పశువుల్లో లంపి స్కిన్‌

ABN , First Publish Date - 2022-09-13T07:02:19+05:30 IST

లంపి స్కిన్‌ వ్యాధి విస్తరించడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

పశువుల్లో లంపి స్కిన్‌
లంపి స్కిన్‌ వ్యాధి సోకిన ఆవు

ఆందోళనలో పాడి రైతులు

వ్యాధి సోకకుండా ముందస్తు చర్యలు 


ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 12: లంపి స్కిన్‌ వ్యాధి విస్తరించడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. లంపిస్కిన్‌ వ్యాధి పశువుల్లో వ్యాపిస్తుంది. ముఖ్యంగా తెల్ల ఆవులకు ఈ వ్యాధి సోకుతోంది. దోమలు, ఈగలు, తేళ్లు, ఇతర కీటకాలు కుట్టడం వల్ల ఇది పశువులకు వ్యాపిస్తోంది. పలు రాష్ర్టాల్లో ఈ వ్యాధి వల్ల వందలాది పశువులు చనిపోతున్నాయి. మన రాష్ట్రంలోను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పల్నాడు జిల్లాల్లోని పశువుల్లో ఈ వ్యాధి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మన జిల్లాలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. ఈ వ్యాధి జిల్లాలో విస్తరించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పశువుల సంతలను నిషేధించారు. జిల్లా సరిహద్దుల వద్ద గల చెక్‌ పోస్టులలో ఇతర జిల్లాల నుంచి పశువులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పశువులకు ముందస్తు వ్యాక్సిన్‌లు వేయిస్తున్నారు. 


వ్యాధి లక్షణాలు.. జాగ్రత్తలు


లంపి స్కిన్‌ సోకిన పశువుల్లో నోటి, ముక్కుల నుంచి ద్రవాలు, శరీరమంతా పొక్కులు వస్తాయి. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుంది. తినడానికి ఇబ్బంది పడతాయి. అధిక జ్వరం వస్తే మరణాలు సంభవించే అవకాశం ఉంది.  అయితే ఎక్కువగా వ్యాధి సోకిన జంతువుల్లో మరణాలు తక్కువగానే ఉంటాయి. రైతులంతా పశువుల చావిడి శుభ్రంగా ఉంచుకోవాలి. క్రిమికీటకాలు, దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త పడాలి. పశువుల గొట్టాలను, పరిసరాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీ చేయాలి. లంపిస్కిన్‌ వ్యాధి వచ్చిన పశువుల చర్మంపై పొక్కులు, నోట్లో బొబ్బర్లు, తీవ్రమైన జ్వరం వస్తుంది. ఈ వ్యాధి సోకిన జంతువులు మరో జంతువుతో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. వ్యాధి సోకిందని తెలిస్తే మంద నుంచి వేరుచేయాలి. ఈ వ్యాధిని నివారించడానికి గోట్‌ పాక్స్‌ వ్యాక్సినేషన్‌ వేయించాలి. పశువైద్యుల సలహాతో యాంటీ బయోటిక్‌, ఇతర మందులు వాడాలి. శరీరంపై ఏర్పడిన పుండ్లకు యాంటిసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ వాడటం ద్వారా తగ్గించవచ్చు. వ్యాక్సిన్‌ పశువు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి. 


ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం

లంపిస్కిన్‌ వ్యాధి గురించి పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదు. ఇది ప్రాణాంతకమైనది కాదు. అయినప్పటికి వ్యాధి సోకితే పశువులకు నష్టం కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టాం. ఇతర జిల్లాల నుంచి పశువులు మన జిల్లాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. వ్యాధి రాకుండా ముందస్తు వ్యాక్సిన్‌ వేస్తున్నాం. జిల్లాలో పశు సంతలను నిషేదించాం. ఇంతవరకు పశువుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించ లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.   

– డాక్టర్‌ బి.గోవిందరాజు,  పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ 

Updated Date - 2022-09-13T07:02:19+05:30 IST