లవ్ విత్ లద్దాఖ్..

ABN , First Publish Date - 2020-07-05T17:38:38+05:30 IST

గల్వాన్‌లో ఢీ అంటే ఢీ! ప్యాంగ్యాంగ్‌ లేక్‌ వైపు మోహరింపులు! వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు! అటు చైనా సైన్యం... ఇటు మన జవాన్లు! కొన్ని రోజులుగా ఇవే వార్తలు!...

లవ్ విత్ లద్దాఖ్..

గల్వాన్‌లో ఢీ అంటే ఢీ! ప్యాంగ్యాంగ్‌ లేక్‌ వైపు మోహరింపులు! వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు! అటు చైనా సైన్యం... ఇటు మన జవాన్లు! కొన్ని రోజులుగా ఇవే వార్తలు! మన లద్దాఖ్‌లో చైనా ఆగడాలు! అసలు ఏమిటీ లద్దాఖ్‌! ఎక్కడుంది? అక్కడేముంది? లద్దాఖ్‌తో ఒక పరిచయం...


మనాలీ నుంచి లేహ్‌ వరకు బైక్‌పై వెళుతూ దుమ్ము లేపాలి!!

- ఒక బైక్‌ రైడర్‌ జీవితాశయం.

ప్యాంగ్యాంగ్‌ లేక్‌ ఒడ్డున టెంట్‌ వేసుకుని... రాత్రివేళ నక్షత్రాలు లెక్కపెట్టాలి!

- ఒక ప్రకృతి ప్రేమికుడి ఆకాంక్ష!

ఘనీభవించిన ఝన్‌స్కార్‌ నదిపై అడుగులు వేయాలి!

- ఒక సాహసికుడి చిరకాల స్వప్నం!

వీటిలో ఏది నెరవేరాలన్నా లద్దాఖ్‌కు వెళ్లాల్సిందే! మొన్నటి వరకు ఇది జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో ఒక ప్రాంతం. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం! లద్దాఖ్‌లోని ఏకైక ముఖ్యమైన నగరం... లేహ్‌! ఇటు హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీకి, అటు కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు మధ్యలో ఉంటుందీ పట్టణం! మనాలీ-లేహ్‌ మధ్య దూరం 470 కిలోమీటర్లు. రోహ్‌తాంగ్‌ పాస్‌, బార్లాచా, లాచులుంగ్‌, తాంగ్లాంగ్‌ పాస్‌... ఈ నాలుగు కనుమలు దాటుతూ ప్రయాణం సాగుతుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో ఇదీ ఒకటి! ఈ మార్గంలో ఏడాదిలో సుమారు ఆరేడు నెలలు రాకపోకలు ఉండవు. రహదారికి అడ్డంగా పలుచోట్ల భారీ మంచు గోడలు ఏర్పడతాయి. మే మొదటివారంలో ఈ గోడలు కరిగి నీరవుతాయి. వాతావరణ పరిస్థితిని బట్టి అక్టోబరు దాకా ఈ దారిలో రాకపోకలు సాగుతాయి. శ్రీనగర్‌-లేహ్‌ రహదారి మార్గంలోనూ దాదాపు ఏడెనిమిది నెలలు రాకపోకలు నిలిచిపోతాయి. అప్పుడు లేహ్‌ చేరుకోవడానికి విమానాలను ఆశ్రయించాల్సిందే. అయితే... ప్రతికూల వాతావరణంతో విమాన సర్వీసులు రద్దుకావడం ఇక్కడ సర్వసాధారణం. లేహ్‌ వెళ్లాలనుకునే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇది అతి శీతల, బాగా ఎత్తైన ప్రాంతం! గాలిలో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది. ‘హై ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌’ బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి! 


రంగుల కొండలు... ఇసుక తిన్నెలు

రణగొణ ధ్వనుల ప్రపంచానికి దూరంగా, ప్రశాంతంగా ఉండే లద్దాఖ్‌ ఒక చిత్రమైన భౌగోళిక ప్రాంతం! మనాలీ వైపు నుంచి జరిగే ప్రయాణం గిలిగింతలు పెడుతూ మొదలవుతుంది. ఈ దారిలో వచ్చే ‘గులాబా’ ప్రాంతం ఆకుపచ్చ స్వర్గాన్ని తలపిస్తుంది. ఇక... రోహతాంగ్‌ పాస్‌ను దాటి కీలాంగ్‌, జిస్పా, దార్చా, సర్చూ... ఇలా ముందుకు వెళ్లేకొద్దీ దృశ్యం మారుతుంది. గడ్డి మొక్కలు, చిన్న తుప్పలు తప్ప చెట్టు అనేదేదీ కనిపించదు. అందుకే... లద్దాఖ్‌ ప్రాంతాన్ని హిమాలయ ఎడారి అంటారు. లద్దాఖ్‌లో భాగమైన నుబ్రా వ్యాలీలో... థార్‌ ఎడారిని తలపించేలా ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. రెండు మూపురాల ఒంటెలు ఇక్కడి ప్రత్యేకత! లద్ధాఖ్‌లో ఉన్నది చెట్లు లేని బోడి కొండలే! కానీ... అవి పసుపు, ఎరుపు, నారింజ, లేత నీలం, నలుపు, లేత ఆకుపచ్చ, తెలుపు... ఇలా రకరకాల రంగుల్లో అచ్చెరువొందిస్తాయి. 


లేహ్‌లో సరదాలు...

చుట్టూ కొండల మధ్య ఉన్న ‘వ్యాలీ’లో వెలిసిన నగరమే లేహ్‌! లద్దాఖ్‌లో అనేక బౌద్ధారామాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది... లేహ్‌ సమీపంలోనే ఉన్న థిక్సే మోనాస్ట్రీ. కొండను చుట్టినట్లుగా ఉండే ఈ భారీ బౌద్ధారామం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక... లేహ్‌కు వెళ్లిన ప్రతిఒక్కరూ చూసి తీరేది ప్యాంగ్యాంగ్‌ త్సో లేక్‌. ‘3 ఇడియట్స్‌’ సినిమా క్లైమాక్స్‌ను ఇక్కడే చిత్రీకరించారు. ఇది లేహ్‌ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. నింగిలో సూర్యుడి ప్రకాశాన్ని బట్టి ఈ సరస్సులో నీరు రంగులు మారుతూ అబ్బురపరుస్తుంది. లేహ్‌ నుంచి ప్యాంగ్యాంగ్‌ వెళ్లే దారిలోనే... ఖర్దూంగ్లా పాస్‌ వస్తుంది. దీని ఎత్తు సముద్ర మట్టం నుంచి 5327 మీటర్లు. ప్రపంచంలోనే మోటారు వాహనంపై ప్రయాణించగలిగే అత్యంత ఎత్తైన రహదారి ఇదే! ఖర్దూంగ్లా నుంచి అలాగే 86 కిలోమీటర్లు వెళితే... నుబ్రా వ్యాలీ. ఇక్కడి నుంచి మరో 80 కిలోమీటర్లలో ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాంతంలో ఉన్న ‘బ్యాటిల్‌ ఫీల్డ్‌’ సియాచిన్‌ ఉంటుంది. ఇక లద్దాఖ్‌ పేరు వినగానే సాహసికులకు గుర్తుకొచ్చేది ఒకటి... బైక్‌ రైడింగ్‌, రెండు... ఛాదర్‌ ట్రెక్‌! ఛాదర్‌ అంటే... గడ్డకట్టిన నది. ఆ నదిపేరు ఝన్‌స్కార్‌! శీతాకాలంలో నది మొత్తం గడ్డకడుతుంది. గలగల పారే నీరు, జలపాతాలు ఎవరో మంత్రమేసినట్లుగా ‘మంచు శిలల్లా’ మారిపోతాయి. ఘనీభవించిన ఝన్‌స్కార్‌పై నడక యాత్ర సాగించేందుకు దేశ విదేశాల నుంచి సాహసికులు లేహ్‌కు తరలి వస్తారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ట్రెక్‌లలో ఛాదర్‌ ట్రెక్‌ ఒకటి!




పర్యాటకమే ఆధారం... 

లద్దాఖ్‌ ప్రజలు శాంతి కాముకులు. లేహ్‌ నగర ప్రజలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. పురాతన (యాంటిక్‌) వస్తువులు, కళాకృతులు, శాలువాల దుకాణాలకు లేహ్‌ ప్రసిద్ధి. లద్దాఖ్‌లో మరెక్కడా పెద్ద పట్టణాలు కనిపించవు. సంచార జీవనం, గొర్రెల పెంపకం, చిన్న స్థాయిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 20 డిగ్రీలకంటే దిగువకు పడిపోతాయి. చేయడానికి పనీ ఉండదు. అందుకే... ఇంటికి కాపలాగా ఒకరిద్దరు మాత్రమే ఉండి మిగిలిన వాళ్లు జమ్మూకు వెళ్లిపోతారు. ఒక్కటి మాత్రం... పర్యాటకులు ఒక్కసారి వెళితే చాలు, లేహ్‌-లద్దాఖ్‌తో ప్రేమలో పడిపోతారు!


అమరుల స్మారకం ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’

సరిహద్దు భద్రతకు అటు పాకిస్థాన్‌, ఇటు చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో లద్దాఖ్‌ ప్రాంతంలో భారత సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. చాలాచోట్ల సైనిక శిబిరాలు కనిపిస్తాయి. ఆర్మీ వాహనాలు ఎదురవుతూనే ఉంటాయి. లేహ్‌ సమీపంలో ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’... అమర వీరులైన భారత సైనికులకోసం ఏర్పాటు చేసిన ఒక స్మారకం! లద్దాఖ్‌ రేంజ్‌లో 1947-48 యుద్ధం మొదలుకుని... కార్గిల్‌ వార్‌ దాకా, ఆ తర్వాతా జరుగుతున్న కాల్పుల్లో అమరులైన సైనికుల పేర్లు, హోదాలతో వరుసగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాలు చూస్తే మన కళ్లు చెమర్చుతాయి. ‘జై జవాన్‌’ అని గుండె గట్టిగా నినదిస్తుంది.


- తొమ్మండ్రు సురేష్‌ కుమార్‌

(మనాలీ-లేహ్‌-మనాలీ బైక్‌ యాత్ర చేసిన అనుభవంతో...)



Updated Date - 2020-07-05T17:38:38+05:30 IST