Aug 4 2021 @ 01:24AM

ఐ లవ్యూ చెప్పుకోని ప్రేమికులు

‘హుషారు’ ఫేమ్‌ దినేశ్‌ తేజ, శ్వేతా అవస్థి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌లో చిత్రదర్శకుడు పవన్‌కుమార్‌ .కె మాట్లాడుతూ ‘‘ఇరవైయేళ్ల యువతీయువకుల్లో కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. జీవితంలో ఏం చేయాలో స్పష్టత ఉండదు. అటువంటి అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు ఎలా కలిశారు? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఏ విధంగా సక్సెస్‌ అయ్యారు? అనేది చిత్రకథ. వీళ్లు ఐలవ్యూ చెప్పుకోని ప్రేమికులు. కానీ, మనసులు అర్థం చేసుకుని ముందుకెళతారు’’ అన్నారు. ‘‘ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. పీవీఆర్‌ పిక్చర్స్‌ ద్వారా ఈ నెల 6న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత వెంకటేశ్‌ కొత్తూరి తెలిపారు. ‘‘మా నాన్న సదాశివుడుగారు చాలా పాటలు రాశారు. ఆయన స్ఫూర్తితో నేను పాటల రచయిత్రిగా మారాను’’ అని కృష్ణవేణి చెప్పారు. హీరో హీరోయిన్లతో పాటు సంగీత దర్శకుడు కార్తీక్‌ కడగండ్ల, హరిప్రసాద్‌ జక్కా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.