ఇక తెలుగు అక్షరాల్లో ‘ప్రేమ’..!

ABN , First Publish Date - 2022-02-21T20:54:46+05:30 IST

ఇక తెలుగు అక్షరాల్లో ‘ప్రేమ’..!

ఇక తెలుగు అక్షరాల్లో ‘ప్రేమ’..!

  • భాషోద్యమకారుల అభిలాష
  • ప్రేమ చిహ్నాలు తెలుగులో ఉండాలని డిమాండ్‌

‘నమస్కారం’ అంటూ అచ్చ తెలుగులో పలకరిస్తే అతివినయం అనుకునే రోజులివి. అన్నా, భయ్యాకి బదులు బ్రో అనడమే ఇప్పటి నయా వైఖరి. సామాజిక మాధ్యమాల్లోనూ ‘తెంగ్లిషు’ హవా నడుస్తున్న కాలంలో కొత్త సంప్రదాయం ఒకటి నగరంలో మొదలైంది. అదే ‘ఐ లవ్‌ హైదరాబాద్‌’ వంటి ప్రేమ చిహ్నాలు. అయితే.. పుట్టి, పెరిగిన నేలమీద మమకారాన్ని పరాయిభాషలో వ్యక్తం చేయడమేంటని భాషోద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అమ్మభాషలో నామఫలకాలు తప్పనిసరి చేయాలంటున్నారు.


హైదరాబాద్‌ సిటీ : మహానగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాల నామఫలకాలు తెలుగులో కూడా ఉండాలని కొన్నాళ్ల కిందట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ నిబంధన కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికీ చాలా చోట్ల తెలుగు నామఫలకాలు లేవు. దానికి తోడు ప్రభుత్వమే స్వయంగా ఆంగ్ల చిహ్నాలను, నామ ఫలకాలను పలుచోట్ల నెలకొల్పిన దాఖలాలు బోలెడు. అందుకొక ఉదాహరణ... నెక్లె్‌సరోడ్డులోని ‘ఐ లవ్‌ హైదరాబాద్‌’ ఫలకం. ఈ ప్రేమ తోరణాలు చాలా వరకు ఆంగ్లంలోనే ఉండడాన్ని భాషోద్యమకారులు నిరసిస్తున్నారు. 


పర్యాటక ఆకర్షణ కోసం..

కొన్ని ప్రైవేటు సంస్థలు, హోటళ్లు ప్రేమ చిహ్నాల బాటపడుతున్నాయి. నిన్న మొన్నటి కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లోనూ ఒక పెద్ద హోర్డింగ్‌లో ఆంగ్లంలో అదే చిహ్నాన్ని వాడారు. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక ఆకర్షణ కోసం ‘ఐ లవ్‌ హైదరాబాద్‌’ తదితర చిహ్నాలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంస్థలు సైతం ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, అధిక శాతం ఆంగ్లంలోనే ఉంటున్నాయి. అవి అలా ఉంటేనే తెలుగేతర ప్రాంతీయులకూ సులువుగా అర్థమవుతాయనేది కొందరి వాదన. కానీ.. మాతృభాషలో పరిపాలన చేయలేకున్నా, కనీసం ఇలాంచి చిన్న విషయాల్లోనూ అమ్మ భాషకు ప్రాధాన్యం ఇవ్వకుంటే ఎలా అని తెలుగుభాషోద్యమకారులు నిలదీస్తున్నారు. 


మన పలుకుబడికి విఘాతం

సాధారణంగా ఏ ప్రాంత వాసులైనా తమ ఊరును, వాడను పలికేప్పుడు ‘మా’ అనే మాట వాడతారు. ఇక్కడి వారైతే ‘మా హైదరాబాద్‌’, పాలమూరు వాసులైతే ‘మా మహబూబ్‌నగర్‌’ అంటారు. ఒక ప్రాంతం మీద ప్రేమను వ్యక్తీకరించేప్పుడు ‘ఐ లవ్‌’ వంటి పదాలు వాడటం వల్ల... భావోద్వేగ స్థాయిని కిందకు నెట్టినట్టు అవుతుందని కొందరి అభిప్రాయం. ఒక ప్రాంతవాసులను ఒక్కటి చేయగల యుక్తి, దానిమీద భావోద్వేగాన్ని రేకెత్తించగల శక్తి పరాయిభాషకు ఉండదని భారతీయ భాషాశాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు చెబుతున్నారు. కేవలం మాతృభాషేతర ఫలకాలు, చిహ్నాలు నెలకొల్పడం ద్వారా స్థానిక అస్తిత్వానికి, పలుకుబడికి విఘాతం తలెత్తడమే అని ఆయన అభిప్రాయం.


పరాయి సంస్కృతికి ప్రాధాన్యం..

నగర సుందరీకరణ, పర్యాటక అభివృద్ధిలో పరాయి సంస్కృతికే మనం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రముఖ చిత్రకారుడు రమణారెడ్డి విచారం వెలిబుచ్చుతున్నారు. నగరంలోని పలు కూడళ్ల వద్ద నెలవైన శిల్పాలు, లోహ ప్రతిమల్లో ఇసుమంతైనా హైదరాబాద్‌ లేదా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించడం లేదంటున్నారు. ‘‘ప్రతీ నగరానికి ఒక సాంస్కృతిక విధానం ఉండాలి. అది అడుగడుగునా కనిపించాలి. సమకాలీన చిత్రకళలో అసమాన ప్రతిభకలిగిన కళాకారులు ఎంతో మంది తెలంగాణలో ఉన్నారు. నగర సుందరీకరణలో స్థానిక చిత్రకారులను, శిల్పులను భాగస్వామ్యం చేయడం ద్వారా తెలంగాణ సంస్కృతి, భాష మరింత పరిఢవిల్లుతాయి. అంతేకానీ, ‘ఐ లవ్‌ హైదరాబాద్‌’ వంటి చిహ్నాలు మన నగరానికి ఎంతమాత్రము వన్నె తేలేవని’’ రమణా రెడ్డి అభిప్రాయపడుతున్నారు.


తెలుగు అక్షరమే లేని ఆహ్వాన తోరణాలు..

తెలుగు అక్షరమే లేని ప్రేమ చిహ్నాలతో వికారమైన ఆహ్వాన తోరణాలు తెలంగాణ నిండా కనిపిస్తున్నాయి. తెలంగాణ భాషమీద, సంస్కృతి మీద ప్రేమాభిమానాలు కలిగిన వారి గుండెలకు ఈ ఆంగ్ల చిహ్నా లు ఒక ముల్లులా గుచ్చుకుంటున్నాయి. మంచిర్యాల తదితర చోట్ల ‘మంచి మంచిర్యాల’ అంటూ అమ్మభాషలో చిహ్నం పెట్టారు. అలా మన తెలంగాణ పలుకుబడిలో ఇలాంటి గుర్తులు, నామఫలకాలు ఏర్పాటు చేయాలి. పరాయిభాషలో ప్రేమను ఒలకబోసే ఇలాంటి చిహ్నాలతో అమ్మభాషకు మరింత ప్రమాదం తెచ్చిపెట్టవద్దని మనవి. - సుమనస్పతి రెడ్డి, చిత్రకారులు, ఛాయాగ్రాహకుడు.


మనకంటూ భాషా విధానం అవసరం

మన భావాలను మాతృభాషలో వ్యక్తీకరించడం వల్ల కలిగే బలం, భావోద్వేగం మరెందులోనూ ఉండదు. ప్రైవేటు సంస్థలు తప్పనిసరిగా తెలుగులో నామఫలకాలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ‘ఐ లవ్‌’ కు బదులు ‘మన లేదా మా’ పలుకుబడితో ఈ నేల అస్తిత్వం, స్థానిక సంస్కృతి కలగలిసి ఉండేలా చిహ్నాలను, శిల్పాలను ఏర్పాటు చేయాలి. మనకంటూ ఒక భాషా విధానం ఉండాలి. ‘మన బస్తీ-మన బడి’ వంటి అచ్చ తెలుగు పేర్లతో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. - నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి.

Updated Date - 2022-02-21T20:54:46+05:30 IST