Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 24 Sep 2021 15:12:26 IST

‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ

twitter-iconwatsapp-iconfb-icon
లవ్‌స్టోరి మూవీ రివ్యూ

చిత్రం: ‘లవ్‌స్టోరి’

విడుదల తేదీ: 24, సెప్టెంబర్ 2021

నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు, ఉత్తేజ్, గంగవ్వ తదితరులు

కెమెరా: విజయ్ సి. కుమార్

ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

సంగీతం: పవన్ సి.హెచ్

నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్‌ రావు

రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల


స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా దేశంలోని కొన్ని చోట్ల కుల, వర్ణ వివక్షలు సాధారణంగానే నడుస్తున్నాయి. రోజూ న్యూస్ పేపర్లలో ఏదో ఒక చోట పరువు హత్య అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌తో శేఖర్ కమ్ముల ఓ లవ్ స్టోరిని చెప్పబోతున్నాడనగానే.. అంతా ఆసక్తి క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి వంటి స్టార్స్ నటిస్తున్నారనగానే మాములుగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. విడుదలకు ముందే పాటలు పెద్ద హిట్టవ్వడం కూడా సినిమాపై క్రేజ్‌ని పెంచింది. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ, థియేటర్ పోటీ నడుస్తున్న క్రమంలో.. ఎంత ఆలస్యమైనా సరే.. ఈ మ్యాజిక్ లవ్‌స్టోరిని బిగ్ స్క్రీన్‌పైనే ప్రేక్షకులకు చూపిస్తామని నిర్మాతలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. వారి కాన్ఫిడెంట్ కూడా ఈ సినిమాపై ప్రేక్షకులకు నమ్మకం కలిగించింది. థియేటర్స్ తెరుచుకున్నాక ప్రతి వారం కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి కానీ థియేటర్లు కళకళలాడే పరిస్థితి మాత్రం ఇంకా రాలేదు. టాలీవుడ్‌కు మళ్లీ కళ తెచ్చే సినిమా ఇదవుతుందని ఇండస్ట్రీ అంతా వేచిచూస్తుంది. అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న ‘లవ్‌స్టోరి’ నేటి నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల మరోసారి మ్యాజిక్ చేశారా? నిర్మాతల నమ్మకం నిజమైందా? అసలు ఈ సినిమాలో ఉన్న మ్యాటరేంటి? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.


కథ: 

ఆర్మూరు గ్రామంలో పుట్టి పెరిగిన రేవంత్(నాగచైతన్య).. చిన్నప్పటి నుంచి తను చూసిన కుల వివక్షను దాటి ఉన్నతంగా బ్రతకాలని హైదరాబాద్ వచ్చి ఓ జుంబా సెంటర్ (ఫిట్‌నెస్ సెంటర్) నడుపుతుంటాడు. అది అంత బాగా నడవదు. అదే ఊరికి చెందిన మౌనిక(సాయిపల్లవి) బీటెక్ చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్‌లోనే కోచ్‌గా జాయిన్ అవుతుంది. ఆమె వచ్చినప్పటి నుంచి ఆ జుంబా సెంటర్ బాగా నడుస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ మౌనిక పటేల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె బాబాయ్ సాయిట్ట నరసింహం(రాజీవ్ కనకాల) పరువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తి. ఊరు ఊరంతా అతనికి భయపడుతుంది. అటువంటి వ్యక్తిని ఎదిరించి రేవంత్, మౌనిక ఎలా వారి ప్రేమని గెలిచారు?. మౌనికకే కాకుండా తన ఫ్యామిలీకి, ఆ ఊరికి సాయిట్ట నరసింహంతో ఉన్న సమస్యను రేవంత్ ఎలా బయటపెట్టాడు? వంటి సున్నితమైన విషయాలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

నాగచైతన్య స్థాయిని ఓ మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఆయన నటన అందరినీ మెప్పిస్తుంది. డ్యాన్స్ కూడా సాయిపల్లవితో పోటీగా చేశాడు. కులవివక్షను ఎదుర్కొనే కుర్రాడిగా, జూంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా, మౌనిక లవర్‌గా చైతూ తన నటనలో వైవిధ్యతను కనబరిచాడు. తెలంగాణ స్లాంగ్‌లో చైతూ డైలాగులు చెబుతుంటే చాలా బాగుంది. నాగచైతన్య కెరీర్‌లో ఇది ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. ఇక మౌనికగా సాయిపల్లవి మరోసారి అందరినీ ‘ఫిదా’ చేసింది. డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. డైలాగ్స్‌తో నవ్వించింది. ఆమె పాత్ర ఈ చిత్రానికి కీలకం. గట్టిగా ఏదైనా అడిగినా, విన్నా కళ్లు తిరిగిపడిపోయే సందర్భాలలో సాయిపల్లవి చక్కగా నటించింది. అలాగే నేటితరం అమ్మాయిలకు బాగా చదవండి అనే మెసేజ్‌‌తో పాటు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఓ సున్నితమైన సమస్యను కూడా ఆమె పాత్ర ద్వారా దర్శకుడు చెప్పించాడు. మౌనిక పాత్రకి సాయిపల్లవి 100 శాతం కరెక్ట్. ఆమె చేయకపోతే.. ఈ సినిమా రూపమే మారిపోయేది. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా, విలన్‌గా రాజీవ్ కనకాల పాత్రని మలిచిన తీరు బాగుంది. అంతే గంభీరంగా నటించి రాజీవ్ కనకాల కూడా తన పాత్రకు న్యాయం చేశారు. రేవంత్ తల్లిగా ఈశ్వరీరావు పాత్రని కూడా దర్శకుడు చక్కగా మలిచాడు. ఆమె కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మౌనిక తల్లిపాత్రలో నటించిన దేవయాని‌కి కొన్ని సీన్లే పడ్డాయి. ఆమె పాత్ర కూడా ఈ సినిమాకి కీలకమే. ఇంకా చైతూ ఫ్రెండ్ ధీరు, జుంబా సెంటర్‌లో ప్రేమ జంట, గంగవ్వ, మౌనిక నాయనమ్మగా చేసిన బామ్మ అందరూ వారి పాత్రల పరిధిమేర నటించారు. పోలీసాఫీసర్‌గా ఉత్తేజ్ కనిపించిన తీరు బాగుంది.

టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధాన బలం మ్యూజిక్, కెమెరా. పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. ‘ఏవో ఏవో కలలే..’ అనే పాటలో చైతూ, సాయిపల్లవిల డ్యాన్స్ హైలెట్. మిగతా పాటలు కూడా బాగున్నాయి. విడుదలకు ముందు పెద్ద హిట్ అయిన ‘సారంగ దరియా’ పాట, సినిమాలో వచ్చి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ని చక్కగా క్యారీ చేసింది. పల్లె అందాలను విజయ్ తన కెమెరాతో బంధించిన తీరు బాగుంది. లైటింగ్ గురించి కూడా మాట్లాడుకునేలా శేఖర్ కమ్ముల సన్నివేశాలను క్రియేట్ చేశాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంటర్వెల్‌కి ముందు, సెకండాఫ్ స్టార్టింగ్‌లో కొద్ది సేపు కొన్ని సీన్లు పదే పదే చూస్తున్నట్లు అనిపిస్తుంది. వాటిని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే చాలా బాగుండేది. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణం పరంగా సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. ఈ ప్రేమ కథ మీద నమ్మకంతో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదనిపిస్తుంది. ఇక కెప్టెన్ శేఖర్ కమ్ముల ఈ సినిమాని న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేని ఓ సున్నిత సమస్యను ఆయన చూపించిన తీరు, అలాగే దానికి పరిష్కారం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ పాయింట్‌ నిజంగా ఇప్పుడవసరం. ఈ పాయింట్‌ని సాయిపల్లవికి లింక్ చేసి ఆయన చూపించిన తీరుకి శేఖర్ కమ్ముల నిజంగా అభినందనీయులు. అలాగే కుల, వర్గవివక్షల వంటి సున్నిత విషయాలను టచ్ చేయాలంటే.. ఇప్పుడున్న ప్రపంచంలో ఘట్స్ కావాలి. ఎందుకంటే ప్రతి విషయానికి ఇక్కడ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. అలాంటిది ఎవరినీ కించ పరచకుండా.. సెన్సిటివ్ సమస్యను అంతే సెన్సిటివ్‌గా తెరకెక్కించి.. నాతోనైతదని నిరూపించాడీ సెన్సిబుల్ దర్శకుడు. ఆయన రాసుకున్న పాత్రలు, తీసుకున్న సాంకేతిక నిపుణులు అందరూ ఈ సినిమాని ఓ స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్‌లో సాయిపల్లవి, చైతూ డైలాగ్స్ చెబుతుంటే.. చూస్తున్న ఆడియన్స్ ఆ పాత్రలలో మనమే మాట్లాడుకుంటున్నామా? అనుకునేలా అనిపిస్తుంది. మళ్లీ థియేటర్లకి ఈ సినిమా కళ తెస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంటర్వెల్‌కి ముందు, తర్వాత కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి తప్ప.. ఓవరాల్‌గా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఈ సినిమా ఆహ్లాదపరిచి పంపిస్తుంది.. మరియు ఆలోచింపజేస్తుంది.

ట్యాగ్‌లైన్: మరోసారి ‘ఫిదా’ చేసిండ్రు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement