దరఖాస్తుల వెల్లువ

ABN , First Publish Date - 2020-10-31T07:00:15+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. లేఅవుట్‌ చేయని భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల వెల్లువ

నేటితో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు 

కరీంనగర్‌లో భారీ స్పందన 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు భారీగా ఆదాయం 

మరోసారి గడువు పొడగించే అవకాశం 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 30: ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. లేఅవుట్‌ చేయని భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగియనున్నది. ఇదే చివరి అవకాశమంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడంతో అంచనాలకు మించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 30వేల వరకు దరఖాస్తు చేసుకుంటాయని అంచనా వేయగా దరఖాస్తు చేసుకు నేందుకు మరో రోజు ఉండగా 28,800 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఆన్‌లైన్‌లో వేయి రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. శనివారం మరో 800 వరకు దరఖాస్తు చేసుకుంటారని భావిస్తున్నారు. జిల్లాలోని హుజురాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో కూడా ఎల్‌ఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ ఉందని, పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే ఆదాయం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఖర్చుచేసుకునే అవకాశం కల్పించడంతో పట్టణాలు, నగరా లకు భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. 

 

దరఖాస్తుల ద్వారా ఆదాయం

ఒక్కో దరఖాస్తుకు వేయి రూపాయల చొప్పున చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో మున్సిపాలిటీలకు దరఖాస్తు ఫీజుల ద్వారానే లక్షల్లో ఆదాయం వచ్చింది. దరఖాస్తుదారులు జనవరి 31వ తేదీ వరకు మొత్తం చార్జీలను చెల్లించాలని ప్రభుత్వం మొదట్లో పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత దరఖాస్తు స్వీకరణ గడువును 15 రోజులు పొడగించడంతో చార్జీల చెల్లింపు గడువు కూడా ఫిబ్రవరి 15 వరకు ఉంటుందని, ఈ దరఖాస్తులతో దాదాపు కోట్లలోనే ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గత సెప్టెంబర్‌ 1న భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) పథకాన్ని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. లే అవుట్‌ చేయని ఫ్లాట్లు, భూములను కొనుగోలు చేసిన వారు విధిగా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని, ఇదే చివరి అవకాశమని, ఈ అవకాశాన్ని వినియోగించుకోనట్లయితే అక్ర మ లే అవుట్ల ఫ్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం జరుగదని పేర్కొన్నారు. అలాగే ఇంటి పర్మీషన్లు కూడా ఇవ్వమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ఎప్పుడు కూడా ఇలా ఇదే చివరి అవకాశమని, ప్రతి ఫ్లాట్‌, స్థల యజమాని విధిగా క్రమబద్ధీకరించుకోవాలని భారీగా ఫీజులు నిర్ణయించలేదని, ఇది ముమ్మాటికీ ప్రజలపై భారం మోపడమేనంటూ ప్రతిపక్షాలతోపాటు అనేక మంది విమర్శలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవలసిన అవసరం కూడా లేదని, తాము అధికారంలోకి వస్తే ఉచితంగానే ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.


ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకునే గడువు ముగియగా ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడగించింది. అంతేకాకుండా వేయి రూపాయలతో దరఖాస్తు చేసుకొని జనవరి 31లోగా మిగిలిన ఫీజు చెల్లించవచ్చనే వెసులుబాటు కల్పించడంతోపాటు ప్లాట్‌ లేదా స్థలం కొనుగోలుచేసిన నాటి మార్కెట్‌ విలువలపై మాత్రమే ఫీజు చెల్లించాలని ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ ప్రజలు మాత్రం వేయి రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత చూద్దాం లే అన్నట్లుగా ఒక్కొక్కరుగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగి పోయింది. 


80శాతం దరఖాస్తులు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో దాదాపు 80శాతం మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడక్కడ ఆన్‌లైన్‌ సమస్యలు ఉత్పన్నం కావడం, కొన్ని కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అండర్‌ ప్రాసెస్‌ లేదా పెండింగ్‌ లేదా రిజెక్టు రావడంతో కొందరు రెండు, మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. గత ఆగస్టు నెల 26వ తేదీ వరకు అభివృద్ధి చేసిన లే అవుట్లు, విక్రయించిన ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా అక్టోబర్‌ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే లే అవుట్‌ అనుమతి లేని స్థలాలు, మున్సిపల్‌, స్థానిక సంస్థల అనుమతి లేని ఇళ్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం భవిష్యతులో క్రమబద్ధీకరించుకోని వారికి కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు సౌకర్యం కల్పించమని స్పష్టం చేసింది.


క్రమబద్దీకరించుకోని ప్లాట్ల క్రయవిక్రయాలపై నిషేధం విధించడంతోపాటు అలాంటి ప్లాట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఉండవని తేల్చి చెప్పింది. ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం ప్రకటించినందున మిగిలిన 20శాతం మందికి మరోసారి అవకాశ మిచ్చేందుకు గడువును మరో 15 రోజులు పొడగించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఒకవేళ గడువు పొడగించని పక్షంలో గతంలో మాదిరిగా ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశమిస్తూ ఫీజు రేట్లను మరింత పెంచే అవకాశం లేక పోలేదని చర్చించుకుంటున్నారు. అయితే వేయి రూపాయలతో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న వారంతా మొత్తం ఫీజు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్లు తీసుకుంటారో లేక పెండింగ్‌లో పెడతారో వేచి చూడాలి.  

Updated Date - 2020-10-31T07:00:15+05:30 IST