న్యూఢిల్లీ : ఉక్రెయిన్ అమ్మాయి అన్నా హొరొడెట్స్కా (30), ఇండియా అబ్బాయి అనుభవ్ భసిన్ (33) మధ్య చిగురించిన స్నేహం మెల్ల మెల్లగా ప్రేమగా మారి, యుద్ధాన్ని ఖాతరు చేయకుండా, ఢిల్లీ విమానాశ్రయంలో ఎంగేజ్మెంట్ రింగ్ తొడగటంతో సుఖాంతమైంది. విమానం నుంచి దిగిన అన్నా ముందు అనుభవ్ మోకరిల్లి ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అభ్యర్థించడంతో అన్నా ‘‘ఓకే’’ చెప్పారు.
ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న అనుభవ్, ఉక్రెయిన్లోని కీవ్ నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అన్నా తొలిసారి 2019లో కలిశారు. వెకేషన్ కోసం అన్నా భారత దేశం వచ్చారు. అప్పుడు ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబరు మరొకరికి ఇచ్చుకున్నారు. మొదట్లో స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవారు. నెమ్మదిగా ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారిని అరికట్టడం కోసం అష్టదిగ్బంధనం అమల్లో ఉన్న సమయంలో ఆమె రోడ్డు మార్గంలో రాజస్థాన్ వచ్చారు.
లాక్డౌన్ సమయంలో తాను ఆమెకు సాయపడ్డానని, దీంతో మరింత సన్నిహితులమయ్యామని అనుభవ్ చెప్పారు. మూడోసారి 2021లో దుబాయ్లో కలుసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత భారత దేశంలో మరోసారి కలుసుకున్నామన్నారు. తన తరపున తన తల్లి ఆమెకు ప్రపోజ్ చేశారని చెప్పారు. ‘‘మా అబ్బాయిని పెళ్లి చేసుకో’’ అని అడిగారన్నారు. తామిద్దరమూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మార్చిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. భారత దేశంలో మాదిరిగా ఆర్భాటంగా కాకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్నామన్నారు. పెళ్లికి అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తున్న సమయంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైందన్నారు.
కీవ్ నగరంలో బంకర్లో అన్నా తలదాచుకుందని, తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని చెప్పారు. అక్కడే ఉండాలని తాను చెప్పానని, అయితే ఏదో విధంగా తాను భారత దేశానికి వచ్చేస్తానని చెప్పిందన్నారు. దీంతో తాను సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడి, పోలండ్లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో రెండేళ్ళ ఇండియన్ వీసాను సంపాదించగలిగామన్నారు.
అన్నా తన తల్లితోపాటు లివివ్ చేరుకుని, అక్కడి నుంచి పోలిష్ సరిహద్దులకు చేరుకున్నారని, ఆమె తల్లి నార్వే వెళ్ళిపోయారని చెప్పారు. ఆమె తన భర్తతో మెక్సికోలో ఉంటారన్నారు. ఏప్రిల్ 27న తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు.
అన్నా మాట్లాడుతూ, తాను యుద్ధం ముగిసిన తర్వాత కీవ్ వెళ్ళి తన పెంపుడు కుక్కను తీసుకొస్తానని, తాను భారత దేశంలోనే జీవిస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి