మున్సిపాలిటీలో లుకలుకలు

ABN , First Publish Date - 2022-08-17T05:39:07+05:30 IST

నంద్యాలకు కమిషనర్‌గా రవిచంద్రారెడ్డి వచ్చినప్పటి నుంచి ఆయనకు, ఉద్యోగులకు పొసగడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి

మున్సిపాలిటీలో లుకలుకలు

ఉద్యోగుల మధ్య చిచ్చు రేపిన మెమో
అలిగి వెళ్లిపోయిన అసిస్టెంట్‌ కమిషనర్‌


నంద్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నంద్యాలకు  కమిషనర్‌గా రవిచంద్రారెడ్డి వచ్చినప్పటి నుంచి ఆయనకు, ఉద్యోగులకు పొసగడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆవి ముదిరి పాకన పడ్డాయని సమాచారం. వారం పది రోజుల కిందట మేనేజర్‌కు మెమో ఇచ్చిన కమిషనర్‌ తాజాగా అసిస్టెంట్‌ కమిషనర్‌ దాసుకు కూడా మెమో ఇవ్వడం చర్చగా మారింది. అసలు మొత్తం గొడవకు  ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ కారణమని తెలుస్తోంది.  వరకు సచివాలయ సిబ్బందికి జీతాలు ఇచ్చే సమయంలో సదరు జూనియర్‌ అసిస్టెంట్‌ చేతివాటం ప్రదర్శించాడని సమాచారం. ఇలా ఇచ్చే సమయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫైల్‌ పంపకుండా నేరుగా కమిషనర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి అవకతవకలు ప్రస్తుత కమిషనర్‌ దృష్టికి రావడంతో అసిస్టెంట్‌ కమిషనర్‌ను పిలిచి ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు. అందుకుగాను బాధ్యత వహించాలంటూ మంగళవారం మెమో ఇవ్వబోయారు. అసలు ఫైలు తన దగ్గరకు రానపుడు తానెందుకు బాధ్యత వహిస్తానంటూ అసిస్టెంట్‌ కమిషనర్‌ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. అలాగే అధికారులకు వాహనాలు కేటాయించే విషయంలో కూడా కమిషనర్‌ పక్షపాతం చూపినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ డీఈఈ, ఎంఈఈకి వాహనం కేటాయించి, అసిస్టెంట్‌ కమిషనర్‌కు కేటాయించకుండా అడ్డుపడ్డారని సమాచారం. కానీ కమిషనర్‌ మాత్రం అందులో వాస్తవం లేదని, తాను సిఫార్సు లేఖ పంపించానని, పై నుంచి రాకపోతే తానేం చేయగలనని సమాధానమిస్తున్నారు.

Updated Date - 2022-08-17T05:39:07+05:30 IST