పరిశీలన ఎప్పుడో?

ABN , First Publish Date - 2020-11-25T04:57:22+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది ఇప్పట్లో ముందుకు సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిశీలన ఎప్పుడో?

  • ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో జాప్యం 
  • ప్లాట్ల యజమానుల ఎదురుచూపులు
  • క్షేత్రస్థాయిలో ప్లాట్ల పరిశీలనకు సిబ్బంది కొరత 
  • జనవరిలోగా పూర్తయ్యేది గగనమే...


ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది ఇప్పట్లో ముందుకు సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులు పరిశీలించేందుకు సరిపోయేంత మంది సిబ్బంది లేకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడా వీటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. దీంతో ఇది పూర్తి కావడానికి సమయం బాగానే పట్టేలా కనిపిస్తోంది. అయితే, అవి ఎప్పుడు పూర్తవుతాయా అని ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు ఎదురు చూస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : అక్రమ లేఅవుట్లు, అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద నమోదు చేసుకున్న దరఖాస్తులకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఎంతకాలం పడుతుందోనన్న ఆందోళన దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా తాము చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని వచ్చే జనవరిలోగా చెల్లించాలంటూ ప్రభుత్వం గడువు విధించింది. అయితే ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఏ విధంగా పరిశీలించాలనే విషయమై ప్రభు త్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలోని 4 మునిసిపాలిటీలు, 566 పంచాయతీల్లో సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలన్నీ సవ్యంగానే ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాతనే ఎంత చెల్లించాలనే వివరాలను దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తారు. సూచించిన మొత్తం చెల్లించిన తర్వాత ప్లాట్‌ను క్రమబద్ధీకరిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేస్తారు. అప్పుడే ఆ ప్లాట్‌లో నిర్మాణానికి, లేదా ఇతరులకు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరించినట్లు ఉత్తర్వులు జారీచేసే వరకు వాటిలో ఇంటి నిర్మాణం చేపట్టడానికి గానీ, లేదా ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేయడానికి గానీ అవకా శం లేదు. అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీవరకు గడువు విధించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టం చేయడం తో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. లైసెన్స్‌ ఇంజినీర్లు, సర్వేయర్లు, మీసేవా కేంద్రా లు, సెల్‌ఫోన్‌ ద్వారా ప్రజలు ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, రూ.వెయ్యి ఫీజుతో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లేని లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోకపోతే.. రిజిస్ట్రేష న్‌ చేసుకోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయరని, ఇదివరకే రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉన్నవారికి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరనే విష యం ప్రభుత్వం స్పష్టం చేయడంతో దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చారు. 


తప్పని ఎదురుచూపులు 


ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభు త్వం జారీచేసే మార్గదర్శకాల కోసం దరఖాస్తు దారులు ఎదురు చూస్తున్నారు. ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకునే సమయంలో  దరఖాస్తు ఫీజు కింద రూ.వెయ్యి చెల్లించగా, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు అధికారులు భావిస్తే... క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం రోడ్లకు అవసరమయ్యే స్థలాన్ని ప్లాట్‌ నుంచి మినహాయిస్తారు. మిగతా ప్లాట్‌ విస్తీర్ణానికి ఎంత చెల్లించాలనేది తెలియజేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ప్రకారం మార్కెట్‌ విలు వ ఆధారంగా ఎంత చెల్లించాలనేది అధికారులు నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అధికారులు ప్లాట్‌ క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలకు, దరఖాస్తులో పేర్కొన్న వివరాలకు ఒకవేళ పొంతన కుదరకపోతే క్రమబద్ధీకరించకుండా నిలిపివేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం మునిసిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందితో గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయడం కష్టమేననేది స్పష్టమవుతోంది. 


మార్గదర్శకాలు రాగానే ప్రారంభిస్తాం..


ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. వచ్చిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటాం. 

- ముంతాజ్‌, జిల్లా పట్టణ ప్రణాళికాధికారి, వికారాబాద్‌


క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు (నియోజకవర్గాల వారీగా)

తాండూరు  12,347 

పరిగి    4,239

వికారాబాద్‌ 4,041

కొడంగల్‌   414 

Updated Date - 2020-11-25T04:57:22+05:30 IST