జోరుగా ఇసుక దందా

ABN , First Publish Date - 2022-06-26T06:10:55+05:30 IST

జిల్లాలోని మంజీరా నదిలో గత రెండేళ్లుగా ఇసుక క్వారీల నుంచి టీఎస్‌ఎండీసీ తవ్వకాలు జరిపింది. ఇటీవల కాలంలో కలెక్టర్‌ క్వారీల్లో తవ్వకాలను నిలిపివేశారు. అయితే ఇసుక కాంట్రాక్టర్‌లు, ఇసుకాసురులు ఈ క్వారీల నుంచి ఇసుక అక్రమ రవాణా చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

జోరుగా ఇసుక దందా
బిచ్కుంద, బీర్కూర్‌ మంజీరాలోని క్వారీల నుంచి జేసీబీతో తవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు

- అభివృద్ధి పనుల పేరిట ఇసుక దందా

- డబుల్‌బెడ్‌రూం పనులకని ప్రైవేట్‌కు తరలిస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు

- మంజీరా నుంచి రాత్రుల్లో గుట్టుగా ఇసుక  రవాణా

- బిచ్కుంద, బీర్కూర్‌ క్వారీల నుంచి తరలింపు

- క్వారీలను మూసివేసినప్పటికీ ఆగని ఇసుక తవ్వకాలు

- మంజీరా ఒడ్డున బారీగా డంప్‌ చేస్తున్న ఇసుకాసురులు

- స్థానిక నేతలు, అధికారుల అండదండలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

- పట్టించుకోని ఉన్నతాధికారులు


కామారెడ్డి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మంజీరా నదిలో గత రెండేళ్లుగా ఇసుక క్వారీల నుంచి టీఎస్‌ఎండీసీ తవ్వకాలు జరిపింది. ఇటీవల కాలంలో కలెక్టర్‌ క్వారీల్లో తవ్వకాలను నిలిపివేశారు. అయితే ఇసుక కాంట్రాక్టర్‌లు, ఇసుకాసురులు ఈ క్వారీల నుంచి ఇసుక అక్రమ రవాణా చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి పనులు, డబుల్‌బెడ్‌రూంల నిర్మాణం పేరిట మంజీరాలోని ఇసుక క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక లారీలకు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు ఇసుకను తరలిస్తున్నామంటూ స్టిక్కర్లు పెట్టి ప్రైవేట్‌కు అమ్ముతూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. పగలు రాత్రులు అని తేడా లేకుండా ఏకంగా ప్రభుత్వ ఇసుక క్వారీల నుంచే వందల లారీల కొద్ది ఇసుకను ప్రైవేట్‌కు తరలిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల అండదండలతోనే ఇసుకాసురులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక క్వారీల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు మామూలుగానే తీసుకోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. 

మంజీరాను తోడేస్తున్నారు

జిల్లాలో నిజాంసాగర్‌, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్‌ మండలాల మీదుగా మంజీరా నది ఉంది. ఈ మంజీరా నదిలో చాలానే ఇసుక క్వారీలు ఉండేవి. గతంలో ఈ క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలతో కలెక్టర్‌ తవ్వకాలను నిలిపివేశారు. కేవలం ప్రభుత్వ పథకాల నిర్మాణాలకు మాత్రమే ఇసుక తవ్వకాలు అనుమతినిస్తున్నారు. ఇసుక క్వారీలలోని ఆరు పాయింట్లలోంచి కేవలం ఒక ఇసుక పాయింట్‌ నుంచి మాత్రమే ప్రభుత్వ పనులకు ఇసుకను తీసుకువెళ్లాలని అధికారులు అనుమతి ఇచ్చారు. బిచ్కుంద, బీర్కూర్‌ల ఇసుక క్వారీల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న ఇసుక మాఫియా, స్థానిక చోటామోటా నాయకులు ఇసుకను అక్రమంగా తరలించేందుకు తెరలేపుతున్నారు. అధికారుల అండదండలతో కాంట్రాక్టర్ల ముసుగులో మంజీరాను తోడేస్తూ రాత్రులకు రాత్రులే టిప్పర్‌లను, ఇసుకను జిల్లా సరిహద్దులను దాటించేస్తూ జోరుగా దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మంజీరా నది నుంచే కాకుండా బీబీపేట్‌ మండలంలోని తుజాల్‌పూర్‌లో కూడెల్లి వాగులోనూ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

అభివృద్ధి పనులంటూ పక్కదారి పట్టిస్తున్నారు

మంజీరా నది ఇసుకకు హైదరాబాద్‌ మహా నగరంతో పాటు మహారాష్ట్ర, కర్నాటకలో మంచి డిమాండ్‌ ఉంటుంది. మంజీరా నది సరిహద్దు ప్రాంతాలైనా హైదరాబాద్‌, మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇసుకాసురులకు సులువుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలోని మంజీరానదిలో బిచ్కుంద, బీర్కూర్‌ క్వారీల నుంచి అభివృద్ధి పనుల కోసం ప్రస్తుతం ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూం, రహదారుల, ఇతర సీసీ రోడ్ల నిర్మాణ పనులు, పంచాయతీరాజ్‌ భవనాలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాల కోసం స్థానికంగా రెవెన్యూ అధికారులు ఇసుకను తవ్వుకునేందుకు మంజీరాలో అనుమతులు ఇస్తున్నారు. దీంతో బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బిచ్కుంద, పిట్లం తదితర మండలాల్లోని స్థానికంగా ఉండే చోటమోట నాయకులు స్థానిక అధికారుల అండతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాన్సువాడలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల పేర్లు చెప్పి ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. డబుల్‌ బెడ్‌రూం, జాతీయ రహదారుల నిర్మాణానికి కాంట్రాక్టర్ల ముసుగులో కొందరు నాయకులు, ఇసుక వ్యాపారులు మంజీరా నది నుంచి నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్‌లను, లారీల ద్వారా లోడ్‌ల కొద్దీ ఇసుకను తరలిస్తున్నారు. 

అనుమతులు లేకుండానే ఇసుక డంప్‌లు

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో భవన నిర్మాణాలు చాలానే పెరిగాయి. అపార్ట్‌మెంట్‌ల కల్చరల్‌ సంతరించుకోవడంతో బారీ అంతస్తుల భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాల్లోనూ భవన నిర్మాణాలు బారీగానే జరుగుతున్నాయి. నిర్మాణానికి ప్రధానంగా కావాల్సింది ఇసుక. ఇసుకకు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంటుంది. దీనిని అదునుగా తీసుకుంటున్న ఇసుక వ్యాపారులు జిల్లాలోని మంజీరా నది, కూడెల్లి వాగులతో పాటు ఇతర వాగుల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి అక్రమంగా ఇసుకను తీసుకవస్తూ నింబధనలకు విరుద్ధంగా డంప్‌లు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ ఇసుక డంప్‌లను వ్యాపారులు నిల్వ చేస్తున్నారు. బారీ కంటైనర్‌లు, లారీలు, టిప్పర్‌ల ద్వారా ఇసుకను పట్టణాలు, మండల కేంద్రాల నుంచి తరలిస్తుండటంతో ప్రధాన రహదారులు ధ్వంసం అవుతుండటమే కాకుండా ప్రమాదాలకు కారణమవుతున్నాయంటు స్థానిక ప్రజలు ఇసుక లారీలను అడ్డుకుంటున్నప్పటికీ వ్యాపారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని యంత్రాంగం

జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ పథకాల పేరిట  కాంట్రాక్టర్లు, ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇసుకను జిల్లా సరిహద్దుల మీదుగా దాటిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంజీరా నది నుంచి ప్రభుత్వ పథకాలకై ఇసుకను కాంట్రాక్టర్లు తీసుకవచ్చి పట్టణ, మండల కేంద్రాల్లో డంప్‌లు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఆ డంప్‌లను ప్రభుత్వ పనులకు కాకుండా ఇసుకను హైదరాబాద్‌ లాంటి మహానగరాలకు తరలిస్తూ దందాను జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, భిక్కనూరు, దోమకోండ మండలాల్లో పోలీసుల తనిఖీల్లో ఇసుకలారీలను సీజ్‌ చేసిన సంఘటనలు చూస్తుంటే జిల్లా నుంచి అక్రమంగా ఇసుక ఎంత తరలిపోతుందో తెలుస్తోంది. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు మరింత దృష్టి సారించి అక్రమ ఇసుకను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-06-26T06:10:55+05:30 IST