ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన

ABN , First Publish Date - 2020-11-21T04:58:48+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు భారీ స్పందన వచ్చింది. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన

  • మేడ్చల్‌ జిల్లాలో వచ్చిన దరఖాస్తులు : 1,39,030
  • త్వరలోనే క్రమబద్ధీకరణకు కసరత్తు
  • పలుచోట్ల వాటర్‌బాడీల్లో వెలిసిన లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలు 
  • హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు అడ్డంకి..
  • ‘ఔటర్‌’ బఫర్‌జోన్‌లో క్రమబద్ధీకరణ కష్టమే..


తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు భారీ స్పందన వచ్చింది. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే వీటిని క్షుణ్ణంగా పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శిఖం భూములు, అసైన్డ్‌భూములు, నాలాలు కబ్జా చేసి వేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలామంది వీటికింద ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : మునిసిపాలిటీ, గ్రామపంచాయతీల్లో ఆమోదం లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరేషన్‌ స్కీం)ను ప్రవేశపెట్టింది. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన లభించింది. హెచ్‌ఎండీఏ సాంకేతిక అనుమతి లేని లేఅవుట్లన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు క్రమబద్ధీకరించనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వచ్చినటువంటి దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం 886 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు జిల్లాయంత్రాంగం గుర్తించింది. గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పలుచోట్ల చెరువులు, కుంటలను ఆనుకుని లేఅవుట్లను ఏర్పాటు చేశారు. మరికొన్నిచోట్ల నాలాలను కూడా ఆక్రమించినట్లు తెలిసింది. కొంతమంది వాటర్‌ బాడీల్లో ఏర్పాటుచేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో తక్కువ ధరకు ప్లాట్లు రావడంతో పలువురు కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం శిఖం భూములు, అసైన్డ్‌భూములు, నాలాలు కబ్జాలు చేసి వేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించమని స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం ఈ ప్లాట్లను క్రమబద్ధీకరణకు అనుమతించరు. దీంతో వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు, 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు వరకు జిల్లాలో మొత్తం 1,39,030 ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు అందాయి. వీటిలో బోడుప్పల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 17,915 దరఖాస్తులు, ఫీర్జాదిగూడలో 6,341, నిజాంపేట్‌లో 33,513, జవహర్‌నగర్‌లో 368 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా దమ్మాయిగూడ మునిసిపాలిటీలో 6,435 దరఖాస్తులు, నాగారంలో 13,917, పోచారంలో 9054, ఘట్‌కేసర్‌లో 17,810, మేడ్చల్‌లో 9,837, గుండ్లపోచంపల్లిలో 1,728, తూంకుంటలో 5,080, దుండిగల్‌లో 15,115, కొంపల్లిలో 1,917 దరఖాస్తులు అందాయి. వీటిన్నింటినీ పరిశీలించి, క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 


‘ఔటర్‌’ బఫర్‌జోన్‌లో క్రమబద్ధీకరణ కష్టమే..


ఔటర్‌ రింగురోడ్డుకు 50మీటర్ల దూరం వరకు బఫర్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయం తీసుకుంది. గతంలో ఏర్పాటుచేసిన లేఅవుట్ల ద్వారానే ఔటర్‌రింగు రోడ్డును ఏర్పాటు చేశారు. ఘట్‌కేసర్‌, కీసర, శామీర్‌పేట్‌, మేడ్చల్‌ మండలాల్లో సర్వీసు రోడ్డుకు ఆనుకొని చాలావరకు ప్లాట్లు ఉన్నాయి. సర్వీసు రోడ్డు నుంచి 50మీటర్ల వరకు బఫర్‌జోన్‌ ప్రకటించడంతో, ఒక్కో ప్లాటు యజమాని కనీసం 20 నుంచి 50 మీటర్లు నష్టపోతున్నారు. ప్లాట్ల సైజు కూడా తగ్గిపోవడంతోపాటు డైమెన్షన్‌ కూడా మారిపోతుంది. ఈ ప్లాట్ల యజమానులు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్లాట్ల క్రమబద్ధీకరణ కష్టతరంగా మారనుంది. 

Updated Date - 2020-11-21T04:58:48+05:30 IST