అరేబియాలో అల్పపీడనం

ABN , First Publish Date - 2021-05-14T08:35:40+05:30 IST

ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసరాల్లో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆగ్నేయ అరేబియా, దానికి ఆనుకుని లక్షద్వీప్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. అదే ప్రాంతంలో శుక్రవారం ఉ

అరేబియాలో అల్పపీడనం

16న తుఫాన్‌గా మారే అవకాశం 

24 గంటల్లో రాష్ట్రానికి వర్షసూచన 

అమరావతి/విశాఖపట్నం/గుంటూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసరాల్లో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆగ్నేయ అరేబియా, దానికి ఆనుకుని లక్షద్వీప్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. అదే ప్రాంతంలో శుక్రవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, శనివారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16న మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని ఆ తరువాత ఉత్తర వాయువ్యంగా పయనించి 18వ తేదీ నాటికి గుజరాత్‌ తీరం చేరుకోనుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో కేరళ నుంచి మహారాష్ట్ర వరకు పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికి తోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వైపునకు తేమ గాలులు వీయనున్నాయి. దీంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 15, 16 తేదీల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 


వాహనాలపై కూలిన చెట్లు.. పిడుగుపడి రైతు మృతి

గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కర్నూలు-గుంటూరు రహదారిలో వెళుతున్న కారుపై చెట్టు కూలిపడింది. కారు దెబ్బతింది. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో రైతు కందుల శ్రీనివాసరావు(53) పిడుగుపాటుకు మృతిచెందారు. 

Updated Date - 2021-05-14T08:35:40+05:30 IST