పోలీస్ స్టేషన్‌కు బాధితురాలు... పాట పాడి సినిమా పేరు చెప్పాలన్న ఇన్‌స్పెక్టర్!

ABN , First Publish Date - 2021-02-23T17:33:57+05:30 IST

యూపీలోని లక్నోలో వరకట్న వేధింపులకు గురవుతున్న...

పోలీస్ స్టేషన్‌కు బాధితురాలు... పాట పాడి సినిమా పేరు చెప్పాలన్న ఇన్‌స్పెక్టర్!

లక్నో: యూపీలోని లక్నోలో వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళకు పోలీస్ స్టేషన్‌లో ఘోర అవమానం ఎదురైంది. మోహన్ లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెతో... ఇన్‌స్పెక్టర్ ఒక సినిమా పాట పాడుతూ హేళన చేశారు. అయితే బాధితురాలు తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసు అధికారుల్లో అలజడి మొదలైంది. 


వెంటనే పోలీసులు ఆమె ఫిర్యాదును నమోదు చేసుకోవడంతో పాటు, దీనిపై విచారణకు డీసీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్‌స్పెక్టర్ దీనానాథ్ మిశ్రా తాను బాధితురాలి ముందు ఎటువంటి పాట పాడలేదని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే బెలహనీ నివాసి రేణుకు గత ఏడాది జూన్ 26న టికరీ నివాసి రాహుల్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల తరువాత నుంచి ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తాజాగా అత్తింటివారు ఆమెపై దాడి చేశారు. ఈ నేపధ్యంలో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత ఆమె పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ ఆమెతో మాట్లాడుతూ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత ఇప్పుడు ఫిర్యాదు చేస్తే ఎలా అంటూ... ఒక పాట పాడుతూ.. ఆ పాట ఏ సినిమాలోదో ఆమెను చెప్పమన్నారు. పైగా ఫిర్యాదు కూడా తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పారు. దీంతో ఎంతో కలత చెందిన ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫలితంగా ఈ ఉదంతం పోలీసు ఉన్నతాధికారుల వరకూ చేరింది. 

Updated Date - 2021-02-23T17:33:57+05:30 IST