జోరుగా నాటుసారా

ABN , First Publish Date - 2022-04-17T05:09:01+05:30 IST

గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. సారా తయారీ, విక్రయాలు జోరందుకున్నాయి.

జోరుగా నాటుసారా
సారా ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు

ఫలితమివ్వని నవోదయం పథకం

జోరందుకున్న తయారీ, విక్రయాలు

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 16: గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. సారా తయారీ, విక్రయాలు జోరందుకున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సారా తయారీ మాత్రం ఆగడం లేదు. గతంలో తాండాల్లో సారా ఎక్కువగా కాచేవారు. వారు కేసుల్లో ఇరుక్కుని జైలుశిక్ష అనుభవించడంతో పాటు కోర్టుల చుట్టూ తిరిగేవారు. అయితే సారా వ్యాపారానికి స్వస్తి చెప్పి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో గత టీడీపీ ప్రభుత్వం నవోదయం పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గిరిజనులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. దీంతో వారంతా రుణాలు తీసుకుని హోటల్స్‌, ఆటో, టెంపోలు, పాడిఆవులు, గొర్రెల వ్యాపారం, చిల్లర దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవారు. అయితే కొందరు సబ్సిడీ మాత్రమే తీసుకోగా, ఇంకొందరు మొత్తం రుణం తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల పాటు గిరిజనులు సారా జోలికి వెళ్లకుండా కేవలం వ్యవసాయం, వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో గ్రామాల్లో సారా వ్యాపారం బాగా తగ్గుముఖం పట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సారా వ్యాపారం మళ్లీ జోరందుకుంది. తాండాల్లో తయారు చేసి గ్రామాలకు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో అందరూ సారాకు బానిసయ్యారు. ముఖ్యంగా లిక్కర్‌ ధరలు ఆకాశాన్నంటడంతో మందుబాబులు సారాపై మొగ్గు చూపడంతో దీంతో మళ్లీ సారా వ్యాపారం జోరందుకుంది. తాండా పరిసర ప్రాంతాల్లో బట్టీలను ఏర్పాటు చేసుకుని సారా తయారు చేసి అక్కడి నుంచి వాహనాల్లో పల్లెలకు, పట్టణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె మండలంలోని నారామాకులతాండా, కొండమీదచెరువుతాండా, తుమ్మలతాండా, చుక్కలతాండా, నక్కలదిన్నెతాండా, వేంపల్లెతాండా, నడిమితాండా, మందబండతాండా, బొమ్మనచెరువుతాండా, దాదినాయునితాండా, ఉడుంవారిపల్లెతాండా, కోటవారిపల్లెతాండాల్లో సారా వ్యాపారం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సారా విక్రయాలపై సమాచారం అందిస్తున్నా..పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సారా ఏరులై పారుతూ మందుబాబులను అనారోగ్యం బారిన పడేస్తోందని వాపోతున్నారు. కాగా తాలూకా పోలీసులు ఇటీవల సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా నారమాకులతాండాలో వరుస దాడులు నిర్వహించి 18 వేల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. అలాగే 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా తాండాల్లో దాడులు కొనసాగుతున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు.


సారా జోలికెళ్లడం నేరం..

- కె.రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె

నాటుసారా జోలికెళ్లడం చట్టరీత్యా నేరం. సారా కేసుల్లోని పాత నేరస్థులను బైండోవర్‌ చేసి తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచాం. సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రాలేదు. ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నా..మళ్లీ సారా జోలికెళుతున్నారు. కేసుల్లో చిక్కుకుంటే శిక్ష తప్పదు. సారా వ్యాపారంపై ఉక్కుపాదం మోపాం. ఉదయం, సాయంత్రం వేళల్లో పట్టణ శివారు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి కట్టడి చేస్తున్నాం. సారాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.



Updated Date - 2022-04-17T05:09:01+05:30 IST