సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన క్రిస్ లిన్

ABN , First Publish Date - 2022-06-04T02:18:01+05:30 IST

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ లిన్‌ తనపై వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చాడు.

సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన క్రిస్ లిన్

నార్తంప్టన్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ లిన్‌ తనపై వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. నార్తంప్టన్‌షైర్ తరపున ఆడుతున్న క్రిస్‌ లిన్.. లీస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బాల్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్‌ లిన్‌ టీ20 కెరీర్‌లో తన మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. క్రిస్‌ లీన్ మెరుపు ఇన్నింగ్స్‌తో నార్తంప్టన్‌షైర్ 46 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.


ఈ టోర్నీకి ముందు క్రిస్‌ లిన్ పనైపోయిందని.. అతను రాణించే అవకాశం లేదంటూ విమర్శలు ఊపందుకున్నాయి. ఒక్క సెంచరీతో క్రిస్‌ లిన్ విమర్శకుల నోటికి తాళం వేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తంప్‌టన్‌షైర్ 20 ఓవర్లలో 227 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తొలి వికెట్‌కు మరో ఓపెనర్‌ బెన్‌ కరన్‌తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్‌కు జేమ్స్‌ నీషమ్‌ తోడయ్యాడు. ఐపీఎల్‌ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన నీషమ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు.  30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లీస్టర్‌షైర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.

Updated Date - 2022-06-04T02:18:01+05:30 IST