ప్రేమికుల దినోత్సవం ఎఫెక్ట్... కోయంబేడుకు భారీగా గులాబీలు

ABN , First Publish Date - 2022-02-13T16:11:48+05:30 IST

ప్రేమికుల దినోత్సవ ప్రభావం కోయంబేడులో కనిపిస్తోంది. ప్రేమికులను మురిపించేందుకు వివిధ ప్రాంతాల నుంచి రోజాలు మార్కెట్‌కు దిగుమతి అయ్యాయి. స్థానిక కోయంబేడు మార్కెట్లో గత నాలుగు రోజులుగా వివిధ

ప్రేమికుల దినోత్సవం ఎఫెక్ట్... కోయంబేడుకు భారీగా గులాబీలు

                             - జోరుగా విక్రయాలు 


చెన్నై: ప్రేమికుల దినోత్సవ ప్రభావం కోయంబేడులో కనిపిస్తోంది. ప్రేమికులను మురిపించేందుకు వివిధ ప్రాంతాల నుంచి రోజాలు మార్కెట్‌కు దిగుమతి అయ్యాయి. స్థానిక కోయంబేడు మార్కెట్లో గత నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి అందమైన రోజా పుష్పాలు టన్నుల కొద్దీ లారీల్లో దిగుమతి అవుతున్నాయి. రెండు రోజులుగా ఆ మార్కెట్‌లో రోజా పువ్వుల అమ్మకాలు ఊపందుకున్నాయి. నగరంలో ఏటా ప్రేమికుల దినం సందర్భంగా బీచ్‌లు, ఉద్యానవనాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రేమికుల సందడి అధికంగా ఉంటుంది. రెండేళ్లుగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రేమికులు ఆ దినాన బీచ్‌లు, ఉద్యానవనాలకు సందర్శించలేక నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం 90 శాతం వరకూ కరోనా లాక్‌ డౌన్‌ నిబంధనలను సడలించడంతో ప్రేమికుల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. తమ హృదయం మీటిని నెచ్చెలి, లేదా చెలికాడుకి రోజాలతో శుభాకాంక్షలు చెప్పేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు గులాబీలకు డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌ను బట్టి కోయంబేడు మార్కెట్‌కు హోసూరు, బెంగళూరు నుంచి రోజాలు భారీగా దిగుమతి అయ్యాయి. 


గులాబీల బొకే రూ.350

కోయంబేడు మార్కెట్‌లో గులాబీ పూల బొకేల ధరలు కూడా రెండు రోజులుగా పెరిగాయి. 20 గులాబీపువ్వులు కలిగిన బొకేను రూ.200 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. 10 గులాబీ పువ్వులతో కూడిన బొకేను రూ.120కి అమ్ముతున్నారు. ఓ వైపు ప్రేమికుల దినం సమీపిస్తుండటం, మరో వైపు పెళ్ళిళ్లు అధికం కావటంతో రెండు రోజులుగా గులాబీ పూల అమ్మకాలు ఊపందుకున్నాయని కోయంబేడు పూల వ్యాపారుల సంఘం సభ్యుడు కృష్ణమూర్తి తెలిపారు. ప్రతి దుకాణంలోనూ రోజూ రెండు వేల నుంచి మూడు వేల గులాబీ పువ్వుల కట్టలు అమ్ముడవుతున్నాయని తెలిపారు. 

Updated Date - 2022-02-13T16:11:48+05:30 IST