Lulu Mall Controversy : ప్రార్థనలను అనుమతించేది లేదని షాపింగ్ కాంప్లెక్స్ నోటీసు

ABN , First Publish Date - 2022-07-15T23:19:09+05:30 IST

లులు మార్కెట్ వివాదంతో లక్నోలోని మాల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. మాల్ ఆవరణలో ఎలాంటి ప్రార్థనలను అనుమతించేది లేదంటూ..

Lulu Mall Controversy : ప్రార్థనలను అనుమతించేది లేదని షాపింగ్ కాంప్లెక్స్ నోటీసు

లక్నో: లులు మార్కెట్ (Lulu Mall) వివాదంతో లక్నోలోని మాల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. మాల్ ఆవరణలో ఎలాంటి ప్రార్థనలను అనుమతించేది లేదంటూ నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. మాల్‌ కాంప్లెక్స్‌లో కొందరు నమాజు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై అఖిల్ భారతీయ హిందూ మహాసభకు చెందిన కొందరు నిరసనలు తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


భారత సంతతికి చెందిన బిలియనీర్ యూసుఫ్ అలి ఎంఎ సారథ్యంలోని అబు దబికి చెందిన లులు గ్రూప్ ఏర్పాటు చేసిన లులు మార్కెట్ మాల్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ మాల్‌లో కొందరు నమాజ్ జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో రావడంతో అఖిల భారతీయ హిందూ మహాసభ సభ్యులు కొందరు మాల్ గేటు బయట నిరసనకు దిగారు. ''ఒక వర్గానికి చెందిన వారిని నమాజ్ చేసుకునేందుకు మాల్‌లో అనుమతిస్తున్నారు. హిందువులు, ఇతర వర్గాల వారిని కూడా ప్రార్థనలు చేసేందుకు మాల్ అధికారులు అనుమతించాలి'' అని మహాసభ ప్రతినిధి శిశిర్ చతుర్వేద్ డిమాండ్ చేశారు. తనను, తమ సభ్యులు కొందరిని మాల్‌లోకి అనుమతించలేదని కూడా ఆయన ఆరోపణ చేశారు.


జనరల్ మేనేజర్ వివరణ...

కాగా, ఈ వివాదంపై లులు మాల్ జనరల్ మేనేజర్ సమీర్ వర్మ ఒక వీడియో ప్రకటన చేశారు. ''అన్ని మతాల వారిని మేము గౌరవిస్తాం. మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలను ఇక్కడ అనుమతించం. అలాంటి కార్యక్రమాలను పసిగట్టేందుకు ఫ్లోర్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి మేము శిక్షణ ఇచ్చాం'' అని ఆ వీడియోలో సమీర్ వర్మ పేర్కొన్నారు. మాల్ కాంప్లెక్స్‌లో నమాజు జరగడంపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసులు లులు మాల్ వద్ద మోహరించారు.

Updated Date - 2022-07-15T23:19:09+05:30 IST