ప్రేమ విఫలం అయితే తట్టుకోవడం కష్టం

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

సినీ పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా కథానాయికగా ఎదిగారు అంజలి. టాలీవుడ్‌లో నాయికగా 15 ఏళ్లు పూర్తి

ప్రేమ విఫలం అయితే తట్టుకోవడం కష్టం

సినీ పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా కథానాయికగా ఎదిగారు అంజలి. టాలీవుడ్‌లో నాయికగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నచ్చిన పాత్రలే ఎంచుకుంటూదక్షిణాది భాషల్లో కథానాయికగా కొనసాగుతున్నారు. ఈ నెల 9న విడుదల కానున్న ‘వకీల్‌ సాబ్‌’లో ఓ కీలక పాత్రతో అలరించడానికి సిద్ధమైన అంజలిని ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలివి..



హాయ్‌ అంజలి.. ‘వకీల్‌సాబ్‌’ విడుదల కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లున్నారు? 

అవునండీ! హిందీలో పెద్ద హిట్‌ సినిమాకు రీమేక్‌, అందులోనూ పవన్‌కల్యాణ్‌గారు హీరో.. ఆ ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుంది కదా. గొప్ప అవకాశాలు కొన్ని సార్లు మాత్రమే దొరుకుతుంటాయి. అలాంటి అవకాశమే ‘వకీల్‌సాబ్‌’. అది దక్కడంతో నా కల నిజమైనంత ఆనందంతో ఎగిరి గెంతేశా. ఇందులో నా పాత్ర ఏంటనేది కూడా ఆలోచించలేదు. కల్యాణ్‌గారి సినిమాలో అవకాశం వచ్చింది అన్నదే నా మైండ్‌లో ఉంది. అంజలి అనగానే సీత, గీతాంజలి పాత్రలు గుర్తొస్తాయి. అలాంటి పాత్రే ఇది. 


‘అవును డబ్బులు తీసుకున్నాం’ అని కోర్ట్‌లో చెప్పే సన్నివేశం చాలు నా పాత్ర ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి. ‘పింక్‌’ సినిమాతో ‘వకీల్‌ సాబ్‌’ను పోల్చి చెప్పలేను. పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్‌ కొట్టుకుపోతాయి. ‘వకీల్‌ సాబ్‌’లో నా పాత్రకు ఓ స్థానం ఉంటుంది. ఇలా వచ్చి అలా పోయే క్యారెక్టర్స్‌ జోలికి నేను వెళ్లనని ‘వకీల్‌సాబ్‌’ చూశాక ప్రేక్షకులు అంగీకరిస్తారు.


ట్రైలర్‌లో మీ పాత్ర ఎమోషనల్‌గా కనిపించింది. దాని కోసం ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా? 

నేను ‘పింక్‌’ రీమేక్‌ చేస్తున్నాను కానీ.. కాపీ, పేస్ట్‌ చేయట్లేదు. మాతృకలో పాత్రల్ని ఇమిటేట్‌ చేయడం, వాటిని ఫాలో కావడం లాంటివి చేయకూడదని దర్శకుడు ముందే చెప్పారు. ఓ పాత్ర అంగీకరించాక దాని కోసం నేనేమీ ప్రిపేర్‌ కాను. సీన్‌ చదువుకోవడం, రంగంలో దిగడం అంతే! ముందుగా సిద్ధం కావాలంటే నాకు నెర్వస్‌గా ఉంటుంది. సీన్‌లోకి వెళ్లాక తడబడటం నచ్చదు. ముందే సీన్‌ పేపర్‌ చదువుకుని షాట్‌లోకి వెళ్తాం. డైలాగ్స్‌ మరచిపోయి నటిస్తా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే. మా ఇద్దరిలోనూ ఉన్న లక్షణం అది. 



పవన్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది? 

కల్యాణ్‌గారు సెట్లో అడుగుపెడితే అంతా నిశబ్దమే! ఆయనతో మాట్లాడటానికి నాకు పదిహేను రోజులు పట్టింది. నటన పట్ల ఆయన అంకితభావం నచ్చింది. ఆయనతో కలిసి 15 రోజులకుపైనే పనిచేశాను. నాకైతే ఇది అద్భుతమైన ప్రయాణంలా అనిపించింది. కోర్ట్‌ సీన్‌ చేశాక... ఆ సీన్‌ బాగా వచ్చిందని పవన్‌కల్యాణ్‌ చప్పట్లు కొట్టారు. ఆయన ఎక్స్‌ప్రెసివ్‌ కాదని విన్నాను. కానీ అలా నన్ను అభినందిచడం ఆనందంగా ఉంది. తానో పెద్ద స్టార్‌ అనే భావన ఆయన ఎక్కడా రానివ్వలేదు. 


హీరోయిన్‌గా 15 ఏళ్ల జర్నీ మీది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది?

కథానాయికగా 15 ఏళ్ల ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది. దక్షిణాదిలో ఇప్పటి వరకూ 48 సినిమాల్లో నటించా. మరో 5 చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. నాకు పరిశ్రమలో తెలిసినవాళ్లు ఎవరూ లేరు. ఇక్కడికి ఎలా రావాలి.. వచ్చాక ఎలా ఉండాలి. నన్ను అభిమానిస్తున్న వారి దగ్గర ర్యాంకింగ్‌, ఐడెంటిటీ మిస్‌ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది తెలుసుకున్నా. దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మంచి కథలు ఎంచుకుంటూ ముందుకెళ్లడమే సరైన మార్గం. నేను ఎంచుకున్న కథలే నన్ను  నిలబెట్టాయి. తమిళంలో నా మొదటి చిత్రం ‘కట్రదు తమిళ్‌’, తెలుగులో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసుండకపోతే ఓ పది సినిమాల తర్వాత ఇంటికి వెళ్లిపోయేదాన్ని. ఇదంతా నా స్వశక్తితో  నిర్మించుకున్న సామ్రాజ్యం అని గర్వంగా చెప్పుకొంటా. 


ప్రతిభ, అందం, స్టార్‌ హీరోలతో నటించినా తెలుగులో వెనకబడడానికి కారణం? 

వెనకబడి ఉన్నానని నేను అనుకోవడం లేదు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ సెలక్టివ్‌గానే వెళ్తున్నా. సినిమా హిట్‌, ఫ్లాప్‌ నా చేతిలో ఉండదు. ఎన్ని సినిమాలు చేశానని నేనెప్పుడూ పట్టించుకోలేదు. సినిమా క్వాలిటీనే ముఖ్యం. మరో ముఖ్య కారణం ఏంటంటే.. రెండు భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు మరో భాష సినిమాకు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కుదరడం లేదు. అలా గ్యాప్‌ వస్తుంది. నేను తెలుగులో కెరీర్‌ ప్రారంభించేటప్పటికి తమిళంలో 15 సినిమాలు విడుదలయ్యాయి. దాని వల్లే తెలుగులో వెనకబడినట్లు అనిపిస్తుంది కానీ... నటిగా వెనకబడి లేను. 


తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదనే వాదనను సమర్థిస్తారా? 

ముమ్మాటికీ ఒప్పుకోను. ఇంతకుముందు అలా ఉందేమో నాకు తెలీదు. అవకాశాలు లేకపోతే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడను కదా! టాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ భాషతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి. ‘ఫలానా క్యారెక్టర్‌కి ఈ అమ్మాయి సరిపోతుంది. కానీ తెలుగమ్మాయి కదా’ అని ఎవరూ అనుకోరు అమ్మాయి గ్లామర్‌గా లేదు.. ముంబై అమ్మాయిని ట్రై చేద్దాం అనుకుంటే అది వేరే కథ. 




ఓ కథను తిరస్కరించాలంటే ఏం చేస్తారు? 

 కథ విని దానికి నో అని చెప్పడం చాలా కష్టం. కొన్ని కథలు ‘ఎందుకు మిస్‌ అయ్యాం’ అని బాధ పడతాం. మరి కొన్ని కథలు ‘ఎందుకు చేశాం’ అని ఫీలవుతాం. ఏదీ మన చేతిలో ఉండదు. కచ్చితంగా విచారించే సందర్భాలు, సంతోషించే సమయాలు ఉంటాయి. అయితే ఇప్పటికీ నచ్చని కథని తిరస్కరించడంలో స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నా. నాకు కథ నచ్చాలి.. ఆ పాత్ర నాకు కంఫర్టబుల్‌గా ఉండాలి. అప్పుడే నేనూ బాగా చేయగలను. చెప్పిన కథ నచ్చక అంగీకరించకపోతే.. ఈ అమ్మాయికి గర్వం ఎక్కువ అనుకునేవాళ్లూ ఉంటారు. 


సెలెక్టివ్‌గా వెళ్లాలి అనుకున్నప్పుడు మనకు తగ్గ కథలు రావొచ్చు, రాకపోవచ్చు కదా?

అది కరెక్టే. అలాగే పక్కింటి అమ్మాయి పాత్ర నుంచి వేరే పాత్రలోకి జంప్‌ చేయాలన్నా కష్టమే! దర్శకుడు రాసిన కథను ఫలానా హీరోయిన్‌ చేయగలదు అనే నమ్మకం ఉంటే చాలు. ‘నిశ్శబ్దం’ విషయంలో అదే జరిగింది. ‘అంజలి పోలీస్‌ క్యారెక్టర్‌ ఏంటి’ అన్నవాళ్లు చాలామంది ఉన్నారు. నేను సవాలుగా తీసుకుని చేశా. ‘నేను ఏం చేస్తానో తెలీదు.. కానీ డెఫినెట్‌గా ఈ పాత్రకు న్యాయం చేస్తా’ అని దర్శకుడు హేమంత్‌కి మాటిచ్చా. అది వంద శాతం నిలబెట్టుకున్నా. కొన్ని పాత్రల సక్సెస్‌ మనం తీసుకునే ఛాలెంజ్‌ మీద కూడా ఆధారపడి ఉంటాయి. 



గతంలో ప్రేమలో పడ్డారనీ, పెళ్లై పిల్లలు ఉన్నారని వార్తలొచ్చాయి. అలాంటివి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? 

ప్రేమలో పడలేదని నేను అబద్ధం చెప్పను. ఒకరి ప్రేమలో పడ్డాను. ఎందుకో వర్కవుట్‌ కాలేదు. అది జరిగి ఉంటే నేనే అందిరికీ నా ప్రియుడిని పరిచయం చేసేదాన్ని. కానీ జరగలేదు కదా! హీరోయిన్‌ అనే కాదు.. ఏ ఆడపిల్ల అయినా ప్రేమ విఫలం అయితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. అమ్మాయి గుండెలు బండ రాళ్లలాగా ఉండవు. అయితే ఆ బాధ నుంచి నేను త్వరగానే కోలుకున్నా. అందుకు మా అమ్మే కారణం. తను చాలా స్ట్రాంగ్‌ విమన్‌. అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే హ్యాపీగా కెరీర్‌ కొనసాగిస్తున్నా. ఇక నా పెళ్లి అంటారా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు సార్లు నాకు పెళ్లి చేశారు. పిల్లలు కూడా పుట్టారని రాశారు. నా భర్తని, పిల్లల్ని ఎవరైనా చూపిస్తే ఆనందిస్తా. 



నేను పని చేస్తున్న పరిశ్రమలో రోజూ ఎన్నో వినిపిస్తాయి. ప్రశంసలు, విమర్శలు, కష్టసుఖాలు ఇలా ఎన్నో స్ట్రగుల్స్‌ ఉంటాయి. జరిగిన దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఈ క్షణం ఏంటి అన్నది ఆలోచించాలి. వాస్తవంలో బతకమనే నేను చెబుతా. ఊహల్లో విహరించడం అన్ని వేళల మంచిది కాదు. నేను ముందుగా ఏదీ ప్లాన్‌ చేసుకోను. రేపు ఏంటో అస్సలు ఆలోచించను. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో అదే ఆలోచిస్తా. అది వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా!

 ఆలపాటి మధు

ఫొటోలు: లవకుమార్‌

Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST