Abn logo
Sep 23 2021 @ 03:34AM

ప్రేయసి లేని జీవితం నాకొద్దు

  • అనారోగ్యంతో ప్రియురాలి మృతి
  • మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య
  • పెళ్లి ఏర్పాట్లలో ఉండగా విషాదం


ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 22: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. రాష్ట్రాలు వేరైనా కడదాకా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లనీ ఒప్పించారు. త్వరలోనే పెళ్లితో ఒక్కటై కలల ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఆశపడ్డారు. కానీ.. అనారోగ్యంతో ప్రియురాలి అకాల మరణం ఆ యువకుడ్ని కుంగదీసింది. ప్రేయసి లేని జీవితం తనకూ వద్దంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మైలవరం మండలం కరమలవారిపల్లెకు చెందిన రాచంరెడ్డి లక్ష్మినారాయణరెడ్డి, పార్వతీ దంపతులకు కుమారుడు మురళీధర్‌రెడ్డి (27), ఇద్దరు కుమార్తెలు. లక్ష్మినారాయణరెడ్డి చాలాకాలం క్రితమే మృతిచెందాడు. మురళీధర్‌రెడ్డి సీఏ పూర్తి చేశాడు. సీఏ చదివే సమయంలోనే తెలంగాణలోని ఖమ్మంకు చెందిన స్నేహితుడి చెల్లిని ప్రేమించాడు. ఆ విషయం ఇరువురి ఇళ్లలో చెప్పి పెళ్లికి కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి ప్రేయసి కుటుంబ సభ్యులు వస్తున్నారని మురళీ వారం రోజులుగా ఇంట్లో చెబుతున్నాడు.


వారు నేరుగా ప్రొద్దుటూరుకు వస్తారని, అక్కడే లాడ్జీలో వారికి బస ఏర్పాటు చేసి.. ఫ్రెషప్‌ అయ్యాక ఇంటికి తీసుకొస్తానని చెప్పి బుధవారం ఉదయం బయటకు వచ్చాడు. ప్రొద్దుటూరు వెళ్లాక.. ఇంట్లో ఆయన రాసిన లేఖ బయటపడింది. ‘నా ప్రియురాలు ఈ నెల 20వ తేదీన అనారోగ్యంతో చనిపోయింది. ఆమెలేని జీవితం నాకూ వద్దు. నేను కూడా చనిపోవాలని అనుకుంటున్నాను’ అని ఆ లేఖలో ఉంది. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు మురళీ బసచేసిన హోటల్‌కు వచ్చి చూడగా.. అప్పటికే ఓ గదిలో చీరతో ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుని బావ మారుతీ కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

క్రైమ్ మరిన్ని...