అర్ధరాత్రి ప్రేయసి ఇంట్లో ప్రియుడు.. పెళ్లి చేశాక పరారైన భర్తను వెతుక్కుంటూ వెళ్లిన ఆమెకు షాకింగ్ అనుభవం

ABN , First Publish Date - 2021-07-19T23:26:27+05:30 IST

వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వేరు వేరు ఊళ్లలో ఉండే వీరిద్దరూ కలుసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. దీంతో ప్రేయసిని చూడటం కోసం ఆ ప్రియుడు రాత్రి పూట ఊరుదాటి మరీ వచ్చేవాడు.

అర్ధరాత్రి ప్రేయసి ఇంట్లో ప్రియుడు.. పెళ్లి చేశాక పరారైన భర్తను వెతుక్కుంటూ వెళ్లిన ఆమెకు షాకింగ్ అనుభవం

ఇంటర్నెట్ డెస్క్: వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వేరు వేరు ఊళ్లలో ఉండే వీరిద్దరూ కలుసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. దీంతో ప్రేయసిని చూడటం కోసం ఆ ప్రియుడు రాత్రి పూట ఊరుదాటి మరీ వచ్చేవాడు. ఆమె ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నెమ్మదిగా ప్రేయసిని పిలిచేవాడు. బయటకు వచ్చిన ఆమెతో అర్థరాత్రి దాటే వరకూ ముచ్చట్లు చెప్పేవాడు. ఆ తర్వాత ఊరు నిద్రలేస్తుందనగా ఆదరాబాదరా తన గ్రామానికి వెళ్లిపోయేవాడు. ఈ తంతు చాలాకాలంగా జరుగుతూ ఉంది.


బిహార్ రాజధాని పట్నాకు సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన ఈ ప్రేమికులు.. రోజుట్లాగే శనివారం కూడా కలుసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ రోజు ప్రేయసి ఇంటికొచ్చిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. రహస్యంగా కలుసుకున్న వీళ్లిద్దరూ గ్రామస్థుల చేతికి చిక్కారు. ఈ వ్యవహారం మొత్తం విన్న గ్రామపెద్దలు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఊళ్లోనే తెల్లారుజామున పెళ్లి చేసి, నూతన వధూవరులను అత్తారింటికి సాగనంపారు. ఇలా వెళ్తుండగా తన ప్రేయసికి ఆ పెళ్లికొడుకు షాకిచ్చాడు. మాయమాటలు చెప్పి ఆమెను నడిబజార్లో వదిలేసి పరారయ్యాడు. ఎంతసేపటికీ తిరిగిరాని భర్త కోసం వెదుకుతూ అత్తారింటికి వెళ్లిన వధువును.. అత్తమామలు అంగీకరించలేదు. ఆమెను చితకబాది ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ ఇంటి ముందు ఆ పెళ్లికూతురు నానాహంగామా చేసింది. ఊరు మొత్తం ఈ విషయం పాకిపోయింది. ఈ విషయంపై తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని, అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-19T23:26:27+05:30 IST