పేదల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులు

ABN , First Publish Date - 2020-09-25T05:45:18+05:30 IST

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) పేదలు, సామాన్య ప్రజలతో పాటు రియల్‌ వ్యాపారుల్లో గుబులు రేపుతోంది

పేదల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులు

ముంచుకొస్తున్న దరఖాస్తు గడువు 

కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగం

జిల్లాలో ఇప్పటి వరకు 425 దరఖాస్తులు


ఆసిఫాబాద్‌, సెప్టెంబరు24: లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) పేదలు, సామాన్య ప్రజలతో పాటు రియల్‌ వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. ప్రభుత్వం భూముల క్రయ, విక్రయాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన విధించడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని వెంచర్లు వేసే రియల్టర్లతో పాటు అప్పులు తెచ్చి పైసా పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొనుక్కొనే సామాన్యుల వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనతో ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీలు, పంచా యతీల పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లు ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసిన వారు వాటిని క్రమబద్ధీక రించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాగా ఎల్‌ఆర్‌ఎస్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారం కానున్నది. గతంలో ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాటికి ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మళ్లీ డబ్బులు చెల్లించడం ఏంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాగా ఏర్పడడంతో జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం క్రమేపీ పుంజుకు ంది. కానీ కరోనా కారణంగా మార్చి నెల నుంచి భూముల క్రయ విక్రయాలు పెద్దగా జరగడం లేదు. అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్న వారు తరువాత వాయిదా కట్టలేక తెచ్చిన అప్పులు తీర్చలేక ఇబ్బందుల పాలయ్యారు. ఈక్రమంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు అక్టోబరు15 వరకు గడువు ఇవ్వడంతో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి చివరి లోపు పూర్తి స్థాయిలో రుసుం చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. 


అక్టోబరు 15 వరకు దరఖాస్తు గడువు 

ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా అక్రమ లే అవుట్లు, రిజిస్ట్రేషన్‌ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అక్టోబరు 15లోగా వెయ్యి రూపాయల రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఇచ్చింది. కరోనా నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన ఎన్నో పేద, సామాన్య కుటుంబాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులు పట్టుకుంది. ఒక వైపు తాము జీవించడానికే సరిపడా డబ్బులు లేని సమయంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడో కొన్న ప్లాట్లకు ఇప్పుడు మళ్లీ డబ్బులు చెల్లించడం ఏమిటని పలువురు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా చాలా మందికి ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన లేదు.  ఏ ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం కింద వస్తాయి, ఏవి రావో తెలియక కొందరు అయోమయంలో ఉన్నారు. 


ఆందోళనలో రియల్టర్లు

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌ పట్టణం, కౌటాల, రెబ్బెన, గోలేటి, వాంకిడి, జైనూరు, సిర్పూర్‌(టి) మండలాల్లో లే అవుట్లు ఏర్పాట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. జిల్లాలో చాలా మంది ఆదాయ వనరులుగా రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఎంచుకున్నారు. కొంత మంది గ్రూపుగా ఏర్పడి వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించే వారు. కాగా మరి కొందరు ప్లాట్లను విక్రయించి కమీషన్లు పొందేవారు.  ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలు కల్పించడంతో రియల్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో జిల్లాలోని ఆయా మండలాల్లో రియల్టర్లు ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్లాట్ల క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. గతంలో చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తెరపైకి తేవడంతో రియల్టర్లలో గుబులు మొదలైంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. 


కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 185 దరఖాస్తులు 

జిల్లాలోని 15 మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌  కింద 240 దరఖాస్తులు వచ్చాయి. అందులో 239 దరఖాస్తులు వ్యక్తిగత ప్లాట్ల కోసం రాగా ఒక దరఖాస్తు లే అవుట్‌ కోసం వచ్చింది. జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ అయిన కాగజ్‌నగర్‌ పరిధిలో 185 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో సుమారు నాలుగు వేల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు తుది గడువు ఇంకా 20 రోజులు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2020-09-25T05:45:18+05:30 IST