ప్రేమ వివాహానికీ లంచం

ABN , First Publish Date - 2022-07-08T08:59:56+05:30 IST

ప్రేమ వివాహానికీ లంచం

ప్రేమ వివాహానికీ లంచం

ఫోన్‌పేతో అడ్డంగా బుక్కైన వైనం

మద్దికెర ఎస్‌ఐపై ఏసీబీకి ఫిర్యాదు 


తుగ్గలి, జూలై 7: న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే.. లంచం డిమాండ్‌ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. కర్నూలు జిల్లా మద్దికెర పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ బదిలీపై వెళ్లడతో.. తుగ్గలి ఎస్‌ఐగా పని చేస్తున్న సమీర్‌బాషా వారం రోజులుగా ఆ స్టేషన్‌కు ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో మద్దికెరకు చెందిన క్రాంతికుమార్‌, ప్రీతి జంట ప్రేమించుకుని ఇంట్లో నుంచి పారిపోయారు. అబ్బాయి తరఫు వారికి ఈ పెళ్లి ఇష్టంలేదు. దీంతో వారు పెద్ద మనుషులతో కలసి ఎస్‌ఐను కలవడానికి వెళ్లారు. అయితే, పెళ్లికొడుకు తరఫు వారిని ఒప్పిస్తానని.. అందుకు తనకు రూ.50వేలు ఇవ్వాలని ఎస్‌ఐ యువతి బంధువులను డిమాండ్‌ చేశారు. యువతి సమీప బంధువు, తుగ్గలి ఎంపీటీసీ రాజును మధ్యవర్తిగా పెట్టారు. చివరికి రూ.40వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో క్రాంతికుమార్‌, ప్రీతిలకు పెరవలి దేవాలయంలో వివాహం జరిపించారు. తనకు రూ.40 వేలు ఇవ్వాలని మధ్యవర్తిగా ఉన్న రాజుపై ఎస్‌ఐ సమీర్‌బాషా ఒత్తిడి తెచ్చాడు. అయితే, పెళ్లికుమార్తె తరఫు వారు కేవలం రూ.25వేలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇస్తామంటున్నారని ఎస్‌ఐతో చెప్పారు.


ఈ మాటలను ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం తన వద్ద ఉన్న రూ.25వేలలో ఎస్‌ఐ ఇచ్చిన అకౌంట్‌ నంబరుకు రాజు రూ.10వేలు ఫోన్‌ పే చేశారు. ‘నీ దగ్గర ఉన్న రూ.15వేలు ఇవ్వాలని... మిగిలిన రూ.15వేలను పెళ్లికుమార్తెతో మాట్లాడి  తీసుకుంటానని రాజుపై ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబరుకు  ఫోన్‌ చేసి... ఆయన సమస్యను విన్నవించుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి తుగ్గలికి వచ్చి విచారణ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై తుగ్గలి ఎస్‌ఐ సమీర్‌బాషాను వివరణ కోరడానికి స్టేషన్‌కు వెళ్లగా... అక్కడ లేకపోవడంతో పాటు ఫోన్‌లో కూడా సమాధానం ఇవ్వలేదు.

Updated Date - 2022-07-08T08:59:56+05:30 IST