తక్కువ వడ్డీకే రుణాలు

ABN , First Publish Date - 2022-05-23T06:28:19+05:30 IST

పాడి రైతులను ప్రోత్సహించి పాల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. దీని కోసం రైతులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని సంకల్పించింది.

తక్కువ వడ్డీకే రుణాలు

- కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా పాడి రైతులకు ప్రోత్సాహం

- ఒక్కో రైతుకు రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు

- పశుగ్రాసంపై కూడా రాయితీ కల్పించనున్న కేంద్ర ప్రభుత్వం


కామారెడ్డి, మే 22: పాడి రైతులను ప్రోత్సహించి పాల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. దీని కోసం రైతులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని సంకల్పించింది. అయితే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులకు గతంలో వ్యవసాయ రుణాలు మాత్రమే ఇచ్చేవారు. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడిపశువుల రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. పశువులతో పాటు రైతులకు ఉన్న పొలం ఆధారంగా ఒక్కో రైతుకు రూ.1.60లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు అందించనున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రైతులకు కేవలం 3 శాతం వడ్డీకి రుణాలు మంజూరు చేయనున్నారు. పాడి రైతుల రుణాలకు సంబంధించి అధికారులు ప్రత్యేక దరఖాస్తుల నమూనాలను రూపొందించారు. పొలం, సర్వే నెంబర్‌, ఎకరాల విస్తీర్ణం, అధార్‌కార్డు నెంబర్‌ తదితర వివరాలను దరఖాస్తులో పొందుపరిచి, సంబంధిత పశు వైద్యాధికారితో ఆమోదం పొందాలి. ఆయా అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి సమీప బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంది. అయితే పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డు ద్వారా మాత్రమే రుణాలు అందజేయనున్నారు. రైతులకు ప్రధానంగా పాడిపశువులు, భూమి విస్తీర్ణం బట్టి రుణాలు మంజూరు చేస్తారు. ఒక్కో పాడి గేదెపై రూ.20వేల వరకు రుణం పొందే వీలుంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా

పశువుల దాణాకు, గడ్డి పెంపకానికి, విత్తనాల కొనుగోలుకు, గడ్డి కత్తిరించే యంత్రాల కొనుగోలుకు, పాలు నిలువ చేసే యంత్రాల కొనుగోలు, పాల రవాణా చేసే క్యాన్‌లు, పశువుల పాకను క్లీనింగ్‌ చేసుకునే యంత్రాలకు రుణాలు మంజూరు చేస్తోంది. రూ.1.6 లక్షల వరకు ఏ విధమైన తనఖా పెట్టకుండా రుణం మంజూరు చేస్తారు. రూ.1.6 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తనఖా పెట్టుకొని రుణం మంజూరు చేస్తారు. ఈ రుణం పొందాలనుకుంటే రైతు ఇంతకు ముందు వ్యవసాయ రుణం తీసుకుని ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే ఈ రుణం తీసుకునే వీలుంటుంది.

గ్రాసం కొరత రాకుండా

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎండాకాలంలో పశువులకు గడ్డి కొరత రాకుండా పశుగ్రాసాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పాడిపశువుల పెంపకందారులకు అవగాహన కల్పించనున్నారు. ప్రత్యేకంగా రాయితీపై అందించి పశుగ్రాసం పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం పశుసంవర్థకశాఖను ఆదేశించింది. అందుకు తగిన విదివిధానాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి నుంచి ప్రత్యేకంగా తక్కువ వడ్డీకి రుణాల పథకాన్ని అమలు చేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు దాణాను కూడా కొనుక్కునే అవకాశం ఉంది. పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై అందజేయనున్నారు.

Updated Date - 2022-05-23T06:28:19+05:30 IST