకోవాలని ట్రాఫిక్‌ డీఎస్పీని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఆయన వెంట జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌రావు, ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, టూటౌన్‌ సీఐ పార్థసారథిరెడ్డి, ట్రాఫిక్‌ ఆర్‌ఐ ఆనంద్‌, ఆర్‌ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ ఉన్నారు.