పెళ్లికి ముందే గర్భం.. వీడియో చూస్తూ ప్రియుడి ప్రసవం.. చివరికి..

ABN , First Publish Date - 2020-03-20T14:38:11+05:30 IST

యూ ట్యూబ్‌లో వీడియో చూసి యువతికి ప్రసవం ..

పెళ్లికి ముందే గర్భం.. వీడియో చూస్తూ ప్రియుడి ప్రసవం.. చివరికి..

చెన్నై/గుమ్మిడిపూండి : యూ ట్యూబ్‌లో వీడియో చూసి యువతికి ప్రసవం చేసి పసికందు మృతికి కారకుడైన ప్రియుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు... గుమ్మిడిపూండికి చెందిన సౌందర్‌ (26) గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసే పనులు చేపడుతున్నాడు. గుమ్మిడి పూండి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని, సౌందర్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వివాహం కాకముండే కలవడంతో ఆ యువతి 8 నెలల గర్భంతో ఉంది. ఈ విషయమై తల్లిదండ్రులు తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది. ఈ నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఈ విషయాన్ని సౌందర్‌కు తెలిపింది. అవి ప్రసవ నొప్పులని, ఎవరికీ చెప్పవద్దని, తాను ప్రసవం చేస్తానని, ఎవరికి తెలియకుండా గ్రామ శివారులోకి రావాలని సౌందర్‌ ఆమెను పిలిచాడు. 


అనంతరం ఇద్దరు కలసి శివారు ప్రాంతంలోని అడవి ప్రాంతానికి వెళ్లారు. సౌందర్‌ యూ ట్యూబ్‌ లో వీడియో చూస్తూ నర్మదకు ప్రసవం చేసేందుకు యత్నించాడు. గర్భంలోని శిశువును బయటకు తీసేందుకు లాగడంతో చేయి తెగి వచ్చింది. ఆ చేతిని విసిరి పడేసిన సౌందర్‌ బలవంతంగా శిశువును బయటకు తీసేందుకు యత్నించిన సమయంలో యువతి పేగులు బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావం అయి నొప్పితో పెద్దగా కేకలు పెడుతూ విలవిలలాడింది.


తన ప్రయత్నం ఫలించకపోవడంతో సౌందర్‌ తన మోటార్‌బైక్‌పై నర్మదను ఎక్కించుకొని పొన్నేరి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. నర్మదను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్‌ చేసి మృతిచెందిన శిశువును బయటకు తీసిన వైద్యులు, నర్మద చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై గుమ్మిడిపూండి పోలీసులు కేసు నమోదుచేసి సౌందర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గుమ్మిడిపూండి పట్టణంలో కలకలం రేపింది.

Updated Date - 2020-03-20T14:38:11+05:30 IST