Abn logo
Mar 3 2021 @ 00:30AM

లవ్‌ యూ బంగారం

‘హాయ్‌... నేనా? బిజీ ఏం కాదు. మన బ్యాచ్‌మేట్స్‌ అందరం ఎప్పుడైనా కలుద్దాం లే’... అని ఫోన్‌లో మాట్లాడుతూ రెస్టారెంట్‌లోకి వెళతాడు వినయ్‌. అక్కడ అప్పటికే తన ప్రేయసి షాన్వి వెయిటింగ్‌! ఫోన్‌ మాట్లాడుతూ షాన్వీని పట్టించుకోడు వినయ్‌. ఆమె ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. కాల్‌ కట్‌ అయిన తరువాత గానీ ఈ ప్రపంచంలోకి రాడు. ‘ఎదురుగా నేనుండగా అంతలా అవతల అమ్మాయితో ఫోన్‌లో ఏంటా చనువు’ అనుకుటుంది షాన్వీ. అదే విషయం వినయ్‌ను అడుగుతుంది. ‘నువ్వు అనుకునేంత ఏమీ లేదు మా ఇద్దరి మధ్య. తను మా బ్యాచ్‌మేట్‌... అంతే! చాలా రోజుల తరువాత ఇలా పలుకరించింది’ అంటూ చెప్పబోతాడు వినయ్‌. ‘అబ్బా... ఏమీ లేకుండానే అంత సరదాగా మాట్లాడుతున్నావా’? నిలదీస్తుంది షాన్వీ. ఏదో తంటాలు పడి సర్దిచెబుతాడు అతడు. ‘సర్లే... నిన్న రాత్రి 11.30కి ఏమి చేస్తున్నావ్‌’ అడుగుతుంది షాన్వీ. ‘11.30కా? ఆ... డిన్నర్‌ చేసి, అలా ఫోన్‌ చూస్తూ పడుకున్నా అంతే’... బదులిస్తాడు వినయ్‌’. ‘మళ్లీ చెప్పు’... గద్దిస్తుంది. 


‘ఏమైందిప్పుడు’? అమాయకంగా అడుగుతాడు వినయ్‌. ‘ప్రియ పెట్టిన పిక్‌కి లైక్‌ కొట్టి, కామెంట్‌ కూడా చేశావ్‌. అదీ... పెట్టిన పది నిమిషాలకే’... అసలు విషయం చెబుతుంది షాన్వీ. ‘అబ్బా... అదా! బాగుందని ఏదో అలా కాంప్లిమెంట్‌ ఇచ్చానంతే’ అంటూనే నాలుకు కొరుక్కుంటాడు వినయ్‌. షాన్వీ ముఖంలో రంగులు మారిపోతాయి. ‘ఇవన్నీ నాకు తెలియదు. నువ్వు నన్ను తప్ప మరే అమ్మాయినీ ఇష్టపడకూడదు. నేనే మాట్లాడాలి. నేనే తిట్టాలి’ అంటూ కండిషన్లు పెడుతుంది తను. ఆ మాటలు విని వినయ్‌ నవ్వుతాడు. ‘నేను ఇంత సీరియ్‌సగా చెబుతుంటే నవ్వుతావేంటిరా? మన మధ్య ఏ అమ్మాయి వచ్చినా ఊరుకోను’... వార్నింగ్‌ ఇస్తుంది షాన్వీ. ‘నీలాంటి గర్ల్‌ ఫ్రెండ్స్‌నే పొసెసివ్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ అంటారు’ అనగానే... ఆమె ముఖం వెలిగిపోతుంది. ‘లవ్‌ యూ’ అంటుంది. మళ్లీ నవ్వుతాడు వినయ్‌. ‘నువ్వు కూడా లవ్‌ యూ టూ అని చెప్పు’ అని అడిగిమరీ చెప్పించుకుంటుంది తను. ‘లవ్‌ యూ టూ బంగారమ్‌’ అంటాడు అతడు. 


కట్‌ చేస్తే మరో రోజు... మరో కాఫీ షాప్‌లో. ‘ఏమిటీ లేటు’ అడుగుతుంది షాన్వీ. ‘పది నిమిషాలేగా’ అంటాడతడు. ‘పది నిమిషాల యాభై నాలుగు సెకన్లు’ అంటుంది తను. ఆ షాక్‌కు తనలో తనే షేక్‌ అవుతాడు వినయ్‌. ‘నాకు పంక్చువాలిటీ చాలా ముఖ్యం’ అంటూ అతడి చెయ్యి వాసన చూస్తుంది షాన్వీ. దొరికిపోయాననుకుంటాడు. ‘నాకు సిగరెట్‌ తాగేవాళ్లంటే ఇష్టం లేదని మొదట్లోనే చెప్పాను. నువ్వు కూడా నా కోసం మానేస్తానన్నావు. మళ్లీ స్మోక్‌ చేస్తున్నావా? నాతో మాట్లాడకు’ అని కోపగించుకుంటుంది. మాట్లాడితే ఎక్కడ కోపం పెరుగుతుందోనని తల దించుకుని మొబైల్‌ చూసుకొంటుంటాడు అతడు. ‘మాట్లాడవద్దంటే మాట్లాడడం మానేస్తావా? ఎదురుగుండా కూర్చొని అసలు అంత పీస్‌ఫుల్‌గా ఫోన్‌ చూసుకొంటావా?’. ఏం చెప్పాలో తెలియదు మనోడికి. వెంటనే మెరుపులాంటి ఐడియా వచ్చి, జేబులో ఉన్న చాక్లెట్‌ తీసి ప్రియురాలి చేతిలో పెడతాడు వినయ్‌. దాంతో ఆమె కూల్‌ అవుతుంది. ఇలా ఎన్నో జ్ఞాపకాలు వినయ్‌, షాన్వీల ప్రేమాయణంలో. 


ఒకరోజు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయడంలేదని నేరుగా వినయ్‌ రూమ్‌కు వస్తుంది షాన్వీ. చూస్తే అతడు జ్వరంతో పడుకుని ఉంటాడు. అది చూసి ఆమె కంగారు పడుతుంది. అమ్మలా దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. అప్పుడు అర్థం అవుతుంది వినయ్‌కు ఆమె మనసు. అందుకే షాన్వీ తనకు ప్రేయసి మాత్రమే కాదు... అంతకు మించి అనుకుంటాడు వినయ్‌. ఇది ఒక అందమైన, అరమరికలు లేని ప్రేమ కథ. ‘జెన్యూన్‌ పిక్చర్స్‌’ యూట్యూబ్‌లో విడుదల చేసిన ‘లవ్‌ యూ బంగారం’ లఘుచిత్రంలోనివీ సన్నివేశాలు. చూస్తున్నంతసేపూ ఆహ్లాదంగా, ప్రతి ఫ్రేమ్‌ అందంగా ఉంటుంది. పవన్‌ జి కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, నాగరాజ్‌ ఠాకూర్‌ దర్శకత్వం, పవన్‌ వర్మ, కుసుమ నటన ఆకట్టుకుంటాయి. గత నెలాఖరులో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికే దాదాపు లక్ష మంది వీక్షించారు.

Advertisement
Advertisement
Advertisement