Lulu Mall namaz row : లులు మాల్ నుంచి కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-07-19T17:17:19+05:30 IST

నగరంలోని లులు మాల్ (Lulu Mall) ప్రాంగణంలో నమాజ్ వివాదంపై యాజమాన్యం స్పందించింది. తమ సిబ్బందిలో 80 మంది హిందువులేనని సంస్థ స్పష్టం చేసింది.

Lulu Mall namaz row : లులు మాల్ నుంచి కీలక ప్రకటన

లక్నో: నగరంలోని లులు మాల్ ఆవరణలో నమాజ్ వివాదంపై ((Lulu Mall Namaz Row)) యాజమాన్యం స్పందించింది. తమ సిబ్బందిలో 80 మంది హిందువులేనని (Hindus) సంస్థ స్పష్టం చేసింది. లులు మాల్(Lulu mall) ఒక సంపూర్ణ వ్యాపార సంస్థ అని, కులం, వర్గంతో సంబంధం లేకుండా వ్యాపారాన్ని నడుపుతోందని సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ జయ్‌కుమార్ గంగాధర్ హిందీలో ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా(Social Media)లో సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసినట్టు చెప్పారు. స్వప్రయోజనాల కోసం తమ సంస్థను టార్గెట్ చేయడం దురదృష్టకరమని సంస్థ వ్యాఖ్యానించింది. మాల్‌లో పనిచేస్తున్న స్థానిక సిబ్బందిలో ఉత్తరప్రదేశ్‌(Uttarpredesh)తోపాటు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారున్నారని, ఇందులో 80 శాతం మంది హిందువులేనని పేర్కొంది. మిగతావారిలో ముస్లింలు, క్రిస్టియన్లతోపాటు ఇతర మతస్థులు ఉన్నారని చెప్పింది. సంస్థలో ఎవరినీ మతసంబంధ కార్యకలాపాలకు అనుమతించబోమని, పబ్లిక్ ప్రదేశంలో నమాజ్ చేసిన వ్యక్తులపై కేసు కూడా పెట్టామని ప్రస్తావించింది. 


మాకు కస్టమర్లే ముఖ్యం..

‘‘ కస్టమర్లే మాకు ముఖ్యం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మా సంస్థ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. మా ఉద్యోగులను కులం, వర్గం, మతం ప్రాతిపదికన ఎంపిక చేయలేదు. వారి పని సామర్థ్యం, మెరిట్‌ని బట్టే తీసుకున్నాం. స్వార్థ ప్రయోజనాల కోసం మా సంస్థను టార్గెట్ చేయవద్దు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నడిచే మా వ్యాపారాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వండి ’’ అని కోరింది.


ఈ వివాదంపై యూపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ మంత్రి నందగోపాల్ గుప్తా కూడా స్పందించారు. లులు మాల్ ఘటన సంఘవ్యతిరేక శక్తుల పనిగా అభివర్ణించారు. పెట్టుబడుల విషయంలో దూసుకుపోతున్న యూపీ ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించడమే లక్ష్యంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 


6 రోజుల కిందట లక్నోలోని లులు మాల్ ఆవరణలో గుర్తుతెలియని యువకులు నమాజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లులు మాల్ ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ వీడియోపై ప్రచారం జరుగుతోంది. అఖిల్ భారతీయ హిందూ మహాసభకు చెందిన కొందరు నిరసనలు తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో వివాదం మొదలైంది. మాల్ ఆవరణలో ఎలాంటి ప్రార్థనలను అనుమతించేది లేదంటూ నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది.


లులు మాల్ గ్రూపు యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ సంస్థ భారతీయ విభాగం లులు ఇండియ షాపింగ్ మాల్ ప్రైవేటు లిమిటెడ్‌ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక షాపింగ్ మాల్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు 20 దేశాలకుపైగానే వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. వార్షిక టర్నోవర్ 8 బిలియన్ డాలర్లు పైమాటే.

Updated Date - 2022-07-19T17:17:19+05:30 IST