కన్నీటి నుంచి కరోనా వ్యాపించదు

ABN , First Publish Date - 2020-03-27T08:46:02+05:30 IST

వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే చోట కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యయనంలో వెల్లడైంది.

కన్నీటి నుంచి కరోనా వ్యాపించదు

  • 3-17 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలున్న చోట వేగంగా వ్యాప్తి
  • 18 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువ ఉంటే మందగమనం
  • మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యయనం
  • కొవిడ్‌-19పై పోరుకు మరో 69 మందుల గుర్తింపు


వాషింగ్టన్‌, న్యూఢిల్లీ, మార్చి 26: వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే చోట కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌-19 సోకినవారి సంఖ్యను.. ఆయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ (ఆర్ద్రత) ఎంత మేరకు ఉన్నాయనే అంశంతో ఎంఐటీ పరిశోధకులు పోల్చిచూశారు. వారి అధ్యయనం ప్రకారం.. 3 నుంచి 17 డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే 90ు దాకా కొవిడ్‌-19 వ్యాప్తి జరిగినట్టు తేలింది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడమే కాదు.. ఆయా ప్రాంతాల్లో గాలిలో తేమ కూడా క్యూబిక్‌ మీటరుకు 4-9 గ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. అదే సమయంలో.. సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు మించి ఉండి, జనవరి, ఫిబ్రవరి నెలల్లో, మార్చి మొదటివారంలో ఆర్ద్రత ఘనపు మీటరుకు 9 గ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న చోట్ల కరోనా ఇన్ఫెక్షన్లు కేవలం 6 శాతం నమోదయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో.. రుతుపవనాలు ఉండే ఆసియాన్‌ దేశాల్లో గాలిలో తేమ ఘనపు మీటరుకు 10 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని వారు విశ్లేషించారు.


అమెరికాలో సైతం.. వేడిగా ఉండే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చల్లగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. ఉదాహరణకు.. టెక్సాస్‌, న్యూమెక్సికో, అరిజోనా రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న వాషింగ్టన్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల మధ్యలో ఉన్నప్పటికీ.. ఆరెగావ్‌ రాష్ట్రంలో 200 కన్నా తక్కువ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం విశేషం. ఆసియా, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు చైనా, అమెరికా, యూరప్‌ దేశాల్లోలాగా కఠినమైన క్వారంటైన్‌ ప్రమాణాలను పాటించకపోయినప్పటికీ.. అక్కడి వాతావరణ పరిస్థితుల వల్లే వైరస్‌ సగటు వృద్ధిరేటు తక్కువగా ఉందని ఎంఐటీ పరిశోధకులు విశ్లేషించారు.


భారత్‌, పాకిస్థాన్‌, ఇండోనేసియా, ఆఫ్రికన్‌ దేశాల్లో వైరస్‌ పరీక్షలు సరిగ్గా జరగనందునే ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందన్న కొందరి వాదనను వారు కొట్టిపారేశారు. వైరస్‌ వ్యాప్తి నెమ్మదించడంలో ప్రజల కదలికలు, క్వారంటైన్‌ కాకుండా ఇతర కారణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కాసిం బుఖారీ తెలిపారు. వైరస్‌ ఎలా ఉత్పరివర్తనం, అభివృద్ధి చెందుతుంది వంటి కీలకమైన విషయాలు తెలియాల్సి ఉందని.. కాబట్టి ఈ అంచనాల ఆధారంగా ఎక్కువ వేడి, తేమ ఉన్న దేశాల్లో కరోనా అసలే వ్యాపించదనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.


కరోనాకు క్లోరోక్విన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడొచ్చని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే, కరోనాపై క్లోరోక్విన్‌లాగా ప్రభావం చూపే మరో 69 ఔషధాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది. భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఒకరు ఆ బృందంలో ఉన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్‌ వంటివాటికి వాడే మందులను కరోనా చికిత్సలో కూడా వినియోగించవచ్చని వారు వివరించారు. పరిశోధనల్లో భాగంగా వారు కొవిడ్‌-19 వైరస్‌ 29 జన్యువుల్లో 26 జీన్స్‌ను పరీక్షించారు. వైరల్‌ ప్రొటీన్ల ఉత్పత్తిలో కీలకమైన జన్యువులవి. ఆ జన్యువులు మనిషి కణాల్లో మొత్తం 332 ప్రొటీన్లతో ఇంటరాక్ట్‌ అవుతున్నాయని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 4,71,000 మందికి సోకడానికి.. 21 వేల మందికిపైగా ప్రజల ప్రాణాలు తీయడానికి.. కరోనా వైర్‌సకు ఆ 332 మానవ ప్రొటీన్లే సహకరించాయి. దీంతో, ఆ ప్రొటీన్లను టార్గెట్‌ చేసే మందులపై దృష్టిసారించిన పరిశోధకులు.. 69 ఔషధాలను గుర్తించారు. వాటిలో 25 ఔషధాలకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులున్నాయి. మరోవైపు.. కరోనా వైరస్‌ బాధితులకు ఇన్నాళ్లుగా ఇస్తున్న ప్రామాణిక చికిత్సకన్నా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మెరుగైనదేమీ కాదని చైనాలో చేసిన ఒక చిన్న అధ్యయన ఫలితం తెలుపుతోంది. దాని ప్రకారం.. 30 మంది కొవిడ్‌-19 బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వగా ఏడు రోజుల తర్వాత 13 మందికి వైరస్‌ నెగెటివ్‌ రాగా.. 14 మందికి పాజిటివే ఉంది. అయితే, అజిత్రోమైసిన్‌తో కలిపి వాడితే మాత్రం సమర్థంగా పనిచేస్తున్నట్టు ఫ్రాన్స్‌ పరిశోధనల్లో తేలింది.


కన్నీటి నుంచి కరోనా వ్యాపించదు

‘కరోనా గాలిలో వ్యాపించే వైరస్‌ కాదు.. డ్రాప్‌లెట్‌ వైరస్‌. అంటే తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది’.. అని వైద్యులు చెబుతున్నారు. మరి డ్రాప్‌లెట్‌ వైరస్‌ అంటే కన్నీటి ద్వారా వ్యాపిస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. సింగపూర్‌కు చెందిన శాస్త్రజ్ఞులు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరోనా సోకినవారి కన్నీరు మన మీద పడినా.. దాన్నుంచి వైరస్‌ వ్యాపించదని, ఆ నీటిలో వైరస్‌ ఉండదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా వారు కొవిడ్‌-19 బారిన పడిన 17 మంది కన్నీటి చుక్కలను వారికి నయమయ్యే దాకా రోజూ సేకరించి పరీక్షించారు. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్‌.. వారి అశ్రువుల్లో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది.

Updated Date - 2020-03-27T08:46:02+05:30 IST