Abn logo
Sep 14 2021 @ 00:02AM

విదేశీ ఉద్యోగాల పేరిట దగా!

బెహ్రయిన్‌లో పరిశ్రమ సమీపంలో సమావేశమైన వందలాది మంది బాధితులు


 పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు

 అనుమతులున్నవి కొన్నే

 ఆకర్షణీయమైన జీతం అంటూ వల

 తీరా పంపించాక పట్టించుకోని వైనం

 మోసపోతున్న నిరుద్యోగ యువత

 ఉద్దానంలో పెరుగుతున్న బాధితులు

(వజ్రపుకొత్తూరు)

ఉద్దానం మండలాల్లో యువకులకు ఏంచేస్తున్నారని పలకరిస్తే వినిపించే మాట ‘అవుటాఫ్‌’. ఫిట్టర్‌, వెల్డర్‌, ఫాబ్రికేటర్‌ పనులకు కుదిరే యువత ఇలా విదేశాలకు ‘అవుటాఫ్‌’ అని సంబోధిస్తుంటారు. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లోని వేలాది మంది యువత విదేశాల్లో పనిచేస్తుంటారు. ఇందుకుగాను ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. లక్షలాది రూపాయలు కట్టి మరీ పనులకు కుదురుతారు. కొన్నేళ్ల కిందట వరకూ విదేశాలకు వెళ్లిన వారికి దండిగా ఆదాయం సమకూరేది. వేతనాల రూపంలో లక్షలాది రూపాయలు వచ్చేవి. కానీ ఇటీవల మేన్‌పవర్‌ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ గుర్తింపులేనివి అధికం. ఇది తెలియక నిరుద్యోగ యువత వాటిని ఆశ్రయించి మోసపోతున్నారు. ఒక దేశం పేరు చెప్పి మరో దేశానికి తరలిస్తున్నారు. తాత్కాలిక, ట్రావెల్‌ విసాలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడుకున్న వేతనం ఒకలా ఉంటే..అక్కడి పరిశ్రమలు ఇచ్చేది అంతంతమాత్రం. గల్ఫ్‌ దేశాల్లో పరిస్థితి మరింత దయనీయం. ఒక్కోసారి కలాసీలు, స్వీపర్లుగా కూడా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పాస్‌పోర్టు, విసాల్లో నిబంధనలు పాటించకపోతే అక్కడ ప్రభుత్వాలు కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. 

పల్లెల్లో దళారీలు

విదేశీ ఉద్యోగాల పేరిట ఇటీవల యువత మోసపోతున్నారు. ఏజెన్సీల మాయలో పడిపోతున్నారు. తొలుత విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ పట్టణాల్లో ఉండే ఈ ఏజెన్సీలు పల్లెలకు పాకాయి. కొంతమంది దళారులుగా అవతారమెత్తి యువత నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. నేరుగా గ్రామాలకు వెళ్లి నిరుద్యోగ యువతను కలుస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం, మంచి వసతులు, ఓవర్‌ టైమ్‌ డ్యూటీ అంటూ నమ్మబలుకుతున్నారు. దీంతో యువత వాటిపై ఆసక్తికనబరుస్తున్నారు. అప్పుచేసి మరీ వారికి నగదు కడుతున్నారు. తీరా మోసపోయామని తెలిసి బాధపడుతున్నారు. విదేశాలకు వెళ్లేంతవరకూ హడావుడి చేసే ఏజెన్సీ ప్రతినిధులు తరువాత ముఖం చాటేస్తున్నారు. తాము కష్టాల్లో ఉన్నామని చెప్పేందుకు ఫోన్‌చేసినా స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

దినదినగండంగా

‘మాపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయి. విచక్షణారహితంగా కొడుతున్నారు. భోజనం మరింత దారుణంగా ఉంది. కనీస నాణ్యత లేదు. మా పరిస్థితి దినదినగండంగా ఉంది. స్వగ్రామాలకు క్షేమంగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేయండి’..అంటూ బెహ్రయిన్‌ ‘ఎన్‌ఎస్‌హెచ్‌’ కంపెనీలో పనిచేస్తున్న జిల్లా వాసులు కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. తమవారు అక్కడ ఎలా ఉన్నారో? అంటూ తల్లడిల్లిపోతున్నారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాకు చెందిన నాలుగు వేల మంది కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నారు. అక్కడ వారు పడుతున్న బాధలపై పత్రికల్లో కథనాలు వచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభుత్వాలు స్పందించడం లేదు. మంత్రి సీదిరి అప్పలరాజు బాధితులను అండగా ఉంటామని..ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు. కానీ అక్కడి భారత రాయభార అధికారులు కానీ.. ప్రభుత్వం కానీ స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా బాధితులు ఉన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా అక్కడ పనికి కుదిరారు. ఏజెన్సీ ప్రతినిధులకు ఫోన్‌చేస్తుంటే స్పందన లేదని...నేపాల్‌ నుంచి పరిశ్రమలో పనికి వచ్చిన కార్మికులను అక్కడి ప్రభుత్వం క్షేమంగా ఇళ్లకు చేర్చిందని చెబుతున్నారు. పైగా ఎన్‌ఎస్‌హెచ్‌ యాజమాన్యం కార్మికుల మధ్య విభజించు పాలించు అన్న చందంగా వ్యవహరిస్తోందని... తెలుగు కార్మికులపై కేరళ వారితో దాడులు చేయిస్తోందన్నారు. తక్షణం జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.