‘లవ్‌లైఫ్‌’ బాధితులు లక్షల్లో!

ABN , First Publish Date - 2021-12-27T07:38:54+05:30 IST

‘లవ్‌లైఫ్‌’ బాధితులు లక్షల్లో!

‘లవ్‌లైఫ్‌’ బాధితులు లక్షల్లో!

పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరిట వల

టైలింజిన్‌ అనసూయ పేరిట చాటింగులు

క్రిస్మస్‌ ముందు రోజూ కొనసాగింపు

ఆ రోజు అర్ధరాత్రి నుంచి అన్నీ బంద్‌

200 కోట్లకు పైనే సైబర్‌ లూటీ

విజయవాడ, గుంటూరు, ఏలూరు 

విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతిలోని

సైబర్‌ స్టేషన్లలో ఫిర్యాదుల వెల్లువ

లావాదేవీలు, వాట్సాప్‌ ఆధారంగా విచారణ 


విజయవాడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘లవ్‌ లైఫ్‌’ సైబర్‌ మోసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు తదితర పట్టణాల పరిధిలో పెద్ద ఎత్తున బాధితులు సైబర్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఆదివారం విజయవాడలోని సైబర్‌ పోలీసు స్టేషన్‌కు బాధితులు క్యూ కట్టారు. రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది బాధితులు లవ్‌లై్‌ఫలో పెట్టుబడులు పెట్టారని, ఈ మొత్తం విలువ రూ.200 కోట్ల పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ‘నేచర్‌ అండ్‌ హెల్త్‌’ నినాదంతో కొవిడ్‌ సమయంలో రోగులకు అవసరమైన వైద్య పరికరాల కోసం తమతో డివైజ్‌ల రీచార్జిలు చేయించారని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో రూ.లక్షలు పెట్టుబడులు పెట్టించి బోర్డు తిప్పేశారని గగ్గోలు పెట్టారు. బాధితుల నుంచి సైబర్‌ పోలీసులు ఫిర్యాదులు స్వీకరించారు. లవ్‌ లైఫ్‌ సైబర్‌ క్రైమ్‌ మూలాలు ప్రధానంగా ఢిల్లీలోనే ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. టైలింజిన్‌ అనసూయ పేరిట తమతో జరిపిన మొబైల్‌, వాట్సాప్‌ చాటింగ్‌ మేరకు లవ్‌లైఫ్‌ థర్డ్‌పార్టీ అప్లికేషన్‌లో సభ్యులుగా చేరి పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. 


పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరుతో 

టైలింజిన్‌ అనసూయ పేరుతో ముందుగా మొబైల్‌ ఫోన్లకు పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ ఉన్నాయంటూ మెసేజ్‌లు వచ్చాయి. ఈ మెసేజ్‌లకు ఆకర్షితులైన వారిని లవ్‌లై్‌ఫలో మెడికల్‌ డి వైజ్‌ల రీ చార్జిల ద్వారా పెట్టుబడులు పెడితే పెట్టిన పెట్టుబడికి మూడు నుంచి పదిరెట్ల వరకు లాభాలు పొందవచ్చని ఆఫర్‌ చేశారు. టైలింజిన్‌ అనసూయ కేవలం వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా బాధితులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.  సభ్యులుగా చేరిన వారితో వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసేదని, ఈ గ్రూప్‌లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారిని గ్రూప్‌ అడ్మిన్‌లుగా ఎంపిక చేసి వారి ద్వారా తరచూ వాట్సా్‌పలలో డివైజ్‌ల రీచార్జిలపై పోస్టులు పెట్టించేదని తెలిపారు. మొబైల్‌ యాప్‌, వెబ్‌ అప్లికేషన్‌ లింక్‌ రెండింటి ఆధారంగా రిజిస్టర్‌ అయిన సభ్యులు మెడికల్‌ డివైజ్‌లు యాక్టివేషన్‌ చేసుకోవటానికి రీచార్జి చేసేవారని చెప్పారు. రీచార్జి చేసుకోవటానికి యాప్‌లో ఆప్షన్‌ ఇచ్చారని ఆ ఆప్షన్‌లోకి వెళితే రోజర్‌ పే, గోల్డెన్‌ పే, జెఫ్‌ పే వంటి సబ్‌ ఆప్షన్స్‌ వచ్చేవని, వాటి ద్వారా నెట్‌బ్యాకింగ్‌, యూపీఐ ఐడీ, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎంల ద్వారా మెడికల్‌ డివైజ్‌లకు నిర్దేశించిన ఇన్వె్‌స్టమెంట్‌కు సరిపడా రీచార్జి చేయించేవారని బాధితులు చెప్పారు. రీచార్జి చేసినట్టుగా బ్యాంకు ట్రాన్సాక్షన్‌ యూటీఆర్‌ నెంబర్లను కూడా ఎంటర్‌ చేయించేవారని, ఇలా ఎంటర్‌ చేసిన తర్వాతే యాప్‌లో మెడికల్‌ డివైజ్‌లు యాక్టివేట్‌ అయ్యేవని తెలిపారు. మెడికల్‌ డి వైజ్‌లకు గరిష్టంగా 210 రోజుల నుంచి కనిష్టంగా వారం రోజుల వరకు సమయాన్ని నిర్దేశించి రోజూ కొంత మొత్తం జమ చేసేవారని తెలిపారు. వీటిని విత్‌ డ్రా చేసుకోవటానికి ఆప్షన్‌ ఇచ్చారని, బ్యాంకు ఖాతా లింక్‌ చేసి ఒకటి రెండు దఫాలు డ్రా చేస్తే డబ్బులు పడ్డాయని, దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. 


క్రిస్మస్‌ పేరిట భారీ ఆశ చూపి.. 

ఈ నెల మొదటి వారంలో  టైలింజిన్‌ అనసూయ క్రిస్‌మస్‌ రివార్డులను ప్రకటించిందని బాధితులు తెలిపారు. యాభై మంది సభ్యులను చేర్పించినందుకు రూ.లక్ష, వంద మందిని చేర్చితే రూ.2 లక్షలు, 200 మందిని చేర్చితే రూ.7 లక్షలు రివార్డ్స్‌గా ప్రకటిస్తామని పోస్టులు పెట్టేదని పేర్కొన్నారు. జనవరి 1న ఢిల్లీలో పార్టీ ఉందని, పార్టీకి అందరూ ఆహ్వానితులేనని చెప్పిందని, ఫ్లైట్‌ టికెట్స్‌, బస అంతా తామే చూసుకుంటామని వాట్సాప్‌ చాటింగ్‌ చేసిందన్నారు. క్రిస్‌మ్‌సకు వారం రోజుల ముందు నుంచి విత్‌డ్రాయల్‌ పేమెంట్లు ఆగిపోయాయని, వాట్సాప్‌ గ్రూపుల్లో ఓన్లీ గ్రూప్‌ అడ్మిన్‌ సెండ్‌ మెసేజె్‌సను యాక్టివేట్‌ చేసిందని తెలిపారు. మూడు రోజుల ముందు నుంచి రూ.14,980 మెడికల్‌ డివైజ్‌ రీచార్జి చేసుకుంటే సూపర్‌చాట్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో చోటు కల్పిస్తామని, తద్వారా రెండు గంటలలోనే విత్‌డ్రాయల్స్‌ స్వీకరించవచ ్చని చాట్‌ చేసిందని తెలిపారు. తర్వాత క్రిస్‌మస్‌ ముందురోజు మాత్రం రూ.9,980 డివైజ్‌ను యాక్టివేట్‌ చేసుకుంటేనే సభ్యులకు సహకారం కొనసాగుతుందని, లేకపోతే టెర్మినేట్‌ చేస్తామని మెసేజ్‌లు చేసినట్టు తెలిపారు. డిసెంబరు 24వ తేదీ అర్ధరాత్రి నుంచి యాప్‌, వెబ్‌లింక్స్‌ ఓపెన్‌ కావటం లేదని చెప్పారు. సైబర్‌ పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత యాప్‌ లింక్స్‌, వెబ్‌ లింక్స్‌ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లవ్‌ లైఫ్‌ యాప్‌ను లివనోవాడాట్‌కామ్‌ను పోలి ఉండేదిగా రూపొందించారని, దాని అనుబంధ సంస్థగా టైలింజిన్‌ అనసూయ ప్రచారం చేసిందని కూడా బాధితులు తెలిపారు. గుజరాత్‌ లో ఇదే టైలింజిన్‌ అనసూయ అక్కడి వాళ్లను కూడా లవ్‌ లైఫ్‌ పేరుతో మోసం చేసిందని స్థానిక పత్రికలో వచ్చిన కథనం గురించి కూడా బాఽధితులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా తమకు 20 లక్షల మంది సభ్యులు ఉన్నారని వాట్సాప్‌ చాటింగ్‌లో పేర్కొన్న విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో లవ్‌ లైఫ్‌ యాప్‌ను ఎవరు ప్రారంభించారు? ఎక్కడి నుంచి ప్రారంభించారు? డబ్బులు ఏ అకౌంట్‌కు వెళ్లాయి? ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో విచారణను ప్రారంభించారు.

Updated Date - 2021-12-27T07:38:54+05:30 IST