రూ. 3 వేల కోసం.. ప్రియుడు చేసిన నేరమిది!

ABN , First Publish Date - 2020-07-13T17:35:12+05:30 IST

మూడు వేల కోసం ప్రియురాలిని..

రూ. 3 వేల కోసం.. ప్రియుడు చేసిన నేరమిది!

ప్రియుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 


ఏలూరు(పశ్చిమ గోదావరి): మూడు వేల కోసం ప్రియురాలిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆదివారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ తెలిపిన వివరాలివి.. దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జూపూడి అనూష (30) భర్త ఏసేబు కొంత కాలం కిందట మరణించాడు. ఆమె తన ముగ్గురు పిల్లలతోనే జీవిస్తోంది. 


కొద్దిరోజుల కిందట దెందులూరు మండలం నాగులదేవిపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ గుజ్జుల సందీప్‌ (24) ఆటో ఎక్కడంతో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ ఆమె అవసరాలకు డబ్బులిస్తుండేవాడు. లాక్‌డౌన్‌ కావడంతో ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న ఆటో డ్రైవర్‌ ఆమె తనకు ఇవ్వాల్సిన రూ.మూడు వేలు అడిగాడు. ఈనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనూష డబ్బులు తీసుకెళ్లడానికి రమ్మని ఫోన్‌ చేసింది. ఆటోలో ఇద్దరు మొండూరు వద్ద ఉన్న పోలవరం కుడికాల్వ గ్రావెల్‌ రోడ్డులోకి వెళ్లారు.


అక్కడ డబ్బులు విషయమై మాటా మాటా పెరగడంతో చున్నీతోనే ఆమె మెడకు చుట్టి హతమార్చాడు. ఆమె మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి తీసుకెళ్లి పోయాడు. ఈనెల ఏడో తేదీన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి  పెదవేగి  పోలీసులు దర్యాప్తు చేశారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ పర్యవేక్షణలో రూరల్‌ సీఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్‌ఐలు జి.నాగవెంకటరాజు, చావా సురేశ్‌ (ఏలూరు రూరల్‌), హెడ్‌ కానిస్టేబుళ్లు కిశోర్‌, నాగూర్‌, సురేశ్‌, సురేంద్ర, జయకుమార్‌ కలిసి దర్యాప్తు బృందంగా ఏర్పడ్డారు. అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించి నిందితుడైన  సందీప్‌ను అరెస్ట్‌ చేశారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ హర్షిత చంద్ర, ఏలూరు రూరల్‌ సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు నాగరాజు, చావా సురేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-13T17:35:12+05:30 IST