Jul 7 2021 @ 20:36PM

అదృష్టం కలిసిరాని ప్రియా ఆనంద్‌

కోలీవుడ్‌లో గత పుష్కరకాలంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న హీరోయిన్లలో ప్రియా ఆనంద్‌  ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ భామ 2008లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ తెలుగు భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, ఏ ఒక్క ఇండస్ట్రీలోనూ ఆమె పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. కోలీవుడ్‌లో ఈమె నటించిన తొలి చిత్రం ‘వామనన్‌’. ఆ తర్వాత తెలుగులో ‘లీడర్‌’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా హిందీలో ‘ఇంగ్లీస్‌ వింగ్లీష్‌’, మలయాళంలో ‘ఎజ్రా’, కన్నడంలో ‘రాజకుమార’ వంటి చిత్రాల ద్వారా అడుగుపెట్టింది. కానీ, ఆమెకు ఏ ఒక్క చిత్రమూ బ్రేక్‌ ఇవ్వలేదు.  

దీంతో తాను కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని చెప్పేందుకు వీలుగా అప్పుడప్పుడూ ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహిస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ, తన అభిమానులతో పాటు నెటిజన్లను అలరిస్తోంది.  తాజాగా ఆమె పూర్తి స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ తీసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అవి వైరల్‌ అయ్యాయి. కాగా, ప్రియా ఆనంద్‌ చేతిలో ప్రస్తుతం మూడు కన్నడ చిత్రాలతో పాటు ఒక తమిళ ప్రాజెక్టు ఉన్నాయి. 2010 నుంచి 2011 మధ్యకాలంలో ఈమె  నాలుగు తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. దీంతో ఆమె తన మాతృభాష కోలీవుడ్‌నే నమ్ముకుని, తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తోంది.