మహిళా వలంటీరుతో ప్రేమాయణం

ABN , First Publish Date - 2020-06-06T10:01:48+05:30 IST

ఆరు నెలల పరిచయంతో పంచాయతీ కార్యదర్శి, మహిళా వలంటీరు ప్రేమలో పడ్డారు. అతడికి పెళ్లయి, ఈడొచ్చిన పిల్లలున్నారని తెలిసినా పెళ్లి చేసుకోవడానికే ఆమె మొగ్గుచూపింది. కుమార్తె నిర్ణయంతో విస్తుపోయిన

మహిళా వలంటీరుతో ప్రేమాయణం

  • పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు
  • గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఘటన 


దాచేపల్లి, జూన్‌ 5: ఆరు నెలల పరిచయంతో పంచాయతీ కార్యదర్శి, మహిళా వలంటీరు ప్రేమలో పడ్డారు. అతడికి పెళ్లయి, ఈడొచ్చిన పిల్లలున్నారని తెలిసినా పెళ్లి చేసుకోవడానికే ఆమె మొగ్గుచూపింది. కుమార్తె నిర్ణయంతో విస్తుపోయిన తల్లిదండ్రులు.. గ్రామ కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దాచేపల్లిలో శుక్రవారం కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా దాచేపల్లి పంచాయతీ ఇటీవల నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయింది. అంతకుముందు, అంటే ఆరునెలల క్రితం ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా సయ్యద్‌ జాన్‌పీరా పనిచేశారు. అప్పట్లో దాచేపల్లికి చెందిన మహిళా వలంటీరుతో ఆయన పరిచయం పెంచుకొన్నారు. జాన్‌పీరా పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో భార్య, ఇద్దరు కుమార్తెలతో ఉండేవాడు. ఈ విషయాలన్నీ మహిళా వలంటీరుకు తెలుసు. అయినా ఆయననే పెళ్లాడాలని ఆమె కోరుకొంది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం జాన్‌పీరా దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అయినా వారిద్దరి పరిచయం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం నచ్చని ఆమె తల్లిదండ్రులు, నాలుగురోజుల క్రితం జాన్‌పీరాపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు మత్తుమందు ఇచ్చి అతడు లోబరుచుకున్నట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తన తల్లిండ్రులు తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ రెండురోజుల క్రితం మహిళా వలంటీరు 100 నంబరుకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆమె పోలీసుల సంరక్షణలోనే ఉన్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు సయ్యద్‌ జాన్‌పీరాపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-06-06T10:01:48+05:30 IST